IPL 2027: ఢిల్లీకి బిగ్ షాక్.. ఐపీఎల్ 2027కు దూరం కానున్న ఆసీస్ స్టార్స్?
IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ఫ్రాంచైజీలకు కొత్త టెన్షన్ మొదలైంది. వచ్చే ఏడాది బిజీ అంతర్జాతీయ షెడ్యూల్, యాషెస్ సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు ఐపీఎల్‌కు అందుబాటులో ఉండటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆటగాళ్ల ఫిట్నెస్, వర్క్‌లోడ్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తుండటంతో ఈ చర్చకు ప్రాధాన్యత పెరిగింది.

IPL 2027: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్న ఐపీఎల్ టోర్నీకి సంబంధించి ఒక ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్-2027 సీజన్‌కు ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్లు దూరమయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దేశ జట్టు ఆటగాళ్ల ఫిట్నెస్ అలాగే వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ను దృష్టిలో ఉంచుకుని క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ అత్యంత బిజీగా ఉండటం దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
బిజీ షెడ్యూల్, యాషెస్ సిరీస్ ప్రభావం
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా జట్టు వరుస సిరీస్‌లతో అత్యంత బిజీగా గడపనుంది. ప్రత్యేకించి ఇంగ్లండ్‌తో జరిగే చారిత్రాత్మక 150వ వార్షికోత్సవ టెస్టు మ్యాచ్‌తో పాటు ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కూడా షెడ్యూల్ అయి ఉంది. టెస్ట్ క్రికెట్‌కు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ఆసీస్ బోర్డు, తమ ప్రధాన బౌలర్లు అలాగే సీనియర్ ఆటగాళ్లు ఎలాంటి అలసట లేకుండా బరిలోకి దిగాలని కోరుకుంటోంది. ఐపీఎల్ మంచి వేదిక అయినప్పటికీ దేశం కోసం ఆడటమే ప్రథమ ప్రాధాన్యమని ఆస్ట్రేలియా హెచ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఇప్పటికే స్పష్టం చేశారు.
ఫ్రాంచైజీల ఆందోళన
తాను ఐపీఎల్లో ఆడటంపై క్లారిటీ లేదని ఆ జట్టు స్టార్ పేసర్ మైఖేల్ స్టార్క్ఇప్పటికే వెల్లడించారు. ఇదే బాటలో జట్టులోని ఇతర సీనియర్ పేసర్లు సైతం టోర్నీకి దూరమయ్యే ఛాన్స్ ఉంది. కీలకమైన మ్యాచ్‌ల సమయంలో ఆసీస్ క్రికెటర్లు అందుబాటులో లేకపోతే ఆ ప్రభావం కచ్చితంగా ఫ్రాంచైజీల ప్రణాళికలపై పడుతుంది. ముఖ్యంగా గత సీజన్లలో భారీ ధరకు అమ్ముడైన కీలక ఆటగాళ్ళు చివరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకుంటే ఆయా జట్ల యాజమాన్యాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం కష్టతరంగా మారుతుంది.
వర్క్‌లోడ్ మేనేజ్మెంట్కు పెద్దపీట
మోడ్రన్ క్రికెట్లో ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణించడం శారీరకంగా ఎంతో సవాలుతో కూడుకున్నది. గాయాల బారిన పడకుండా ఉండాలంటే తగిన విశ్రాంతి అవసరమని వైద్య బృందాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫ్రాంచైజీ క్రికెట్ కంటే జాతీయ జట్టు ప్రయోజనాలకే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. రాబోయే రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడితే ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు తమ వ్యూహాలను పూర్తిగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
