అన్ని పార్టీలకు ఆ లోక్ సభ స్ధానం హాట్ సీటే. అక్కడ ఎప్పుడూ అవుట్ సైడర్ల డామినేషనే. ఈ సీట్‌పై అన్ని పార్టీలలో ఆశావహుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అందరూ మహామహులే. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, మాజీ ఎంపీ సీఎం రమేశ్, జీ వి ఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు పోటీలో ఉండగా, తెలుగుదేశం పార్టీ నుంచి గీతం భరత్‌తో పాటు బడా పారిశ్రామిక వేత్తలు, ఎన్ అర్ ఐ లు కొందరు ఈ సీటుపై ఆసక్తి చూపుతున్నారు. ఇక వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీకి దిగుతుండంతో ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నేత బొత్స సతీమణి ఝాన్సి పేరును తాజాగా ప్రకటించింది. ఇక జే డీ లక్ష్మినారాయణ, కే ఏ పాల్ లాంటి వాళ్ళు ఎప్పటినుంచో కర్చిఫ్‌లు వేసుకుని సిద్దంగా ఉన్నారు. ఇంతకీ ఏంటా లోక్‌సభ స్థానం అనే కదా మీ డౌటు. ఒకసారి చూద్దాం రండి.
ఆంధ్రప్రదేశ్‌లోని ఇరవై ఐదు లోక్‌సభ నియోజకవర్గాలలో విశాఖ పార్లమెంట్‌కు ఉండే స్థానం వేరే. రాష్ట్రంలోనే అతి పెద్ద నగరం ఇదే. మెట్రో సిటీ, కాస్మో నగరం, సముద్ర తీర నగరం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన అద్భుత నగరం ఇది. ఇది ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంటుంది. మొత్తం సుమారు 17 లక్షల ఓట్లు తో విశాఖ నగర పరిధిలోని నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాలతో పాటు గాజువాక, భీమిలి, ఎస్ కోట నియోజకవర్గాలతో కలిసి ఉండే విశాఖ లోక్ సభలో స్థానికేతర నేతలదే హవా కొనసాగుతోంది. 2004లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి, 2009 లో పురంధరేశ్వరి, 2014 లో కంభంపాటి హరిబాబు, 2019లో బిల్డర్ ఎం వి వీ సత్యనారాయణలు ఎంపిక అయిన నేపథ్యం ఉంది. దీంతో స్థానికేతరులకు కూడా ఇక్కడ విజయావకాశాలు పుష్కలంగా ఉంటుండడంతో ఎక్కువగా బయట ప్రాంతాల నుంచి పెద్ద నేతలు విశాఖ ను ఆశ్రయిస్తూ ఉంటారు. అందులోనూ ప్రస్తుతం విశాఖ ప్రతిపాదిత రాజధాని గానూ ఉంది. దీంతో విశాఖ లో పాగా కోసం అన్ని పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి.
ఆశ్చర్యంగా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసేందుకు నేతలు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తుండడం విశేషం. విశాఖలో 2014లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసిన కంభంపాటి హరిబాబు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైయస్ విజయమ్మపై సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత ఎంపీ కావడానికి విశాఖ కూడా ఒక కీలకమైన కేంద్రం అని భారతీయ జనతా పార్టీ నేతలు ఆశిస్తూ ఉంటారు.. దీంతో ఈసారి విశాఖ నుంచి పోటీ చేయడానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సిద్ధమవుతున్నట్టుగా సంకేతాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆ పార్టీ కి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా విశాఖపట్నం పైనే దృష్టి పెట్టడం విశేషం.
రాజ్యసభ సభ్యులు జీ వీ ఎల్ నరసింహారావు, సీఎం రమేష్ లకు 2024 ఏప్రిల్ నెలలో ఎంపీగా గడువు ముగియనుంది. సరిగ్గా అప్పుడే లోక్ సభ కు ఎన్నికలు జరుగుతుండడంతో లోక్‌సభకు వెళ్లాలని, అందుకు ఆంధ్రప్రదేశ్ లో విశాఖ నే సరైన స్థానం అని ఇద్దరూ భావిస్తున్నారు. ఇప్పటికే జీ వి ఎల్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించి, చాలా ముందంజలో ఉన్నారు. ఇటీవల జీ వీ ఎల్ ఫర్ వైజాగ్ పేరుతో సంక్రాంతి మహా సంబరాలు, జీ వీ ఎల్ గణతంత్ర దినోత్సవం పేరుతో భారీ సెట్టింగ్ లు, స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు అన్ని వర్గాల సమస్యలను తానే వారి వద్దకు వెళ్ళి వాటిని పదే పదే పార్లమెంట్ లో ప్రస్తావించడం, కొన్నింటికి పరిష్కారం రావడం లాంటి ఘటనలతో జివిఎల్ బీజేపీ లో పోటీ చేసేందుకు ప్రయత్నించే వారిలో ముందు వరుసలో ఉంటారని చెప్పాల్సిన పరిస్థితి అట.
ఇక సీ ఎం రమేష్ తనదైన శైలిలో లాబియింగ్ చేస్తూ టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. దీంతో సీఎం రమేష్ కూడా వీలైనప్పుడు విశాఖ వచ్చి పార్టీ శ్రేణులతో మమేకం అవుతున్నాడు. విశాఖ లో పార్టీ ముఖ్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు, ముఖ్య నేతలు హాజరవుతున్న సమయాలలో సీఎం రమేష్ విశాఖ వచ్చి వెళ్తున్నారు. దీంతో ఇప్పటికే విశాఖ లోక్ సభ నుంచి పోటీ చేయాలన్న నేపథ్యంలో పార్టీ పెద్ద నేతల వద్ద ప్రస్తావించి హామీ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. స్వయంగా ఆ విషయాన్ని సీఎం రమేష్ నే టీవీ9 బిగ్ డిబేట్ లో కూడా చెప్పడం విశేషం.
ఇక అధికార పార్టీ వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎం వి వీ సత్యనారాయణ అసెంబ్లీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈస్ట్ అసెంబ్లీ సమన్వయకర్తగా పార్టీ అతన్ని నియమించింది. తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో, కార్యక్రమాలతో ఎం వి వీ బిజీగా ఉంటున్నారు. దీంతో విశాఖ ఎంపీ అభ్యర్ధిగా బొత్స ఝాన్సీ పేరును ప్రకటించింది అధికార పార్టీ. కానీ ఆశ్చర్యంగా బొత్స ఘాన్సీని విశాఖ పార్లమెంట్ అభ్యర్ధిగా ప్రకటించినా ఇప్పటివరకు ఆమె బయటకు రాలేదు. ఎవ్వరినీ కలవలేదు. కొంతమంది వెళ్లి ఆమెనే కలిసి వస్తున్నారు. కానీ ఆమె మాత్రం కనీసం మాట వరుసకు కూడా ఎక్కడా ఇప్పటివరకు కనీసం బహిరంగంగా ప్రచారం ప్రారంభించకపోవడంపైనా విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే పొత్తు లేకపోతే 2019లో పోటీ చేసిన మురుసుమిల్లి భరత్ అప్పట్లో కేవలం 4000 ఓట్ల తేడాతో అపజయాన్ని చూశారు. దీంతో తిరిగి అతన్నే కొనసాగించాలా? లేదంటే జనసేన – బీజేపీతో పొత్తు ఉంటే ఆ పార్టీకి చెందిన వాళ్ళు ఏమైనా ఈ స్థానాన్ని అడుగుతారా? లేదంటే వైసీపీ బీసీ మహిళా నేతకు అవకాశం ఇచ్చింది. కాబట్టి మరో బీసీ నేతకి ఈ అవకాశాన్ని ఇవ్వనున్నారా తేలాల్సి ఉంది.
ఇక 2019 ఎన్నికల్లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగి మూడో స్థానానికి పరిమితమైన సీబీఐ మాజీ జెడీ వి.వి. లక్ష్మీనారాయణ తాను ఎలాగైనా విశాఖ లోక్‌సభకు పోటీ చేస్తానని చెప్తూ వస్తున్నారు. తాజాగా ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన అంటూ తాను ప్రకటించిన జై భారత్ పార్టీ నేతగా ఒక రోజు దీక్ష కూడా చేశారు. ఆ పార్టీ తరపున ఆయన బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇక రీసెంట్ గా అయితే కేఏ పాల్ తనని ఏకగ్రీవం చేయాలని, మిగతా పార్టీలేవీ తన పైన పోటీ చేసేందుకు ఆసక్తి కూడా చూపడం లేదంటున్నారు. అందుకే వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ డ్రాప్ అయ్యారని, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా సహకారం వస్తుందని, కేవలం భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలే తనపై పోటీకి ఆలోచించుకోవాలంటున్నారు కేఏ పాల్. దీంతో విశాఖ ఎంపీ సీట్ ఇప్పుడు హాట్ సీట్ గా మారింది. ఏ పార్టీలో ఎవరెవరు ఈ స్థానాన్ని దక్కించుకుంటారు? ఎవరికి విజయవకాశాలున్నాయి? లాంటి అంశాలపై విస్తృత చర్చ ప్రస్తుతం జరుగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…