Andhra Pradesh: ఎలుగుబంట్ల సంచారంతో భయాందోళనలో ప్రజలు.. ప్రకాశం జిల్లాలో ఒకరిపై దాడి
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతోంది. శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ఎలుగుబంట్లు కలకలం రేపిన ఘటనలు మరవకముందే తాజాగా ప్రకాశం జిల్లాలో ఎలుగుల సంచారం భయాందోళన కలిగిస్తోంది....
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతోంది. శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ఎలుగుబంట్లు కలకలం రేపిన ఘటనలు మరవకముందే తాజాగా ప్రకాశం జిల్లాలో ఎలుగుల సంచారం భయాందోళన కలిగిస్తోంది. ప్రకాశంజిల్లా రాచర్ల(Racharla) మండలం గుడిమెట్ల గ్రామంలో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. సమీప అటవీ ప్రాంతం నుంచి ఓ ఎలుగు బంటి గ్రామంలోకి వచ్చింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు ఎలుగుబంటిని అడవుల్లోకి తరిమేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఎలుగుబంటి ఒకరిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఎలుగుబంటి సమాచారం గురించి గ్రామస్థులు అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఎలుగుబంటిని పట్టుకునేందుకు వలలు, ఇతర సామగ్రితో గ్రామానికి చేరుకున్నారు. పట్టకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కాగా.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజలకు ఎలుగుబంట్ల భయం పట్టుకుంది. ఎలుగుబంట్ల సంచారంతో కంటి మీద కునుకు లేకుండా పోతోందని కళ్యాణదుర్గం మండలం ముదిగల్లు వాసులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా జంట ఎలుగుబంట్ల సంచారంతో ఇక్కడి ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అటవీ ప్రాంతంలో చెట్లు నరికి వేయడం వల్ల అవి జనావాసంలోకి వస్తున్నాయి. ఎలుగుబంట్ల(Bears) సంచారంపై అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. అటవీశాఖ అధికారులు మాత్రం అలాంటిదే ఏం లేదని, ఎలుగుబంట్లు తరచూ తమ స్థావరాలను మార్చుకుంటాయని అంటున్నారు. అయితే ప్రజలకు తాము రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.