AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : 18 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఐపీఎల్ మైదానాల్లో ఇక భారతీయ కెప్టెన్ల రచ్చ

IPL 2026 : ఐపీఎల్ 2026లో తొలిసారిగా మొత్తం 10 జట్లకు భారతీయ ఆటగాళ్లే కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో ఈషాన్ కిషన్ బాధ్యతలు చేపట్టడంతో ఈ చారిత్రక రికార్డు నమోదైంది.ఇది భవిష్యత్తులో భారత జాతీయ జట్టుకు మేలు చేస్తుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

IPL 2026 : 18 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఐపీఎల్ మైదానాల్లో ఇక భారతీయ కెప్టెన్ల రచ్చ
Ipl 2026
Rakesh
|

Updated on: Mar 22, 2026 | 6:15 PM

Share

IPL 2026 : ఐపీఎల్ (IPL) చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక అరుదైన రికార్డు ఈ 2026 సీజన్‌లో నమోదైంది. పేరుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయినా, ఇన్నాళ్లూ విదేశీ కెప్టెన్ల హవానే ఎక్కువగా ఉండేది. షేన్ వార్న్ నుంచి మొదలుపెడితే ఆడమ్ గిల్‌క్రిస్ట్, డేవిడ్ వార్నర్, ఫాఫ్ డుప్లెసిస్, ప్యాట్ కమిన్స్ వరకు ఎంతోమంది విదేశీయులు జట్లను నడిపించారు. కానీ, ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. ఐపీఎల్ 2026లో బరిలోకి దిగుతున్న అన్ని 10 జట్లకు భారతీయ ఆటగాళ్లే కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా దూరం కావడంతో, ఆ బాధ్యతలను ఈషాన్ కిషన్‌కు అప్పగించారు. దీంతో ఈ చారిత్రక రికార్డు సాధ్యమైంది.

ఈసారి కెప్టెన్ల జాబితాను పరిశీలిస్తే, ఫ్రాంచైజీలు అనుభవం కంటే యువ రక్తం, నాయకత్వ లక్షణాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్లు స్పష్టమవుతోంది. ముంబై ఇండియన్స్‌ను హార్దిక్ పాండ్యా, చెన్నై సూపర్ కింగ్స్‌ను రుతురాజ్ గైక్వాడ్ నడిపిస్తుండగా.. రాజస్థాన్ రాయల్స్ అనూహ్యంగా రియాన్ పరాగ్‌కు పట్టం కట్టింది. గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మన్ గిల్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు అక్షర్ పటేల్, లక్నో సూపర్ జెయింట్స్‌కు రిషబ్ పంత్ వంటి యువ కిశోరాలు సారథ్యం వహిస్తున్నారు. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బాధ్యతలను రజత్ పాటిదార్ భుజాన వేసుకోగా, గతంలో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ తలరాతను మార్చేందుకు సిద్ధమయ్యారు.

ఈ మార్పు వెనుక భారత దేశవాళీ క్రికెట్ అనుభవం కీలక పాత్ర పోషించింది. ఈషాన్ కిషన్ గతంలో జార్ఖండ్ జట్టును సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా నిలిపిన ట్రాక్ రికార్డ్ కలిగి ఉండటంతో సన్‌రైజర్స్ యాజమాన్యం ఆయనపై నమ్మకం ఉంచింది. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ తమ జట్టులోని సీనియర్ ఆటగాడు అజింక్య రహానేకు బాధ్యతలు అప్పగించి అనుభవానికి పెద్దపీట వేసింది. విదేశీ ఆటగాళ్లు కేవలం బ్యాటింగ్, బౌలింగ్‌కే పరిమితం కావడం వల్ల భారతీయ ఆటగాళ్లకు మైదానంలో వ్యూహాలు రచించే, ఒత్తిడిని జయించే నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది భవిష్యత్తులో భారత జాతీయ జట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుందని క్రికెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us