Andhra News: విరబూసిన బ్రహ్మ కమలాలు.. నిజమేనా.. ఒక్క చెట్టుకు ఇన్నా…?
బ్రహ్మకమలం పుష్పం అంటే హిందువులకు అతి ప్రాధాన్యమైన పుష్పం. ఒక మొక్కను సంవత్సరం అంతా జాగ్రత్తగా పెంచితే ఏడాదికి కేవలం ఒక పువ్వు మాత్రమే పూస్తుంది. అలా పూసే ఒక్క బ్రహ్మకమలాన్నే అదృష్టపుష్పంగా భావిస్తారు. బ్రహ్మకమలం కోసి దేవుడు సన్నిధిలో ఉంచి తమ కోరికలు దేవుడికి చెప్పుకుంటే కోరిన కోర్కెలు తీరతాయని హిందువుల విశ్వాసం. సంవత్సరానికి ఒక్కసారి ఒక్క పువ్వు మాత్రమే పూసే ఈ బ్రహ్మకమలం మొక్కను అత్యంత జాగ్రత్తగా పెంచుతూ ఆ మొక్కకు బ్రహ్మకమలం పుష్పం ఎప్పుడు పూస్తుందా అని నిత్యం ఎదురు చూస్తూనే ఉంటారు.
హిమాలయాల్లో అధికంగా ఉండే ఈ బ్రహ్మ కమలం మొక్కలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎక్కువ పెంచుతుంటారు. బ్రహ్మా కమలం ఉత్తరాఖండ్ రాష్ట్ర అధికారిక పుష్పంగా ఉంది. ఇటీవల కాలంలో ఈ మొక్కలను పలువురు హిందువులు తమ పెరట్లో వేసుకొని అతి సున్నితంగా పెంచుతున్నారు. ఆ మొక్కకు నిత్యం పూజలు సైతం చేస్తున్నారు. బ్రహ్మ కమలం అంటే సాక్షాత్తు బ్రహ్మ అంశతో జన్మించిన పుష్పంగా భావిస్తారు. బ్రహ్మ కమలం పుష్పించిందంటే ఆరోజు ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు ఉండవు. బ్రహ్మ కమలం వికసించిన రోజు మొక్కకు ప్రత్యేక పూజలు చేసి బ్రహ్మ కమలాన్ని కోసి దేవాలయంలో స్వామివారి పాదాల వద్ద ఉంచి తమ కోరికలు చెప్పుకుంటారు. అలా హిందువులలో బ్రహ్మ కమలంకు ప్రత్యేక విశిష్టత ఉంది. అంతటి ప్రాధాన్యత గల బ్రహ్మకమలం ఇప్పుడు విజయనగరం జిల్లా బొబ్బిలిలోని వ్యాపారి కొత్తా రాజా ఇంట్లో వికసించింది.
అయితే ఆ మొక్కకు ఒకటి, రెండు కాదు ఏకంగా 39 బ్రహ్మ కమలాలు ఒకేరోజు పోశాయి. ఎప్పటిలాగే తెల్లవారుజామున పెరట్లోకి వెళ్లే సరికి బ్రహ్మ కమలం మొక్కకు పూసిన 39 పుష్పాలు చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చి బ్రహ్మా కమలాలను ఆసక్తిగా తిలకించారు. కేవలం ఒక పువ్వు మాత్రమే పూసే బ్రహ్మకమలం తమ ఇంట్లో మాత్రం 39 పుష్పాలు పూసిందంటే అంతకన్నా అదృష్టం ఏముంటుందని మురిసిపోతున్నారు. దీంతో ప్రత్యేక పూజలు చేసి ఆ పుష్పాలను తొలగించి దేవాలయంలో స్వామివారి పాదాలు వద్ద ఉంచారు. ఒక పుష్పం పూస్తేనే ఎంతో మేలు జరుగుతుందని భావించే తమకు ఏకంగా 39 పుష్పాలు ఒకేరోజు పోశాయని, బ్రహ్మ తమ పట్ల అనుగ్రహించాడని, తమకు ఇక సిరులు కురుస్తాయని తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు మొక్క యజమాని కొత్తా రాజా కుటుంబసభ్యులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..