AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 ఏళ్లుగా నో లిక్కర్.. చుక్క మద్యం ముట్టని ఈ గ్రామం స్పెషాలిటీ ఏంటో తెలుసా?

అది ఒక చిన్న గ్రామం.. కానీ ఆ ఊరి కట్టుబాటు మాత్రం రాష్ట్రానికే ఆదర్శం. మద్యం మహమ్మారి వల్ల సంసారాలు కూలిపోతుంటే, ఆ ఊరి పెద్దలు తీసుకున్న ఒక నిర్ణయం వందలాది కుటుంబాల్లో వెలుగులు నింపింది. గత 20 ఏళ్లుగా ఆ గ్రామంలో ఒక్క మద్యం, బెల్ట్ షాపు కూడా లేదు. తాగాలి అనిపిస్తే కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందే తప్ప, ఊరి పొలిమేరల్లో చుక్క మద్యం కూడా దొరకదు. ఇంతకూ ఆ గ్రామం ఏదనేగా మీ డౌట్.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

20 ఏళ్లుగా నో లిక్కర్.. చుక్క మద్యం ముట్టని ఈ గ్రామం స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Alcohol Ban Andhra Pradesh
Fairoz Baig
| Edited By: |

Updated on: Mar 22, 2026 | 6:31 PM

Share

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం గోపాలపురం ఒక ప్రత్యేకమైన భౌగోళిక, ఆధ్యాత్మిక నేపథ్యం కలిగిన గ్రామం. ఈ గ్రామంలో సింగరకొండపై వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉండగా, తూర్పున ఆంజనేయ స్వామి ఆలయం, పడమర వైపు గోపాలపురం గ్రామం ఉంటుంది. ఆంజనేయ స్వామి గుడి పక్కనే ఉన్న భవనాసి చెరువు గ్రామస్తులకు జీవనాధారం. గోపాలపురం గ్రామంలో సుమారు 800 మంది జనాభా ఉన్నారు. వీరిలో మెజారిటీ ప్రజలు భవనాసి చెరువులో చేపల వేట సాగిస్తూ, మరికొందరు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు.

గతంలో చేపల వేట ద్వారా వచ్చిన సంపాదన అంతా మద్యం కోసమే ఖర్చయ్యేది. దీనివల్ల ఇళ్లలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తేవి. ఈ పరిస్థితిని గమనించిన గ్రామ పెద్దలు 20 ఏళ్ల క్రితం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఊరిలో ఒక్క బెల్ట్ షాపు కూడా వెలవలేదు.

అధికారంలో ఎవరైనా.. కట్టుబాటు ఒక్కటే..

ఈ గ్రామానికి ఉన్న మరో విశేషం ఏమిటంటే, రాజకీయాలతో సంబంధం లేకుండా పంచాయతీ ప్రెసిడెంట్లుగా ఎవరు ఎన్నికైనా ఈ కట్టుబాటును కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఎవరైనా మద్యం తాగాలి అనుకుంటే సుమారు 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్దంకి వెళ్లాల్సిందే. ఊరిలో మద్యం లభించకపోవడంతో చాలామంది ఆ అలవాటుకు దూరమయ్యారు. మద్యం వల్ల కలిగే అనర్థాలను గుర్తించి, స్వచ్ఛందంగా మద్యాన్ని దూరం పెట్టిన గోపాలపురం గ్రామస్తుల నిర్ణయం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us