AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ వాసులకు బిగ్ గుడ్‌న్యూస్.. SC, ST, BC కుటుంబాలకు భారీ బెనిఫిట్..!

ఏపీలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు భారీ లబ్ధి చేకూరుతోంది. ఈ పథకం ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు 100% రాయితీతో సోలార్ ప్యానెళ్లు ఉచితంగా లభిస్తుండగా, బీసీలకు రూ. 80,000 వరకు సబ్సిడీ అందుబాటులో ఉంది. గ్రిడ్‌కు మిగులు విద్యుత్‌ను విక్రయించి డబ్బు సంపాదించుకునే అవకాశమూ ఉంది. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!

ఏపీ వాసులకు బిగ్ గుడ్‌న్యూస్..  SC, ST, BC కుటుంబాలకు భారీ బెనిఫిట్..!
Pm Surya GharImage Credit source: AI Image
Balaraju Goud
|

Updated on: Sep 10, 2026 | 10:09 PM

Share

ఉచిత కరెంట్… జీరో విద్యుత్ బిల్లు..! ఇది కేవలం ప్రకటనలకే పరిమితం కాదు, ఇప్పుడు ఏపీలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిజమవుతోంది. భానుడి ప్రతాపానికి విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుతుంటే, అదే ఎండను ఆసరాగా చేసుకుని ఉచితంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ రాయితీలతో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను అందిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో సూర్యకాంతి ఇప్పుడు విద్యుత్ ప్రసాదంగా మారుతోంది. నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా ప్రారంభమైన ‘పీఎం సూర్యఘర్’ పథకం వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో రూఫ్‌టాప్ సోలార్ వినియోగం అనూహ్యంగా పెరిగింది. ఆగస్టు 30 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 4.93 లక్షల సోలార్ రూఫ్‌టాప్ కనెక్షన్లు పూర్తి అయ్యి, ఏపీ జాతీయ స్థాయిలో 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ నేతృత్వంలో సమీక్షలు నిర్వహిస్తూ, సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు వేగవంతం చేస్తున్నారు.

​ఈ పథకంలో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు ప్రభుత్వం అదనపు ఊరటనిస్తోంది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నూటికి నూరు శాతం రాయితీతో సోలార్ ప్యానెళ్లను ఉచితంగా అందిస్తున్నారు. కేంద్రం ఇచ్చే రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఒక్కో ఇంటికి ఒక లక్షా 20 వేల నుంచి 1 లక్షా 25 వేల వరకు వెచ్చిస్తూ, ఎలాంటి ముందస్తు పెట్టుబడి లేకుండా 2 కేవీ లేదా 3 కేవీ సామర్థ్యం గల ప్యానెళ్లను బిగిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని వై.పాలెం నియోజకవర్గంలో 2,661 కుటుంబాలకు గాను 32 కోట్ల 34 వేలు, మార్కాపురం డోర్నాల మండలం చిన్నగుడిపాడు వంటి ప్రాంతాల్లో వందలాది గృహాలకు ఉచిత సోలార్ వెలుగులు అందించారు.

ఇక బీసీ కుటుంబాలకు కూడా అదనపు వెసులుబాటు కల్పించారు. నెలకు 200 యూనిట్ల లోపు వినియోగం ఉన్న బీసీ గృహ వినియోగదారులకు 2 కిలోవాట్ల రూఫ్‌టాప్ సిస్టమ్‌పై కేంద్రం ఇచ్చే 60 వేల రాయితీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 20 వేలు ఇస్తోంది. అంటే మొత్తం 80 వేల సబ్సిడీ లభిస్తుంది. మిగిలిన 40 వేల కోసం బ్యాంకులు తక్కువ వడ్డీతో రుణం అందిస్తాయి. APCPDCL తరపున బ్యాంకు ఋణం 40 వేలు లభిస్తుంది. విద్యుత్ బిల్లుతో పాటు EMI 60 నెలల పాటు చెల్లించాలి. వినియోగదారుడు వాడుకుని మిగులు విద్యుత్ గ్రిడ్ కు పంపడం వల్ల తిరిగి వినియోగదారునికి యూనిట్ కు 2.09 పైసలు డిస్కమ్ చెల్లిస్తుంది. అంటే వినియోగదారుడు విద్యుత్ బిల్లు చెల్లించకుండానే తిరిగి డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది.

ఈ సిస్టమ్ అంతా ఆన్-గ్రిడ్ సాంకేతికతతో పనిచేస్తుంది. ఇళ్లపై ఉత్పత్తి అయిన విద్యుత్ నేరుగా పవర్ గ్రిడ్‌కు అనుసంధానమవుతుంది. ఇంటి వినియోగం పోను మిగిలిన విద్యుత్ గ్రిడ్‌కు వెళ్తుంది. నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందే అవకాశం ఉండటంతో, కరెంట్ బిల్లుల భారం పూర్తిగా తగ్గిపోతుంది. టోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా వినియోగదారులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ​అయితే, కొన్ని ప్రాంతాల్లో నాణ్యమైన ప్యానెళ్ల ఎంపిక, వెండర్ల ఆలస్యం వంటి సమస్యలు ఉత్పన్నమవుతుండటంతో… వినియోగదారులు అనుభవం ఉన్న కంపెనీలను, గుర్తింపు పొందిన టెక్నీషియన్లను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

​పెరుగుతున్న బొగ్గు కొరత, పర్యావరణ మార్పులు, వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో సోలార్ విద్యుత్ అనేది కేవలం ప్రత్యామ్నాయం మాత్రమే కాదు, భవిష్యత్తుకు ఏకైక మార్గం. ప్రభుత్వం ఇస్తున్న ఈ భారీ రాయితీలను సద్వినియోగం చేసుకుంటే కరెంట్ బిల్లుల భారం నుండి శాశ్వత విముక్తి పొందే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోపం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us