Peddireddy : ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉద్యోగులు కరోనాతో చనిపోతే రూ.10 లక్షల పరిహారం : మంత్రి పెద్దిరెడ్డి
AP Minister Peddireddy Ramachandra Reddy : కరోనా వేళ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఒక వేళ దురదృష్టవశాత్తూ కరోనా వచ్చి చనిపోతే..

AP Minister Peddireddy Ramachandra Reddy : కరోనా వేళ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఒక వేళ దురదృష్టవశాత్తూ కరోనా వచ్చి చనిపోతే పది లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. అంతేకాదు, కొవిడ్ బారినపడి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగికి నెల జీతం అడ్వాన్స్‌గా చెల్లిస్తామని ఆయన చెప్పారు. నాలుగు జిల్లాల ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లతో మంత్రి పెద్దిరెడ్డి వెబ్ఎక్స్ సమావేశం నిర్వహించిన సందర్భంలో ఈ ప్రకటన చేశారు. కిందటి సంవత్సరం ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు సాధించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో అంతకుమించి ఫలితాలు సాధించాలని మంత్రి పెద్దిరెడ్డి ఉపాధి హామి సిబ్బందిని కోరారు. కూలీలకు ఎక్కువ పనిదినాలను కల్పిస్తే దాని ద్వారా మెటీరీయల్ వాటా ఎక్కువ సాధించగలుగుతామని మంత్రి వివరించారు. వాటితో గ్రామీణ మౌలిక సదుపాయాలు నిర్మించుకోవచ్చన్నారు. జూన్ నెలాఖరుకు 16 కోట్ల పని దినాలను పూర్తి చేస్తే, కేంద్రాన్ని అదనంగా ఆడగవచ్చని మంత్రి ఉపాధి హామీ సిబ్బందికి వెల్లడించారు.
రోడ్లకిరువైపులా మొక్కల పెంపకం, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటడం, బ్లాక్ ప్లాంటేషన్ వంటి పనులను చేపట్టాలని ఆదేశించారు. జలశక్తి అభియాన్ పనులను వర్షాకాలంలోపు పూర్తి చేయాలన్నారు. ‘వైఎస్ఆర్ జలకళ’ పథకంలో భాగంగా 5 ఎకరాల లోపు ఉన్న ప్రతి పేదరైతుకి ఉచితంగా బోరు వేయించేలా ప్రాజెక్ట్ డైరెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి ఈ సందర్భంగా ఆదేశాలిచ్చారు.
Read also : INS Rajput : నలభైఒక్కేళ్లపాటు భారత నావికాదళానికి కొండంత అండగా నిలిచిన ‘ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్’ నిష్క్రమణ నేడే