Srisailam: వాయిదాల పర్వంలో మల్లన్న మహా కుంభాభిషేకం.. హైకోర్టు సీరియస్.. ముహర్తం ఖరారు చేయాలని ఆదేశం..
శక్తి పీఠము, జ్యోతిర్లింగము ఒకే ప్రాంగణంలో కొలువైన శ్రీశైల మహా క్షేత్రంలో మహా కుంభాభిషేకం పై వివాదం నడుస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఏకంగా ఎనిమిది నెలల పాటు వాయిదా వేశారు? అంతేకాదు హైకోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది? దేవదాయ శాఖ అధికారులకు వారం రోజులపాటు ఇచ్చిన గడువులో మహా కుంభాభిషేకం తేదీలను నిర్ణయిస్తారేమో అని భక్తులు ఎదురుచూస్తున్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైలంలో జరగవలసిన మహా కుంభాభిషేకం వాయిదాపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మండిపడింది. గత ఏడాది మేలో జరగవలసిన మహాకుంభాభిషేకం ఎండలు ఎక్కువగా ఉన్నాయనీ, భక్తులు క్షేత్రానికి రాలేరని నెపం చూపిస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ మహాకుంభాభిషేకం వాయిదా వేశారు. ఇది ఇలా ఉంటే అప్పట్లోనే కొంతమంది ఉత్తరాయణం దక్షిణాయనం అంటూ అభిషేకం ఇప్పట్లో చేయకూడదని విమర్శలు సైతం లేవనెత్తారు. ఇది ఇలా ఉంటే మరోపక్క కర్నూలుకు చెందిన వీర శైవ జంగమ తరుపున ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించి శ్రీశైలంలో మహా కుంభాభిషేకం యధావిధిగా జరిగేలా చూడాలని పిల్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం మహా కుంభాభిషేకానికి మంచి ముహూర్తం ఖరారు చేసి వివరణ ఇవ్వాలని సూచించింది.
ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కు ఈవో కు ఉత్తర్వులు జారీచేసినది. అంతలోనే అప్పట్లో శ్రీశైల దేవస్థానం ఈవో లవన్న బదిలీ అవ్వడం మహాకుంభాభిషేకాన్ని వాయిదా వేయడం వీటిపై మళ్లీ కోర్టుకు వెళ్లడంతో .. అభిషేకం వాయిదాపై హైకోర్టు సీరియస్ అయింది. ఏడు రోజుల్లోపు శ్రీశైల దేవస్థానం మహాకుంభాభిషేకం ముహూర్తం ఖరారు చేసి హైకోర్టుకు సమర్పించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కు శ్రీశైలం దేవస్థానం ఈవోకు ఆదేశాలు జారీ చేసింది.
శ్రీశైలంలో జరగాల్సిన మహా కుంభాభిషేకం జాప్యంపై హైకోర్టు సీరియన్
శ్రీశైలంలో జరగాల్సిన మహా కుంభాభిషేకం ఎనిమిది నెలలుగా ఎందుకు వాయిదా వేయాలసి వచ్చిందన్న దేవాదాయశాఖ అధికారులకు హైకోర్టు ముట్టికాయలు వేసింది. వారం రోజుల్లో మహా కుంభాభిషేక ముహూర్తం ఖరారు చేయాలని ఆదేశించింది. శ్రీశైలం దేవస్థానంలో మహాకుంభాభిషేకంపై కమిషనరుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
షెడ్యూల్ ప్రకారం మహా కుంభాభిషేకం, కార్యక్రమాలన్నింటినీ జరిపించేలా దేవస్థానం అధికారులను ఆదేశించాలని కోరుతూ అఖిల భారతి వీరశైవ ధర్మాక ఆగమ పరిషత్ చైర్మన్ సంగాల సాగర్ గత ఏడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. మహా కుంభాభిషేకం, ఇతర కార్యక్రమాల నిర్వహణ విషయంలో గరిష్టంగా ఆరు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని గతంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయనందుకు స్వయంగా తమ ముందు హాజరు కావాలన్న ఆదేశాల మేరకు దేవదాయ శాఖ కమిషనర్ సత్య నారాయణ కోర్టు ముందు హాజరయ్యారు.
మహాకుంభాబిషేకం కార్యక్రమాల నిర్వహణ ముహూర్తం నిర్ణయించేందుకు దేవస్థానం ఏడు నెలలు సమయం తీసుకోవడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఇంత జాప్యం ఎందుకు జరిగిందని ప్రశ్నించింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఆయనను పలు ప్రశ్నలు అడిగింది. వారం రోజుల్లో తగిన ముహూర్తం ఖరారు చేసి, ఆ వివరాలను తమ ముందుంచాలని కమిషనర్ను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది.
మరిన్నీ ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..