విశాఖపట్నం, ఆగస్టు 13: ‘‘2019 ఎన్నికల్లో త్రికరణ శుద్ధిగా పనిచేశా.. ఇప్పుడు అలానే గాజువాకకు వచ్చా.. ఇది నా నియోజకవర్గం.. మన నియోజకవర్గం.. జగన్ గెలిచి.. నేను ఓడిపోవడం ఏంటి..? దోపిడీ చేసే వ్యక్తికి 151 సీట్లు ఎలా ఇచ్చారు.. అన్యాయాన్ని నిలదీయడానికి రాజకీయాల్లోకి వచ్చా’’.. అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన వారాహి విజయయాత్ర మూడో విడత మూడోరోజు.. గాజువాక వేదికగా వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. రెండు రోజులుగా ప్రభుత్వంపై వాడీవేడీగా బాణాలు సంధిస్తున్న పవన్ మూడో రోజు గాజువాక బహిరంగ సభలో కూడా అదే విధంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అంతేకాకుండా గాజువాకలో తన ఓటమి, విశాఖ స్టీల్ ప్లాంట్.. తదితర అంశాల గురించి కూడా పవన్ మాట్లాడారు.
స్టీల్ ప్లాంట్ గురించి జగన్ ఒక్కమాట కూడా మాట్లాడలేదని.. ప్లారమెంట్ లో విబేధించే ధైర్యం వైసీపీ ఎంపీలకు లేదంటూ పవన్ పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి తాను ప్రధానితో విబేధించానంటూ తెలిపారు. విశాఖపట్నం రాజధాని చేసి ఏం చేస్తారంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. 2024లో గాజువాకలో ఎగిరేది జనసేన జెండానే అంటూ స్పష్టంచేశారు. తాను తప్పు చేయలేదని.. తన పని తాను చేసుకుపోతానని పవన్ తెలిపారు. విశాఖలో ఐటీని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పవన్ వ్యాఖ్యానించారు.
తాను గాజువాకలో ఓడిపోయానని.. జగన్ గెలిచారని.. తానేం ద్రోహం చేశానంటూ గాజువాకలో పవన్ కల్యాణ్ ఎమోషనల్ అయ్యారు. మీకోసం దేనికైనా సిద్ధమంటూ పేర్కొన్నారు.
ఇంకా జగన్ ను ఆరు నెలలే భరించాలంటూ పవన్ పేర్కొన్నారు. విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో ఇకపై చూపిస్తానంటూ పవన్ కల్యాణ్ వివరించారు. వైసీపీ నేతలు తనపై విమర్శలు చేస్తుంటారని.. అరవడం తప్ప ఇంకెం తెలిదని పేర్కొన్నారు. ఆంధ్రా ఎంపీలంటే ఢిల్లీలో చులకన అంటూ పేర్కొన్నారు.
ఆంధ్రా యూనివర్సిటీ వీసీ సీఎం మద్దతు దారుడని.. ఏయూని దోచేస్తున్నారంటూ పవన్ మండిపడ్డారు. ఏపీలో రాజ్యాంగాన్ని పాటించడంలేదంటూ పేర్కొన్నారు. గంగవరం పోర్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పవన్ కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..