సిద్ధ వైద్యం కోసం వెళ్లిన పేషేంట్ మిస్సింగ్.. పోలీసు విచారణలో దిమ్మతిరిగే నిజాలు.. అక్కడన్నీ అస్తిపంజరాలే..

| Edited By: Jyothi Gadda

Nov 24, 2023 | 7:54 PM

అతనో సిద్దవైద్యుడు. అల్లోపతి, హోమియోపతి ఇలా అనేక ఆస్పత్రులు తిరిగినా నయంకాని జబ్బులు అక్కడకు వెళితే ఇట్టే నయమవుతాయన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాడు. దీంతో బాధితులు క్యూ కట్టడంతో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. కట్ చేస్తే పోలీసులకు అందిన ఓ మిస్సింగ్ కంప్లైన్ట్ తో ఖాకీలు రంగంలోకి దిగారు. విచారణలో దిమ్మతిరిగే విషయం బయట పడింది. ఆ తర్వాత లోతుగా విచారించిన పోలీసులే షాక్ తినే వాస్తవాలు బయటపడ్డాయి.

సిద్ధ వైద్యం కోసం వెళ్లిన పేషేంట్ మిస్సింగ్.. పోలీసు విచారణలో దిమ్మతిరిగే నిజాలు.. అక్కడన్నీ అస్తిపంజరాలే..
Siddha Practitioner
Follow us on

తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని చోళపురంలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది.. కేశవమూర్తి అనే సిద్దవైద్యుడు దశాబ్దం నుంచి సిద్ధ వైద్యం పేరుతో చికిత్స ప్రజలకు చేస్తున్నాడు. పరిసర ప్రాంతాల్లో అతనిది మంచి హస్తవాసి అనే పేరుంది. అదే నిజమని నమ్మి చాలామంది అతని వైద్యం కోసం క్యూ కట్టడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే చోళపురానికి సమీప గ్రామస్తుడు అశోక మూర్తి అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు అశోక మూర్తి కుటుంబ సభ్యులు. ఇంట్లో నుంచి అశోక మూర్తి చివరగా ఎక్కడకు వెళ్లారనేది కుటుంబ సభ్యులను పోలీసులు అడుగగా సిద్ధ వైద్యం కోసం చోళపురం వెళ్లినట్టుగా పోలీసులకు చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సిద్దవైద్యుడిని విచారించగా అశోక్ అనే పేరుతో ఎవరూ రాలేదని చెప్పాడు.

అయితే, సిద్ధ వైద్యుని మాటల్లో తేడాను గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్ తెప్పించారు. ఆస్పత్రి ఆవరణలో అనుమానాస్పదంగా దుస్తుల అనవాళ్లను బయటపడ్డాయి. దాంతో పోలీసులకు అనుమానం పెరిగింది. ఆ ప్రాంతంలో తవ్వడం మొదలు పెట్టారు. ఓ అస్థిపంజరం ఆనవాళ్లు కనిపించాయి. పూర్తి మృతదేహం కనిపించక పోవడంతో తవ్వకాలను కొనసాగించిన పోలీసులకి మైండ్ బ్లాంక్ అయ్యింది. అక్కడ ఇంకా అస్థిపంజరాలు బయట పడుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి జరుపుతున్న తవ్వకాల్లో అనేక అస్థిపంజరాల తాలూకు ఆనవాళ్లు బయట పడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ ఏ ఒక్క అస్థిపంజరం కూడా పూర్తిగా లేదు. తల, కాళ్ళు, మరి కొన్ని ఎముకలు మాత్రమే ఉన్నాయి. రేపు కూడా తవ్వకాలు జరపాలని పోలీసులు నిర్ణయించారు.

అయితే వైద్యం కోసమని తన వద్దకి వచ్చిన వారు ఎందుకు హత్యకు గురయ్యారు అనేది మిస్టరీ. సిద్ధ వైద్యం పేరుతో కేశవ మూర్తి క్షుద్ర పూజలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే హత్యలకు మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. అయితే అశోక మూర్తి కాకుండా మిగిలిన అస్థిపంజరాలు ఎవరివి అన్నది ఇంకా తెలియలేదు. చికిత్స కోసమని వెళ్లి మిస్సయిన వారి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..