AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రైల్లో గర్భిణికి పురిటి నొప్పులు.. వెంటనే అధికారులు ఏం చేశారంటే..?

ఆమె గర్భిణీ.. భర్తతో కలిసి విశాఖ వెళ్లేందుక ట్రైన్ ఎక్కింది. ఇంతలోనే ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కంగారుపడ్డ భర్త ఆర్పీఎఫ్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు.. ఆమెకు సాఫీగా ప్రసవం జరిగిలే చర్యలు తీసుకున్నారు. అధికారుల చొరవతో మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది.

Andhra Pradesh: రైల్లో గర్భిణికి పురిటి నొప్పులు.. వెంటనే అధికారులు ఏం చేశారంటే..?
Pregnant Woman Delivers In Train
S Srinivasa Rao
| Edited By: Krishna S|

Updated on: Sep 06, 2025 | 9:39 PM

Share

ప్రయాణ సమయంలో గర్భిణులకు అంబులెన్స్‌లో పురుడు పోసిన ఘటనలు చాలా చూశాం. తాజాగా ఒక గర్భిణికి రైల్వే స్టేషన్‌లోనే వైద్యులు పురుడు పోసి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్‌లో జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురానికి చెందిన భూలక్ష్మి తన భర్త జానకిరామ్‌తో కలిసి విశాఖపట్నానికి వెళ్లడానికి శుక్రవారం రాత్రి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. రైలు బయలుదేరిన కొద్దిసేపటికే భూలక్ష్మికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. భార్య బాధను చూసి కంగారుపడిన భర్త జానకిరామ్, వెంటనే రైలులోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందికి విషయాన్ని తెలియజేశారు.

ఆర్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తమై వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో శ్రీకాకుళం రైల్వేస్టేషన్ అధికారులు అంబులెన్స్, వైద్యసిబ్బందిని సిద్ధంగా ఉంచారు. రాత్రి 8 గంటలకు రైలు స్టేషన్‌కు చేరుకోగానే, అధికారులు రైలును షెడ్యూల్ సమయం కంటే 15 నిమిషాలు ఎక్కువసేపు ఆపారు. మహిళా డాక్టర్ పల్లా కీర్తి, వైద్య సిబ్బంది వెంటనే రైలులోనే భూలక్ష్మికి పురుడు పోశారు. ఆమె ఒక శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆమె గర్భంలో మరో శిశువు ఉన్నట్లు గుర్తించిన డాక్టర్ కీర్తి.. వెంటనే ఆమెను రాగోలులోని జేమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ జేమ్స్ హాస్పిటల్ వైద్యులు మరో శిశువును సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం తల్లి, ఇద్దరు శిశువులు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

సకాలంలో స్పందించి తమకు సహాయం చేసిన రైల్వే అధికారులు, సిబ్బంది, వైద్యులకు భూలక్ష్మి-జానకిరామ్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనకు సాక్ష్యంగా నిలిచిన రైల్వే ప్రయాణికులు, అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..