AP: పెళ్లి కోసం అలంకరించిన మండపంలోనే ఆమె మృతదేహం.. పసుపుతాడుకు బదులు ఉరితాడు

ఏపీలో నవవధువుల వరుస మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. విశాఖలో పెళ్ళిపీటలపైనే మృత్యువు ఒడికి చేరిన సృజన ఘటన మరువక ముందే ఏలూరు జిల్లాలో మరో నవవధువు మెడలో పసుపుతాడు పడకుండానే ఉరితాడు బిగించుకుంది.

AP: పెళ్లి కోసం అలంకరించిన మండపంలోనే ఆమె మృతదేహం.. పసుపుతాడుకు బదులు ఉరితాడు
New Bride Death
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 08, 2022 | 3:24 PM

Eluru District: భాజా భజంత్రీలు. బంధుమిత్రుల రాకతో పెళ్లి వేడుక కళకళలాడుతుంది. బంధువులు, కుటుంబ సభ్యుల సంబరం అంబరాన్నంటుతోంది. పచ్చటి పెళ్ళి పందిరి. తోరణాల కళ వాడనేలేదు. కాళ్ళ పారాణి ఆరనేలేదు. మరికొద్దిసేపట్లో పెళ్ళి పీటలమీద కూర్చోవాల్సిన నవ వధువు ఉరితాడుకి శవమై వేళ్ళాడింది. ఈ ఘటన ఏలూరు ప్రాంతంలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే..  జాజులకుంట(Jajulakunta)కు చెందిన అలేఖ్య అనే యువతికి కొయ్యల గూడెం(Koyyalagudem) మండలం రాజవరం గ్రామానికి చెందిన బుచ్చిబాబు అనే వ్యక్తితో ఈ నెల 9న వివాహం చేయడానికి పెద్దలు నిర్ణయించారు. పది రోజుల క్రితం ఘనంగా వీరిరువురికి నిశ్చితార్థం జరిగింది.

అయితే అలేఖ్యకు దేవరపల్లిలో టిటిసి చదువుతున్న సమయంలో నల్లజర్లకు చెందిన రవితేజ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ తరువాత వాళ్ళిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం అలేఖ్య విజయవాడలో డిగ్రీ చదువుతూ కమ్యూనికేషన్ స్కిల్స్, మరియు డేటా ఎంట్రీలో శిక్షణ పొందుతోంది. ఇదే క్రమంలో ఈ యువతికి పెళ్లి కుదిరింది. అయితే గతంలో ప్రేమించిన యువకుడు రవితేజ పెళ్ళికొడుకు బుచ్చిబాబుకి తాను అలేఖ్య ప్రేమించుకున్నామని చెపుతూ, అలేఖ్యతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు అతనికి పంపించడంతో ఈ రెండు కుటుంబాల్లో కలకలం రేగింది. పెళ్ళికొడుకు బుచ్చిబాబు అలేఖ్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అది తెలుసుకున్న అలేఖ్య మనస్థాపం చెంది గదిలోకి వెళ్లి చీరతో ఫ్యానుకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఘటనపై అలేఖ్య తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలేఖ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలేఖ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె పెళ్లి కోసం వేసిన షామియానా, అలంకరించిన మండపంలోనే ఆమె మృతదేహాన్ని చూసి బంధువులు, స్థానికులు బోరున విలపిస్తున్నారు.

ద్వారకాతిరుమల మండలం జాజులకుంట లో జరిగిన ఈ నవవధువు ఆత్మహత్య పెళ్ళింట అంతులేని విషాదాన్ని నింపింది. పెళ్ళిళ్ళల్లో పెను విషాదాన్ని నింపుతోన్న నవ వధువుల వరుస మరణాలు యావత్‌ సమాజాన్ని హడలెత్తిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన సర్వత్రా సంచలనంగా మారింది. యువతి ఆత్మహత్యకు కారణమైన యువకుడిపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు.

Alekhya

ఆత్మహత్య చేసుకున్న అలేఖ్య(File Photo)