AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఎస్సీ వర్గీకరణపై ఏపీ ప్రభుత్వం ముందడుగు.. ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం 

సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ ఉప వర్గీకరణపై ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. అందులో భాగంగా ఎస్సీ ఉప వర్గీకరణపై నిర్దిష్టమైన సిఫార్సులు సూచించటానిక రిటైర్డు IAS రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

Andhra News: ఎస్సీ వర్గీకరణపై ఏపీ ప్రభుత్వం ముందడుగు.. ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం 
Sc Classification
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Dec 17, 2024 | 7:39 AM

Share

ఏకసభ్య కమిషన్ 60 రోజులు లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. అయితే ఇప్పటికే ఆ కమిషన్ తన పని షురూ చేసింది. ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ముందుగా శ్రీకాకుళం జిల్లా నుండి ప్రజాభిప్రాయ సేకరణను ప్రారంభించింది. అందులో భాగంగా సోమవారం శ్రీకాకుళం జిల్లాలో కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పర్యటించారు. కలెక్టరేట్ మీటింగు హాల్‌లో ఎస్సీ వర్గీకరణపై ప్రజాభిప్రాయం, వినతులు సేకరణ చేపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణకు మంచి స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుండి దళిత సంఘాల నాయకులు, ఉద్యోగులు, ప్రజలు భారీగా తరలివచ్చి కమిషన్‌‌కి తమ అభిప్రాయాలను తెలియజేస్తూ వినతి పత్రాలను సమర్పించారు.

ప్రజాభిప్రాయ సేకరణలో రసాభస

కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోన్న క్రమంలో కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ముందే వర్గీకరణకు అనుకూల, ప్రతికూల వాదుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వినతులు సమర్పించటానికి వచ్చిన వారంతా మీటింగ్ హాల్‌లో రెండు వర్గాలుగా విడిపోయి వర్గీకరణ చేయాలని, వద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కాసేపు కాసేపు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రసాభసగా మారిపోయింది. అయితే వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను సముదాయించి శాంతింప చేశారు. అనంతరం పోలీసుల పర్యవేక్షణలో కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ సందర్భంగా పలువురు ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, వద్దని మరికొందరు సూటిగా తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఎస్సీలలో బాగా వెనుకబడిన కులాల వారికి రిజర్వేషన్ శాతం పెంచితే సరిపోతుందని వర్గీకరణ అవసరం లేదని మాల కులస్తుల పలువురు తమ అభిప్రాయం తెలియజేశారు. ఇక మరికొందరు ఎప్పుడో ఉన్న గణాంకాలను బట్టి వర్గీకరణ చేపట్టకూడదని.. తాజాగా కులగణను జరిపాకే వర్గీకరణ చేపట్టాలని ఇలా అనేక రకాల అభిప్రాయాలు కమిషన్ దృష్టికి వచ్చాయి. విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రంగాలలో ఆయా ఉప కులాల ప్రాతినిథ్యంపైన కొందరు చర్చించారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం కమిషన్ ZP సమావేశ మందిరంలో కలెక్టర్, SP సమక్షంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులతోను కమిషన్ సమావేశం అయింది. జిల్లా విస్తీర్ణం, జనాభా, కులాల ప్రాతిపదికలపై పలు వివరాలను అధికారుల నుంచి కమిషన్ ఛైర్మన్ సేకరించారు.

ఈ నెల 19 వరకు కమిషన్ జిల్లాల పర్యటన

ఈనెల 19 వరకు జిల్లాలో పర్యటించి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రజాభిప్రాయసేకరణ చేపట్టనుంది. సోమవారం శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగించుకుని మంగళవారం విజయనగరం జిల్లా తర్వాత విశాఖపట్నం, కాకినాడ జిల్లాలలో కమిషన్ పర్యటించనుంది. ఎస్సీ వర్గీకరణపై ఆయా కులాల వ్యక్తులు, సంస్థలు, ఉద్యోగుల నుండి వారివారి అభిప్రాయాలను తెలుసుకోనుంది.

జనవరి 9 వరకు వినతుల స్వీకరణకు అవకాశం

ఎవరైనా తమ విజ్ఞప్తులను నేరుగా సమర్పించలేక పోయినట్లయితే, గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయం, విజయవాడలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ కార్యాలయంలో మెమోరాండం అందజేసేందుకు కమిషన్ చైర్మన్ మిశ్రా అవకాశం కల్పించారు. ఇంకా అక్నాలెడ్జ్మెంట్‌తో కూడిన పోస్టు లేదా omcscsubclassification@gmail.com అనే ఈమెయిల్ ద్వారా 2025 జనవరి 9 వరకూ తమ విజ్ఞప్తులను సమర్పించవచ్చని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి