Andhra Pradesh: ఒక హత్య.. రెండు పార్టీల రాజకీయాలు.. రక్తం ఒక్కటే.. కథనాలు రెండు..
ఒక వ్యక్తి ప్రాణం పోతే ఆ కుటుంబంలో చీకటి అలుముకుంటుంది. కానీ మన రాజకీయ క్షేత్రంలో మాత్రం ఆ శవం పైనే కుర్చీలాట మొదలవుతుంది. హత్య జరిగిన స్థలంలో పోలీసులు క్లూస్ కోసం వెతుకుతుంటే.. రాజకీయ పార్టీలు మాత్రం తమ మైలేజ్ పెంచే కథనాల కోసం అన్వేషిస్తాయి. అసలు నిజం ఏంటో దర్యాప్తులో తేలేలోపే.. ప్రెస్‌మీట్లు, సోషల్ మీడియా యుద్ధాలు, టీవీ డిబేట్ల హోరులో అబద్ధం ఊరంతా చెక్కర్లు కొడుతోంది.

ఒక మనిషి చనిపోతాడు. కానీ మరుసటి గంటకే రాజకీయాలు మొదలవుతాయి. హత్య జరిగిన చోట పోలీసులు ఆధారాలు వెతుకుతారు. రాజకీయ పార్టీలు కథనాలు వెతుకుతాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎన్నికల కంటే ఎక్కువగా వినిపిస్తున్న పదాలు.. హత్య, దాడి, హౌస్ అరెస్ట్, నిరసన, కౌంటర్ ఆరోపణలు. ఒక హత్య జరగగానే ఒక పార్టీ రాజకీయ హత్య అంటుంది.. మరో పార్టీ వ్యక్తిగత కక్ష అంటుంది. సోషల్ మీడియాలో రెండు కథనాలు వస్తున్నాయి. టీవీల్లో రెండు డిబేట్లు. ప్రెస్‌మీట్లలో రెండు వాదనలు ఉంటున్నాయి. కానీ నిజం గడపదాటే లోపే అబద్దం లోకం చుట్టేసి వస్తోంది. దర్యాప్తు పూర్తయ్యాకే అసలు సంగతి బయటపడుతుంది.
జాతీయ నేర గణాంకాలు, పోలీసు శాఖ వివరాల ప్రకారం.. 2018-2022 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కారణాలతో 16 హత్యలు నమోదయ్యాయి. అదే కాలంలో రాజకీయ హింసతో 244 అల్లర్ల కేసులు నమోదయ్యాయి. అంటే.. సగటున ప్రతి ఏడాది మూడు నుంచి నాలుగు రాజకీయ హత్యలు. దాదాపు యాభైకి పైగా రాజకీయ ఘర్షణలు ఉంటున్నాయి. ఇవి పోలీసు రికార్డుల్లో రాజకీయ కారణాలుగా నమోదైన కేసులు మాత్రమే. 2023లో 922 హత్య కేసులు, 2024లో 898 హత్యల కేసులు నమోదయ్యాయి. మొత్తం హత్యలలో 448 కేసులు వివిధ రకాల వివాదాల వల్ల జరిగాయి. కుటుంబ కలహాలతో 199, చిన్నపాటి గొడవలతో 136, భూమి లేదా ఆస్తి తగాదాలతో 54, ఆర్థిక లావాదేవీలతో 54 కేసులు, నీటి వివాదాలతో 5, ఇతర కారణాలతో 108 కేసులు నమోదయ్యాయి.
రాజకీయ ఘర్షణలు, దాడులు, హత్యల ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. పల్నాడు, కడప, కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాల పేర్లు తరచూ వినిపిస్తుంటాయి. దీనికి ఒక్క కారణం ఉండదు. ఫ్యాక్షన్ చరిత్ర, స్థానిక వర్గపోరు, భూ వివాదాలు, కాంట్రాక్టులు, ఇసుక దందా, గ్రామస్థాయి ఆధిపత్యం, ఎన్నికల కక్షలు.. ఇలా అనేక అంశాలు కలిసి చాలాసార్లు రాజకీయ రంగు పులుముకుంటాయి. వ్యక్తిగత కక్షతో మొదలైన వివాదం కూడా పార్టీ జెండాలు ఎగరేసే స్థాయికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రతి హత్య..రాజకీయ హత్య కాదు.. ప్రతి రాజకీయ ఆరోపణ కూడా చివరికి దర్యాప్తులో నిజమవుతుందనే గ్యారంటీ లేదు. అందుకే ప్రతి కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్రాన్ని కుదిపేసిన కొన్ని ప్రధాన ఘటనలు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య (2019): ఎన్నికలకు ముందు మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య రాష్ట్ర రాజకీయాలనే కుదిపేసింది. మొదట సహజ మరణమనే ప్రచారం జరిగింది. తర్వాత హత్యగా తేలింది. సిట్, సీబీఐ, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఈ కేసు ఇప్పటికీ దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది.
యేగిరెడ్డి కృష్ణ హత్య (2023): విజయనగరం జిల్లా కొత్తపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు యేగిరెడ్డి కృష్ణ హత్య రాజకీయ ఆధిపత్య పోరుకు నిదర్శనంగా నిలిచింది. ఈ ఘటన తర్వాతే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ హింసపై మళ్లీ జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది.
వినుకొండ షేక్ రషీద్ హత్య (2024): ఎన్నికల తర్వాత జరిగిన ఈ హత్య రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. ఒకవైపు రాజకీయ కక్ష ఆరోపణలు.. మరోవైపు వ్యక్తిగత విభేదాల కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేశారు. ఘటన కంటే దాని చుట్టూ జరిగిన రాజకీయ వాదోపవాదాలే ఎక్కువ చర్చకు దారితీశాయి.
కర్నూలు ఇంతియాజ్ హత్య (2026): స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తర్వాత టీడీపీలో చేరిన ఇంతియాజ్ హత్య రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజకీయ హత్యగా ఒక వర్గం ఆరోపించగా.. భూవివాదం సహా పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పల్నాడు చెన్నారెడ్డి హత్య (2026): వైసీపీ నాయకుడు చెన్నారెడ్డి హత్యతో పల్నాడులో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు, నాయకుల పరామర్శలు, పరస్పర ఆరోపణలు, నిరసనలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
హత్య వెనుక నిజం ఏది?
- హత్య తర్వాత జరిగేది ఇదే..
- మొదటి గంట.. ఘటన.
- రెండో గంట.. ఒక పార్టీ ఆరోపణ.
- మూడో గంట.. మరో పార్టీ కౌంటర్.
- నాలుగో గంట.. నిరసనలు.
- ఐదో గంట.. పరామర్శలు.
- ఆరవ గంట… సోషల్ మీడియా యుద్ధం.
ఆ తర్వాత.. టీవీ డిబేట్లు, ప్రెస్‌మీట్లు, హ్యాష్‌ట్యాగులు, రాజకీయ ప్రకటనలు ఉంటున్నాయి. కానీ.. దర్యాప్తు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. మరో ఆందోళనకర విషయం ఏంటంటే హత్యలతో పాటు హౌస్ అరెస్టులు, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, పరస్పర ఫిర్యాదులు ఉంటున్నాయి. ఇవి కూడా రాజకీయ సంస్కృతిలో సాధారణంగా మారుతున్నాయి.
ఏం చేయాలి?
రాజకీయ హింసను కేవలం చట్టవ్యవస్థ సమస్యగా కాకుండా ప్రజాస్వామ్య సమస్యగా చూడాలి. రాజకీయ హత్యల దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలి. కీలక కేసుల్లో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేయాలి. చార్జ్‌షీట్లు, విచారణల పురోగతిని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అన్ని పార్టీలతో రాజకీయ హింస నిరోధక ప్రవర్తనా నియమావళి రూపొందించాలి. సోషల్ మీడియాలో నిర్ధారణ కాని ప్రచారంపై వేగంగా వాస్తవ నిర్ధారణ చేయాలి. రాజకీయాలు ప్రజల కోసం ఉండాలి. ప్రాణాల కోసం కాదు అంటారు. హత్యకు పార్టీ రంగు ఉండొచ్చు.. కానీ చట్టానికి ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడు అవసరం..ఎక్కువ రాజకీయాలు కాదు. ఎక్కువ న్యాయం. ఒక హత్య ఒక కుటుంబాన్ని కోల్పోయేలా చేస్తుంది. అదే హత్యపై రెండు రాజకీయ కథనాలు.. సమాజాన్నే రెండు వైపులా చీల్చే ప్రమాదం ఉంది.
