ట్రంప్‌కు జెలెన్స్కీ షాక్.. రష్యా చమురు కేంద్రాలపై దాడులు ఆపేది లేదని ప్రకటన!
Zelenskyy and Trump update: రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై దాడులు నిలిపివేయాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తోసిపుచ్చారు. తాత్కాలిక ఎనర్జీ కాల్పుల విరమణకు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించడంతో రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Ukraine-Russia Latest News: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ కీలక ప్రకటన చేశారు. రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు నిలిపివేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డిమాండ్‌ను ఇకపై తాము పాటించబోమని స్పష్టం చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. రష్యా నుంచి భారీగా డీజిల్‌ను ప్రపంచ ఇంధన మార్కెట్లలోకి విడుదల చేయించేందుకు ట్రంప్ ఇటీవల రష్యాపై ఉన్న కొన్ని ఆంక్షలను సడలించారు. దీనికి ప్రతిగా మాస్కో పెద్ద మొత్తంలో డీజిల్‌ను అంతర్జాతీయ మార్కెట్లకు విడుదల చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. ఈ ఒప్పందాన్ని జెలెన్స్కీ తీవ్రంగా విమర్శించారు. ఇది బలహీనమైన నిర్ణయమని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
ఈ ఒప్పందంపై వస్తున్న విమర్శలకు స్పందించిన ట్రంప్.. రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్ చేస్తున్న దాడుల కారణంగానే డీజిల్ ధరలు పెరుగుతున్నాయని ఆరోపించారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమని జెలెన్స్కీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చమురు శుద్ధి కేంద్రాలపై దాడులు కొనసాగిస్తాం
గురువారం తెల్లవారుజామున రష్యాలోని ర్యాజాన్ ప్రాంతంలోని ఓ చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి. ఇదే సమయంలో ఇంధన మౌలిక వసతులపై దాడులను నిలిపివేయాలన్న తాత్కాలిక ఒప్పందానికి ముగింపు పలుకుతున్నట్లు జెలెన్స్కీ ప్రకటించారు. చమురు శుద్ధి కేంద్రాలపై దాడులకు సంబంధించి విధించిన ఆంక్షలను ఇకపై పాటించబోమని ఆయన స్పష్టం చేశారు. “ఇక ఆంక్షలు లేవు. మేము ఇక ఆపేది లేదు” అని జెలెన్స్కీ పేర్కొన్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది.
ట్రంప్ ప్రకటించిన ‘ఎనర్జీ కాల్పుల విరమణ’
ఆదివారం రష్యా, ఉక్రెయిన్ మధ్య ఆశ్చర్యకరంగా ‘ఎనర్జీ కాల్పుల విరమణ’ను ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాలు ఒకరి ఇంధన మౌలిక వసతులపై మరొకరు దాడులు చేయకుండా ఉండాలన్నది ఈ ప్రతిపాదన ఉద్దేశం. అయితే ఈ ఒప్పందం గురించి తనకు ముందుగా ఎలాంటి సమాచారం లేదని జెలెన్స్కీ వెల్లడించారు. అంతేకాకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కుదిరిన డీజిల్ సరఫరా ఒప్పందం తనను తీవ్రంగా నిరాశకు గురిచేసిందని, తాను మోసపోయినట్లు భావించానని బ్రిటిష్ జర్నలిస్ట్ పియర్స్ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ చెప్పారు.
యూరప్ మద్దతు కోరుతున్న జెలెన్స్కీ
రష్యాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో జెలెన్స్కీ గురువారం బ్రస్సెల్స్కు చేరుకున్నారు. యూరప్‌కు చెందిన మిత్రదేశాలతో కీలక చర్చలు జరిపేందుకు ఆయన అక్కడికి వెళ్లారు. నాటో సెక్రటరీ జనరల్‌తో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు, పోలాండ్, డెన్మార్క్, బెల్జియం ప్రధానులతో సమావేశం కానున్నట్లు తెలిపారు. యుద్ధాన్ని ముగించాలంటే రష్యాపై మరింత ఒత్తిడి తీసుకురావడంతో పాటు ఉక్రెయిన్‌కు రక్షణ సహాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని జెలెన్స్కీ అన్నారు. యూరప్ దేశాలన్నీ కలిసి పనిచేయడం ప్రస్తుతం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడిని ప్రారంభించింది. అప్పటి నుంచి రష్యా ఉక్రెయిన్‌లోని ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో ఇంధన కొరత ఏర్పడింది. దీనికి ప్రతిగా ఉక్రెయిన్ కూడా రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలు, ఇతర ఇంధన వసతులపై డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది.
Already in Brussels with my team to attend the European Council meeting and hold talks with our partners.
Important meetings are scheduled for today with the NATO Secretary General, the President of France, and the prime ministers of Poland, Denmark, and Belgium. I will also have an audience with King Philippe of the Belgians. Tomorrow, meetings are planned with the presidents of the European Council and the European Commission, as well as the prime ministers of Hungary, Finland, and Sweden.
All of us in Europe want this war to end. And for that to happen, strong signals are needed – more real pressure on Russia and more defense support for Ukraine. It is especially important now to act together to protect lives.
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) October 15, 2026
