AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ongole Cattle: ఒంగోలు జాతి ఆవుకి పునరుజ్జీవం.. ఐవీఎఫ్ ద్వారా క్షేత్ర స్థాయిలో కోడె దూడ జననం..

ప్రస్తుతం మేలురకానికి చెందిన ఒంగోలు జాతి పశువులు అంతరించిపోతున్నాయి. దీంతో నాణ్యమైన పశువుల నుంచి వీర్యాన్ని సేకరించి పిండాభివృద్ధి చేస్తున్నారు. దీన్ని పశువుల గర్భంలోకి ఎక్కించి దూడలకు జన్మనిచ్చేలా చేస్తారు. ఈ విధానం వల్ల ఒక్కో ఆవు తన జీవితకాలంలో దాదాపు 50 దూడల వరకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. అత్యధికంగా 15 దూడలకు జన్మనిచ్చిన తర్వాత సహజసిద్ధమైన కలయిక వల్ల కానీ, కృత్రిమ గర్భోత్పత్తి వల్ల కానీ ఆవులు గర్భం దాల్చడం కష్టమవుతుంది. గాయాలుపాలైనా, వయసుపైబడినా గర్భం నిలవదు. అలాంటి ఆవులు.. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌ సాంకేతికత ద్వారా దూడలకు జన్మనివ్వవచ్చు.

Ongole Cattle: ఒంగోలు జాతి ఆవుకి పునరుజ్జీవం.. ఐవీఎఫ్ ద్వారా క్షేత్ర స్థాయిలో కోడె దూడ జననం..
Ongole Cattle
Fairoz Baig
| Edited By: |

Updated on: Sep 15, 2023 | 1:42 PM

Share

అధునాతన సాంకేతికత ద్వారా ఒంగోలు జాతి జన్యు పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. “ట్రాన్స్ వజైనల్ ఆల్ట్రాసౌండ్ గైడెడ్ ఓవెమ్ పికప్ (OPU) అలాగే “ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ -ఎంబ్రియో ట్రాన్స్ ఫర్” (IVF-ET) టెక్నాలజీతో గత ఏడాది నవంబరులో ఉమ్మడి ప్రకాశం జిల్లా బొల్లాపల్లి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం గోశాల ఆవులో (అద్దె గర్భం, సరోగసీ) మేలురకం ఒంగోలు జాతి పిండాన్ని చదలవాడ పశుఉత్పత్తి క్షేత్రం పశువైద్యులు డా. ఎం. సోమశేఖర్ పిండ గర్భధారణ ప్రక్రియ ద్వారా విజయవంతంగా ప్రవేశ పెట్టారు. ఫలితంగా ఆవు గర్భం దాల్చగా, మూడు రోజుల క్రితం రాత్రి మేలుజాతి ఒంగోలు కోడె దూడకు జన్మనిచ్చింది.

ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, పిండ గర్భధారణ పరిశోధన సాగిందిలా…

పశుగణాభివృద్ధి సంస్థ పశువైద్యులు డా. టి. శ్రీమన్నారాయణ మేలుజాతి ఒంగోలు ఆవు నుండి అండాలను సేకరించగా లాం ఫార్మ్ శాస్త్రవేత్త డా. శ్రీకాంత్ వాటిని ఇన్వీట్రో ఫెర్టిలైజేషన్ తో మేలు జాతి ఆబోతు వీర్యంతో ఫలదీకరణ చేసి 7 రోజులు ప్రయోగశాలలో శాస్త్రీయ విధానంలో పిండాలుగా మార్చి ద్రవ నత్రజనిలో భద్రపరిచారు. సరోగేట్ (అద్దె గర్భం) ఆవును కోలాలపూడి పశు వైద్యులు డా. మాధవీలత ఎంపిక చేయగా, ఆవు ఎదకు వచ్చిన ఏడో రోజున భద్రపరచిన పిండాన్ని అద్దె గర్భంలోకి ప్రవేశ పెట్టడానికి చదలవాడ పశుఉత్పత్తి క్షేత్రం పశువైద్యులు డా. సోమశేఖర్ కృషి చేశారు.

సాధారణంగా సహజ పద్ధతుల్లో ఆవు గర్భం దాల్చి దూడ పుట్టడానికి 9 నెలలు పడుతుంది. ఒక ఆవు తన జీవిత కాలంలో 8 నుండి 10 దూడలకు జన్మనిస్తుంది. ఒంగోలు జాతి అమూల్యమైన జన్యువనరులను అతి వేగంగా వృద్ధి చేయడానికి ఐవిఎఫ్, పిండమార్పిడి పద్ధతితో ఏటా ఒక మేలు జాతి ఆవు నుంచి 150 పిండాలు దాకా ఉత్పత్తి చేసి, 50 నుంచి 60 వరకు దూడలను పొందవచ్చని చదలవాడ పశు ఉత్పత్తి క్షేత్రం ఉపసంచాలకులు డా.బి. రవి తెలిపారు. మేలుజాతి పశువులను తక్కువ సమయంలో వృద్ధి చేసేందుకు ఐవిఎఫ్ అనుకూలమైన పద్దతి అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మనుషులు సరోగసీ పద్ధతిలో గర్భం దాల్చడం ఇప్పుడు కామనే అయినా పశువుల్లోనూ అద్దె గర్భం ద్వారా సంతాన ఉత్పత్తికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. సహజ కలయిక ద్వారా, కృత్రిమ గర్భోత్పత్తి ఇంజక్షన్ల ద్వారా ఆవులు గర్భం దాల్చడానికి అవకాశం ఉంటుంది. ఒక్కో ఆవు తన జీవితకాలంలో 9 నుంచి 15 దూడల వరకు జన్మనిస్తుంది. వాటి సంఖ్యను గణనీయంగా పెంచేందుకు నిపుణులు చర్యలు చేపట్టారు. అందుకు మనుషుల్లో అవలంబిస్తున్న సరోగసీ విధానాన్ని పశువుల్లోనూ ప్రవేశపెట్టేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. అంతరించిపోతున్న ఒంగోలు, పుంగనూరు లాంటి జాతుల పశువుల సంతతిని పెంచేందుకు ‘ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌’ సాంకేతికతను ప్రకాశంజిల్లా చదలవాడ పశుక్షేత్రంలో వినియోగిస్తున్నారు. ఫలితంగా సరోగసి విధానంలో ఆవుకు దూడ జన్మనిచ్చింది. ప్రయోగ ఫలితాలు విజయవంతం కావడంతో రానున్న రోజుల్లో సరోగసీ ద్వారా పశుసంతతిని వృద్ది చేసేందుకు అడుగు ముందుకు పడింది.

ఒంగోలు జాతి ఆవు ప్రత్యేకత ఏమిటంటే

ప్రకాశంజిల్లాలో తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన పాలేరు, ఉత్తరాన గుండ్లకమ్మ , పడమర ముసి నదులు ఉన్నాయి. వీటి మధ్య ప్రాంతాన్ని ఒంగోలు ట్రాక్‌ అంటారు. ఈ ట్రాక్‌లో కరవది, ఉలిచి, నాగులుప్పలపాడు, చేకూరపాడు, దొడ్డవరప్పాడు, టంగుటూరు, కారుమంచి, కామేపల్లి ముఖ్య గ్రామాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో జొన్నచొప్పను రైతులు అధికంగా పండించేవారు. ఇక్కడి నేలల్లో సున్నం, భాస్వరం, ఇతర ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. ఈ నేలల్లో పండిన మొక్కలను ఎక్కువగా ఆహారంగా తీసుకునే ఒంగోలు జాతి పశువులు మంచి ఎముక పుష్టి కలిగి ఏపుగా ఎదిగాయి. ఆహారం, వాతావరణం, భూసారం అనుకూలించడంతో ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలిగే రోగ నిరోధక శక్తి ఈ జాతి పశువులకు లభించింది. పాల ఉత్పత్తి, బరువులు లాగడం, పాల ఉత్పత్తులకు ఈ జాతితో ప్రపంచంలో మరో జాతి పోటీ పడలేదు. వీటి సామర్ధ్యాన్ని పసిగట్టిన ఆనాటి రైతులు వీటిని వ్యవసాయానికి ప్రధాన సాధనంగా వినియోగించారు. వ్యవసాయం చేయడంలో ఒంగోలు జాతి గిత్తలు మంచి పేరు సంపాదించడంతో వేల సంవత్సరాలుగా ఈ జాతి ఎద్దులు రైతుల బంధువులుగా మారిపోయాయి.

ప్రస్తుతం మేలురకానికి చెందిన ఒంగోలు జాతి పశువులు అంతరించిపోతున్నాయి. దీంతో నాణ్యమైన పశువుల నుంచి వీర్యాన్ని సేకరించి పిండాభివృద్ధి చేస్తున్నారు. దీన్ని పశువుల గర్భంలోకి ఎక్కించి దూడలకు జన్మనిచ్చేలా చేస్తారు. ఈ విధానం వల్ల ఒక్కో ఆవు తన జీవితకాలంలో దాదాపు 50 దూడల వరకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. అత్యధికంగా 15 దూడలకు జన్మనిచ్చిన తర్వాత సహజసిద్ధమైన కలయిక వల్ల కానీ, కృత్రిమ గర్భోత్పత్తి వల్ల కానీ ఆవులు గర్భం దాల్చడం కష్టమవుతుంది. గాయాలుపాలైనా, వయసుపైబడినా గర్భం నిలవదు. అలాంటి ఆవులు.. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌ సాంకేతికత ద్వారా దూడలకు జన్మనివ్వవచ్చు. ఏ జాతి పశువులకు చెందిన అండాన్ని ప్రవేశపెడితే.. అదే జాతి దూడ జన్మిస్తుంది. తల్లి లక్షణాలు మాత్రం వాటికి రావని వైద్యులు చెబుతున్నారు.

చదలవాడ పశుక్షేత్రంలో దేశీయ ఆవులు 300 వరకు ఉన్నాయి. ప్రస్తుతం సరోగసీ విధానం ద్వారా ఎక్కువ దూడలను పుట్టించి వెయ్యి పశువుల వరకు మేలుజాతి రకాలను ఉత్పత్పి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అవసరమైన పచ్చిగడ్డి, దాణాలను సమకూర్చుకునేందుకు పశుక్షేత్రం ఆధీనంలో ఉన్న 200 ఎకరాల్లో పచ్చిగడ్డిని పెంచుతున్నారు. సంవత్సరకాలం పాటు గడ్డి లభించేలా చర్యలు తీసుకున్నారు. అధికారులు, పశువైద్యుల కృషి ఫలితంగా చదలవాడ పశుక్షేత్రంలో సరోగసీ విధానంలో పుట్టిన లేగదూడ ప్రస్తుతం అంబా.. అంబా.. చెంగు చెంగున ఎగురుతూ కనువిందు చేస్తోంది. తద్వారా అంతరించి పోతున్న మేలుజాతి రకాలైన ఒంగోలు, పుంగనూరు జాతి పశువులు మరింత అభివృద్ది చెందుతాయి. తొలిసారి చదలవాడ పశుక్షేత్రంలో సరోగసీ విధానంలో మేలుజాతి కోడెదూడ పుట్టడంతో పశుక్షేత్రం అధికారులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..