Central Government: కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. ఆస్పత్రుల్లో రూ.20 లక్షల వరకు ఉచిత వైద్యం.. అర్హతలు ఇవే..
కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించనుంది. రూ.20 లక్షల వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. వారి కుటుంబసభ్యులకు కూడా ఈ పథకం వర్తించనుంది. సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని లాంచ్ చేసింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. వీరి ఆరోగ్య భద్రత కోసం మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మెరుగైన వైద్యం పొందేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం పేరే పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారి కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.20 లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు. సంక్రాంతి కానుకగా మోదీ సర్కార్ ఈ స్కీమ్‌ను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం పరిధిలోని ఉద్యోగులు ఈ కొత్త పథకంతో లబ్ది పొందవచ్చు. కుటుంబంలో ఆరుగురి వరకు ఇది వర్తిస్తుంది.
రూ.20 లక్షల వరకు బీమా
ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబసభ్యులు దేశంలోని ఈ పథకంలో లిస్ట్ అయిన కార్పొరేట్ నెట్‌వర్క్ హాస్పిటళ్లలో రూ.20 లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ సౌకర్యం పొందవచ్చు. వైద్య ఖర్చులు పెరుగుతుండటం, అత్యాధునిక సర్జరీలకు ఎక్కువగా చెల్లించాల్సి వస్తున్న క్రమంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. హాస్పిటల్‌లో చేరిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అన్నీ ఖర్చులను ఈ పథకం భరిస్తుంది. ఇక అద్దె లిమిట్ వచ్చి జనరల్ వార్డులో చేరితే బీమా సొమ్ములో ఒక శాతం, ఐసీయూకు 2 శాతంగా కేంద్రం నిర్ణయించింది. ఇక చికిత్స చేయించుకోవడానికి ఒక నెల ముందు, చికిత్స పూర్తైన తర్వాత రెండు నెలలకు అయ్యే వైద్య ఖర్చులను కూడా ఇది కవర్ చేస్తుంది.
కో పేమెంట్ ఆప్షన్
ఇక ఈ పథకంలో కో పేమెంట్ ఆప్షన్ ఉంది. వైద్య ఖర్చులో 70 శాతం కేంద్రం భరిస్తే.. 30 శాతం పాలసీదారుడు చెల్లించాల్సి ఉంటుంది. కుటుంబంలో ఆరుగురు వ్యక్తులు ఈ పథకం ద్వారా బీమా రక్షణ పొందవచ్చు. పూర్తిగా క్యాష్ లెస్ విధానం అమలు చేయడం వల్ల ముందుగా పాలసీదారుడు డబ్బు చెల్లించి ఆ తర్వాత క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. క్యాష్ లెస్ విధానం వల్ల అత్యవసర సమయాల్లో ఉద్యోగులకు ఇబ్బంది ఉండదు. కేంద్రమే ఆస్పత్రులకు నేరుగా డబ్బులు చెల్లిస్తుంది.
