IPL 2027: 10 ఫ్రాంచైజీలకు బిగ్ షాక్.. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు ఐపీఎల్ 2027కు దూరం?
IPL 2027: ఐపీఎల్ 2027కు ముందు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్ల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారీ అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ వంటి ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరమయ్యే లేదా పరిమిత మ్యాచ్‌లు ఆడే అవకాశాలపై చర్చ మొదలైంది.

IPL 2027: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ 2027 సీజన్ మార్చి నుంచి మే వరకు జరగనుంది. అయితే ఈ రాబోయే సీజన్‌కు సంబంధించి 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు మైండ్ బ్లాక్ అయ్యే షాకింగ్ వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చెందిన ప్రముఖ స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ 2027 సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని లేదా తమ అందుబాటును కొన్ని మ్యాచ్‌లకే పరిమితం చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ వెల్లడించారు. ఆస్ట్రేలియా జట్టు రాబోయే 12 నెలల్లో అత్యంత రద్దీగా ఉండే ఇంటర్నేషనల్ షెడ్యూల్‌ను ఎదుర్కొనబోతుండటమే ఇందుకు ప్రధాన కారణం.
భారీ ఇంటర్నేషనల్ షెడ్యూల్, WTC ఫైనల్
ఆగస్టు 2026 నుంచి ఆగస్టు 2027 మధ్య ఆస్ట్రేలియా జట్టు ఏకంగా 20 టెస్ట్ మ్యాచ్‌లు, 14 వైట్-బాల్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో భారతదేశంలో జరిగే 5 మ్యాచ్‌ల ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్, ఇంగ్లాండ్‌తో జరిగే యాషెస్ సిరీస్, అలాగే టెస్ట్ క్రికెట్ 150వ వార్షికోత్సవం సందర్భంగా ఇంగ్లాండ్‌తో ఆడే ప్రత్యేక టెస్ట్ మ్యాచ్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఐపీఎల్ ముగిసిన వెంటనే జూన్ 2027లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ కూడా జరగనుంది. ఈ సుదీర్ఘమైన, కఠినమైన ప్రయాణం కారణంగా కీలక టెస్ట్ ఆటగాళ్లకు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ ఎంతో అవసరమని ఆసీస్ యాజమాన్యం భావిస్తోంది.
ఆండ్రూ మెక్‌డొనాల్డ్ వ్యాఖ్యలు
ఈ విషయంపై ఆసీస్ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఈఎస్పీఎన్ క్రికిన్ఫోతో మాట్లాడుతూ.. “మా ఆటగాళ్ల మేనేజ్‌మెంట్ ప్లాన్‌లో ఐపీఎల్ ఎప్పుడూ ఒక భాగమే. ప్రపంచంలోని అత్యుత్తమ టి20 లీగ్‌లో ఆడటం వల్ల మా ఆటగాళ్ల ప్రదర్శన పెరుగుతుంది. అయితే దానికి సరైన బ్యాలెన్స్ ఉండాలి. దేశం వర్సెస్ ఫ్రాంచైజీ అనే చర్చలు పక్కన పెడితే, రాబోయే 20-21 మ్యాచ్‌లకు మా ఫాస్ట్ బౌలర్ల శరీరాలు సహకరించేలా వారికి తగినంత విశ్రాంతిని ఇవ్వడం, వారిని సిద్ధం చేయడమే ప్రస్తుతం మా ముందున్న అతిపెద్ద లక్ష్యం” అని తెలిపారు.
ఫ్రాంచైజీలపై పడనున్న తీవ్ర ప్రభావం
ప్రస్తుతం ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, కేమరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు వివిధ ఐపీఎల్ ఫ్రాంచైజీలతో భారీ ఒప్పందాలను కలిగి ఉన్నారు. ఆస్ట్రేలియా రెగ్యులర్ టెస్ట్ ప్లేయర్లు ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని లేదా పరిమితంగా ఆడాలని నిర్ణయించుకుంటే, అది ఆయా ఫ్రాంచైజీల ప్లేయర్ రిటెన్షన్, వేలం వ్యూహాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
