పాత నాణేలు అమ్మాలనుకున్న వ్యాపారికి సైబర్ షాక్.. రూ.23 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు!
Old Coin Scam: సోషల్ మీడియా వేదికగా సామాన్యులే లక్ష్యంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఏలూరుకు చెందిన వ్యాపారి పాత నాణేలు విక్రయించాలనుకుని ఫేస్బుక్లో పోస్ట్ చేయగా, నకిలీ పోలీసు అధికారుల వీడియో కాల్స్ ద్వారా రూ. 23 లక్షలకు పైగా పోగొట్టుకున్నారు. నల్లధనం ఖాతాలోకి వచ్చిందని నమ్మించి టీడీఎస్ పేరుతో మోసం చేశారు. పాత వస్తువుల ఆన్లైన్ అమ్మకాలపై అత్యంత అప్రమత్తంగా ఉండాలి.

ఏలూరు: సోషల్ మీడియా వేదికగా సామాన్యులే లక్ష్యంగా సాగుతున్న సైబర్ నేరాల పంజా రోజుకో కొత్త రూపం దాల్చుతోంది. తాజాగా ఏలూరు గన్ బజార్‌కు చెందిన ఆటో సర్వీసింగ్ వ్యాపారి మాగంటి నాగభూషణం సురేష్ ఉదంతం డిజిటల్ యుగంలో జరుగుతున్న మోసాల తీవ్రతకు అద్దం పడుతోంది. తన వద్ద ఉన్న పాత కాలపు ఐదు, పది రూపాయల నాణేలను విక్రయించాలనే చిన్న కోరికతో ఆయన ఫేస్బుక్లో పెట్టిన సాధారణ పోస్ట్, ఏకంగా లక్షల్లో డబ్బును హారతి కర్పూరంలా కరిగించే సైబర్ పన్నగానికి దారితీసింది. టెక్నాలజీని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు పన్నిన వ్యూహం ముందు ఒక సాధారణ వ్యాపారి నిస్సహాయుడిగా మారిన తీరు చర్చనియామ్సంగా మారింది. సైబర్ నేరగాళ్లు ప్రణాళికాబద్ధంగా వలపన్నుతున్నారో ఈ ఘటన ద్వారా అర్థమవుతుంది.
సెప్టెంబర్ 30న ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన కొద్ది గంటల్లోనే అంటే రాత్రి 8.30 గంటలకే నేరగాళ్ల నుంచి ఫోన్ కాల్ రావడం గమనార్హం. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ పాత వస్తువులు, నాణేలు, పురాతన కళాఖండాల కోసం వెతికే అమాయకులను ఈ ముఠాలు టార్గెట్ చేస్తున్నాయని స్పష్టమవుతోంది. తొలి దశలో నాణేల పరిశీలన పేరుతో కేవలం రూ. 750 ఫోన్‌పే చేయించుకుని నమ్మకం కుదిర్చిన కేటుగాళ్లు, అసలు ఆటను అక్టోబర్ నెల 4న ప్రారంభించారు.
ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే సంఘటనలో అసలు మలుపు పోలీసు అధికారుల పేరుతో వచ్చిన నకిలీ వీడియో కాల్స్. తాను ఎస్పీనంటూ ఒక వ్యక్తి వీడియో కాల్ చేసి, ఆ నాణేల వ్యవహారంతో బాధితుడి ఖాతాలోకి ఏకంగా రూ. 23 కోట్ల 55 లక్షల ‘బ్లాక్ మనీ’ జమైందని నమ్మించారు. భారీ మొత్తంలో నల్లధనం ఖాతాలోకి వచ్చిందనేసరికి ఏ సాధారణ పౌరుడైనా కంగుతింటాడు. సరిగ్గా ఇదే బలహీనతను ఆసరాగా చేసుకున్న సైబర్ కేటుగాళ్లు, టీడీఎస్ పేరుతో తొలుత రూ. 75 వేలు వసూలు చేశారు. ఆ తర్వాత రోజు మరింత భయానక వాతావరణాన్ని సృష్టించి, దఫదఫాలుగా బాధితుడి ఖాతా నుంచి ఏకంగా రూ. 23,19,400 రూపాయలను వివిధ బ్యాంకు ఖాతాలకు ఆన్లైన్ ద్వారా మళ్లించుకున్నారు.
చివరికి తాను మోసపోయానని గ్రహించి అక్టోబర్ నెల 9న బాధితుడు సైబర్ క్రైమ్ అధికారులను ఆశ్రయించగా, ఏలూరు టూటౌన్ పోలీసు స్టేషన్లో సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదై దర్యాప్తు కొనసాగుతోంది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఆకర్షణీయమైన ప్రకటన వెనుక ఇలాంటి ఘరానా మోసాలు ఉండే ఆస్కారం ఉందని ఈ ఘటన హెచ్చరిస్తోంది. పాత నాణేలు, విక్రయాల పేరుతో వచ్చే అపరిచిత కాల్స్ పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, లేదంటే చిన్న పొరపాటు ఎంత భారీ మూల్యా చెల్లించుకునేలా చేస్తుందో ఈ ఉదంతం మరోసారి రుజువుచేసింది.
