Viral Video: పేడ ఎత్తి.. మేత వేసి.. పల్లె జీవితాన్ని ఆస్వాదించిన జర్మన్ దౌత్యవేత్త
భారతీయ గ్రామీణ జీవన విధానాన్ని దగ్గరగా తెలుసుకోవాలనుకున్న ఓ జర్మన్ దౌత్యవేత్త.. రైతుతో కలిసి పొలం పనులు చేస్తూ, పశువులకు మేత వేస్తూ కనిపించారు. ఆవు పేడను కూడా స్వయంగా ఎత్తి శుభ్రం చేశారు. స్థానిక సంప్రదాయాలను గౌరవిస్తూ, గ్రామీణ జీవితాన్ని అర్థం చేసుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

న్యూఢిల్లీలోని జర్మన్ ఎంబసీలో మినిస్టర్ కౌన్సెలర్‌గా, రాజకీయ వ్యవహారాల విభాగాధిపతిగా పనిచేస్తున్న మారియస్ ఓస్వాల్డ్ (Marius Osswald) భారతీయ పల్లెను సందర్శించారు. రైతులు ఎలా జీవిస్తారు? వారి రోజువారీ పనులు ఎలా ఉంటాయో స్వయంగా తెలుసుకోవాలని వెళ్లారు. మారియస్‌కు ప్రమోద్ శర్మ అనే స్థానిక రైతు స్వాగతం పలికారు. గ్రామీణ జీవితంలో ఎదురయ్యే పనులను ఆయనతో చేయిస్తూ, పల్లె జీవితం ఎలా ఉంటుందో పరిచయం చేశారు. ‘మా రాజకీయ వ్యవహారాల కౌన్సెలర్ మారియస్ లాగా.. చేతులతో మట్టిని తడిమిన దౌత్యవేత్తలు చాలా తక్కువ మందే’ అనే క్యాప్షన్‌తో వీడియోను జర్మన్ ఎంబసీ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
ఎండ వేడి తట్టుకోలేక.. గమ్ఛా కట్టుకున్న అధికారి
గ్రామంలో పనులు ప్రారంభించగానే ఎండ వేడి మారియస్‌ను ఇబ్బంది పెట్టడంతో ‘చాలా వేడిగా ఉంది’ అన్నారు. బ్లేజర్‌ను తీసేసి, మెడ చుట్టూ సంప్రదాయ గమ్ఛా (తువ్వాలు) కట్టుకోవాలని రైతు ప్రమోద్ శర్మ సూచించారు. దీంతో మారియస్ కూడా స్థానికుల మాదిరిగా గమ్ఛా కట్టుకుని పనులకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ పశువుల కొట్టం వద్దకు వెళ్లారు. అక్కడ పశువులకు మేత సిద్ధం చేయడం, చేతితో నడిచే చాఫ్ కట్టర్‌తో గడ్డిని కోసారు మారియస్. అనంతరం పశువులకు స్వయంగా మేత వేశారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆవు పేడ ఎత్తడానికి వెనుకాడని దౌత్యవేత్త
ఈ వీడియోలో అందరినీ ఆకట్టుకున్న మరో సందర్భం ఆవు పేడను శుభ్రం చేయడం. రైతు ప్రమోద్ శర్మ ఆ పని చేయాలని చెప్పడంతో మారియస్ కొద్దిగా సందేహించారు. అది మురికిగా ఉంటుందా? అని అడిగారు. పశువులు మన కుటుంబంలో భాగమని, వాటిని శుభ్రంగా చూసుకోవడం కూడా మన బాధ్యతేనని రైతు భరోసా ఇచ్చారు. దీంతో మారియస్ ఆ పని కూడా చేసారు. ఈ సందర్భంగా జర్మన్ ఎంబసీ ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది. ‘భారతీయులు జర్మనీలో రాణించాలంటే, మేం కూడా భారతదేశంలో ఇమిడిపోగలమని నిరూపించాలి. ఈసారి సవాలు సంప్రదాయబద్ధమైన వ్యవసాయం! మరి మారియస్ ఈ పరీక్షలో నెగ్గారని మీరు అనుకుంటున్నారా?’ అంటూ నెటిజన్లను ప్రశ్నించింది.
దౌత్యవేత్తపై నెటిజన్ల ప్రశంసలు
వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పలువురు మారియస్‌ను అభినందిస్తున్నారు. స్థానిక సంస్కృతిని గౌరవిస్తూ, గ్రామీణ జీవన విధానాన్ని స్వయంగా తెలుసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు. ‘స్థానిక ప్రజలతో కలిసిపోయి, వారి జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఇది మంచి ప్రయత్నం. నిజమైన వ్యవసాయ జీవితం అంత సులభం కాదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరో యూజర్ స్పందిస్తూ.. ‘తెలియని వాతావరణంలోకి వచ్చి, ఇంత ఉత్సాహంగా పనులు చేయడానికి ముందుకు వచ్చినందుకు మీకు అభినందనలు’ అన్నారు. ఇంకొకరు సరదాగా స్పందిస్తూ.. ‘ భారతీయ వ్యవసాయంలో మొదటి పాఠం ఆవులకు మేత వేయడం. రెండో పాఠం అవి చేసిన పనిని శుభ్రం చేయడం!’ అని కామెంట్ చేశారు. విదేశీ దౌత్యవేత్తగా తన హోదాను పక్కనపెట్టి, భారతీయ రైతుల రోజువారీ పనుల్లో భాగస్వామి కావడం ద్వారా మారియస్ ఓస్వాల్డ్ అందరి దృష్టిని ఆకర్షించారు. భిన్న దేశాల సంస్కృతులను పరస్పరం అర్థం చేసుకోవడానికి ఇలాంటి అనుభవాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ ఉదంతం చాటిచెబుతోంది.