Rajamahendravaram: కోతి ఎంత పని చేసింది.. గుళికల ప్యాకెట్‌ను టీపొడి ప్యాకెట్‌గా భావించిన వృద్ధురాలు
వృద్ధ దంపతులు మరణానికి కారణమైంది ఓ కోతి. వీరి ఇంటి ఆవరణలో శుక్రవారం నాడు ఓ కోతి ఒక గుళికల ప్యాకెట్‌ను తీసుకువచ్చి వదిలేసి వెళ్లింది. ఆమెకు కంటి చూపు తక్కువగా ఉండడంతో గుళికల ప్యాకెట్‌ను (వాసనలేని) టీపొడి ప్యాకెట్‌గా భావించి టీ కాచింది.
ఇటీవల కోతులు వనాలను వదిలి గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇళ్లలో చొరబడి నానా హంగామా చేస్తున్నాయి. ఏది దొరికితే అది ఎత్తుకొని పోవడమే కాకుండా ప్రజలపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు మనం చూశాం. తాజాగా ఓ కోతి చేసిన పనికి రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి. కోతి ఎత్తుకొచ్చిన ఓ విషపు ప్యాకెట్‌ను టీపొడి అనుకొని టీచేసుకొని తాగిన వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన రాజమహేంద్రవరం రాజానగరంలో చోటుచేసుకుంది.
కోతి చేష్టలు సంతోషాన్నే కాదు, విషాదాన్ని కూడా నింపుతాయి అనడానికి ఈ ఘటనే సాక్ష్యం. రాజమహేంద్రవరం రాజానగరం మండలంలోని పల్లకడియం గ్రామానికి చెందిన వెలుచూరి గోవిందు, అప్పాయమ్మ దంపతుల పిల్లలు వేరే చోట నివసిస్తుండటంతో ఈ వృద్ధ దంపతులు ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గోవిందు, అప్పాయమ్మల ఇంటి నుంచి ఒక టీ పొడి ప్యాకెట్‌ను కోతి ఎత్తుకుపోయింది. మర్నాడు శుక్రవారం ఉదయం మరొక ఇంటి నుంచి పంటలకు ఉపయోగించే విష గుళికల మందు ప్యాకెట్‌ను తీసుకువచ్చి వీరి ఇంటి పెరటిలో పడేసింది. కళ్లు సరిగా కనిపించని అప్పాయమ్మ పెరటిలో పడి ఉన్న ప్యాకెట్‌ను తన ఇంటి నుంచి కోతి తీసుకువెళ్లిందేనని భావించి దాంతో టీ పెట్టింది. ఆ టీని తన భర్తకు ఇచ్చి, తాను కూడా తాగింది. కొద్దిసేపటికే వారిద్దరూ నోటి నుంచి నరుగులు కక్కుతూ పడిపోయారు. ఇరుగు పొరుగువారు చూసి హుటాహుటిన రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే మరణించారు. ఈ మేరకు రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.