Coronavirus: మళ్లీ కరోనా కలకలం.. ఒమిక్రాన్ RF 5 వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..?
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌పై ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు నమోదవగా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అధిక కేసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు జిల్లాల్లో మొత్తం 16 కేసులు నమోదవగా, కొన్ని నమూనాల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

దేశంలో కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. జూలై 1 నుంచి దేశంలో 339 కరోనా కేసులు నమోదవడం షాకిస్తోంది. ప్రత్యేకించి.. కేరళలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఒక్క కేరళలోనే ఇప్పటివరకు 115 కరోనా కేసులు నమోదు అవగా.. కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, అండమాన్‌లో 18, ఢిల్లీలో 18, రాజస్థాన్‌లో 12 కేసులతో పాటు.. మరికొన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదు అవున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. ఇక.. కొత్తగా విజృంభిస్తున్న కరోనా వేరియంట్‌ను ఒమిక్రాన్ RF-5గా అధికారులు గుర్తించారు.
ఏపీలో 16 కరోనా కేసులు..
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా రీ-ఎంట్రీ ప్రజలను వణికిస్తోంది. ప్రధానంగా.. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నాలుగు జిల్లాల్లో ఇప్పటివరకు 16 కరోనా కేసులు నమోదు అవడం భయపెడుతోంది. నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్, కడప జిల్లాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. రీసెంట్‌గా నెల్లూరు జిల్లాలో 3 ఏళ్ల బాలుడికి, ఎన్టీఆర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది.
నెల్లూరు జిల్లా నిడిగుంటపాళెంకు చెందిన బాలుడికి క్యాన్సర్ చికిత్స కోసం కుటుంబసభ్యులు ఈ నెల 13న పుదుచ్చేరికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు బాలుడికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.. బాలుడి ఫ్యామిలీతోపాటు సమీప బంధువులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే.. వారందరికీ నెగిటివ్ వచ్చింది.
మరోవైపు.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం రోలుపడికి చెందిన 13 ఏళ్ల బాలికకు కిడ్నీ సమస్య ఉండటంతో విజయవాడ GGHలో డయాలసిస్ చేయిస్తున్నారు. ఈ క్రమంలో.. ఆ బాలిక జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో బాధపడుతుండటంతో వైద్యులు RTPCR టెస్టు చేయగా పాజిటివ్ రావడంతో వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చినట్టు వైద్యులు తెలిపారు.
నలుగురు మృతి..
ఇదిలావుంటే.. ఇప్పటివరకు ఏపీలో 16కేసులు నమోదు అవగా.. నలుగురు మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. బాధితులకు చెందిన శాంపిల్స్ పుణె ల్యాబ్‌కు పంపగా.. నలుగురిలో ఒమిక్రాన్ RF 5 వేరియంట్ నిర్థారణ అయింది. దీంతో.. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. కరోనా కేసుల పెరుగుదలపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులతో సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.
కరోనా ఒమిక్రాన్ RF 5 వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..
కరోనా ఒమిక్రాన్ RF 5 వేరియంట్ లక్షణాలు సాధరణ లక్షణాలే ఉంటాయని.. పెద్దగా ప్రమాదం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, అలసట RF 5 లక్షణాలుగా తెలిపారు. సింగపూర్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో RF 5 కేసులు వెలుగు చూస్తున్నాయని.. RF 5 వేరియంట్‌పై ఆందోళన అవసరం లేదని ఆరోగ్యశాఖ తెలిపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
