Kakinada District: ఓ ఇంట్లోకి దూరేందుకు పెద్ద పులి విశ్వ ప్రయత్నం.. గేటును పంజాలతో రక్కేసిన వైనం
19 రోజులైనా ఆ పల్లెల్లో భయం పోలేదు. బయట అడుగు పెట్టాలంటేనే వణుకుతున్నారు అక్కడి రైతులు. పోతులూరు, ఒమ్మంగి, పొదురుపాక గ్రామాల్లో, ప్రస్తుతం పులి ఊసులు తప్ప వేరే మాట వినిపించడం లేదు.
Andhra Pradesh: కాకినాడ జిల్లాలో పెద్దపులి అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. దాన్ని పట్టుకోవడానికి ఎన్ని ఎత్తులు వేసినా, చిక్కకుండా తిరుగుతోంది. ప్రత్తిపాడు మండలంలో ఒమ్మంగి గ్రామ సమీపంలోని సరుగుడు తోటల్లో, పెద్దపులి ఆనవాళ్లు కనిపించినప్పటి నుంచి ఆ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు ఉండటం లేదు. తాజాగా ఏలేశ్వరం మండలం( Yeleswaram Mandal) లింగంపర్తి(Lingamparthi) గ్రామంలో ఓ ఇంటి గేటు తీసేందుకు విశ్వ ప్రయత్నం చేసింది పెద్ద పులి. ఇంటి బయట గేట్‌కి పులి తన పంజాతో రక్కిన గీతలు ఉన్నాయి. దీంతో కుటుంబ సభ్యులు హడలెత్తిపోయారు. పులి ఎంటరయ్యేందుకు ప్రయత్నం చేసిన ఇంటిని అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. కాలి ముద్రలను సైతం గుర్తించారు. చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పులి బాధను తప్పించడానికి అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దానంతట అది అడవికి వెళ్లేలా చేసినా అది సాధ్యపడలేదు. బోనుల్లో బంధించాలని చూసినా తప్పించుకుంటోంది. రెండోసారి బోను చూసి పక్కనుంచి వెళ్లిపోయింది. ట్రాపింగ్ కెమెరాల్లో దాని తెలివి చూసి అవాక్కవుతున్నారు అధికారులు. పోతులూరు, ఒమ్మంగి, పొదురుపాక పాండవులపాలెం, శరభవరం గ్రామాల మధ్య సరుగుడు తోటలు, దట్టమైన చెట్లతో ఉండే మెట్టల్లో ఇది సంచరిస్తోంది. రోజూ 15 కిలోమీటర్ల మేర పులి ప్రయాణం ఉంటోందని చెబుతున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. పులిని బంధించడానికి ఆత్మకూరు నుంచి ఎన్‌ఎస్‌ఆర్టీ టీమ్ కూడా వచ్చింది. దాదాపు 120 మంది క్షేత్రస్థాయి సిబ్బంది, చీఫ్ కన్జర్వేటర్ నుంచి సెక్షను స్థాయి అధికారి వరకూ మరో 30 మంది పులి ప్రభావిత ప్రాంతంలో విధుల్లో ఉన్నారు. పులులను పట్టుకోవడంలో చేయి తిరిగిన నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌కు చెందిన 16 మంది కూడా పెద్దిపాలెం వచ్చారు. రెండు బృందాలుగా ఏర్పడి 8 బోనులు ఏర్పాటు చేశారు. పులి బోనుకు చిక్కకపోతే మత్తుమందు ఇచ్చేందుకు వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ అండ్ రెస్కూ పార్టీ ప్లాన్ చేస్తోంది.