Telangana: బడి పిల్లలకు ఎంత కష్టమొచ్చే.. బురద పొలాల మధ్య విద్యార్థుల అవస్థలు.. వీడియో చూడండి..
బడి ఉంది కానీ బాట లేదు.. చదువుల తల్లి ఒడికి చేరాల్సిన చిన్నారులు బురద పొలాల్లో నరకయాతన అనుభవిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గొల్లగూడెంలో దశాబ్దన్నర కాలంగా విద్యార్థులు స్కూల్‌కు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూలు కట్టించి దారి ఇవ్వకుండా మాట తప్పిన ఆ పెద్ద మనిషి ఎవరు? ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదు..? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుంాం..

అక్షరం వెలుగును ఇస్తుంది.. కానీ ఆ అక్షరాన్ని నేర్చుకునేందుకు ఆ చిన్నారులకు నడిచే దారే లేకుండా పోయింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 21వ డివిజన్ పరిధిలోని సుజాతనగర్ మండలం గొల్లగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గత 15 ఏళ్లుగా అనుభవిస్తున్న నరకయాతనకు నిలువెత్తు నిదర్శనమిది. పాఠశాల ఉన్నా.. అక్కడికి చేరుకోవడానికి సరైన దారి లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పంట పొలాల్లోని గట్ల మీదుగానే ప్రమాదకర రీతిలో రాకపోకలు సాగిస్తున్నారు. 2011లో గొల్లగూడెం గ్రామస్తుల విన్నపం మేరకు ప్రభుత్వం ఇక్కడ ప్రాథమిక పాఠశాలను మంజూరు చేసింది. అయితే భవన నిర్మాణానికి స్థలం కొరత ఏర్పడటంతో గ్రామపెద్ద వీర్ల వెంకటేశ్వర్లు ముందుకు వచ్చారు. పాఠశాలకు తన భార్య పేరు పెడితే స్థలంతో పాటు దారి కూడా ఇస్తానని గ్రామస్తులు, అధికారుల సమక్షంలో బాండ్ పేపర్‌పై ఒప్పందం చేసుకున్నారు.
భవన నిర్మాణ కాంట్రాక్ట్‌ను సైతం ఆయనే తీసుకుని పూర్తి చేశారు. అధికారుల నుంచి బిల్లులు కూడా వచ్చాయి. అయితే 2011లో పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు బడికి వెళ్లేందుకు ప్రధాన దారిని మాత్రం ఇవ్వలేదు. ఆ స్థలంలో ఏటా పత్తి, వరి పంటలు సాగు చేస్తూ.. దారి అడిగితే రేపు మాపు అంటూ 14 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్నారని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బురద బాటలు.. జారే అడుగులు
పాఠశాలకు సరైన దారి లేకపోవడంతో చిన్నారులు పుస్తకాల సంచులు మోసుకుంటూ పక్కనే ఉన్న పంట పొలాల గట్ల మీదుగా ప్రమాదకర పరిస్థితుల్లో బడికి వెళ్లాల్సి వస్తోంది. వర్షాకాలంలో ఈ మార్గం బురదమయమై, విద్యార్థులు జారిపడి గాయాలపాలవుతున్నారు. పొలాల్లో విషపురుగులు, పాముల భయం నిత్యం వెంటాడుతోంది. ఉపాధ్యాయులు సైతం ఇదే మార్గంలో నడుచుకుంటూ పాఠశాలకు చేరుకుంటున్నారు.
బోధన బాగున్నా.. తప్పని ప్రైవేటు బాట
ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ విద్యాబోధనలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. అయితే రోజూ పిల్లలు పడే కష్టాలు, భద్రత లేమిని చూసి కలత చెందిన తల్లిదండ్రులు.. ఆర్థిక స్తోమత లేకపోయినా అప్పులు చేసి తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. ‘‘బడికి తన భార్య పేరు పెడితే స్థలంతో పాటు దారి ఇస్తానని గ్రామస్తుల సాక్షిగా బాండ్ రాసిచ్చారు. కాంట్రాక్ట్ తీసుకుని స్కూల్ కట్టి బిల్లులు తీసుకున్నారు. కానీ దారి స్థలంలో పంటలు వేసుకుంటూ తప్పించుకుంటున్నారు. దారి కోసం అడిగితే 14 ఏళ్లుగా తిప్పుకుంటున్నారు’’ గ్రామస్తుల మండిపడుతున్నారు.
స్పందించని అధికారులు.. పెరిగిన నిరసన
గ్రామస్తులు, తల్లిదండ్రులు దశాబ్ద కాలంగా ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి, బాండ్ ఒప్పందం ప్రకారం పాఠశాలకు శాశ్వత దారి సౌకర్యం కల్పించాలని, చిన్నారుల ప్రాణాలకు భద్రత కల్పించాలని గొల్లగూడెం ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
