AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్తను లేపేసి లవర్‌తో కలిసి హైదరాబాద్‌కు జంప్.. సినిమాను మించిన ట్విస్టులు

ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో తూముల లక్ష్మణ్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. వివాహేతర సంబంధానికి సంబంధించిన మనస్పర్థల నేపథ్యంలో హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దంపతులను హైదరాబాద్‌కు పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నారు. రూ.1.79 లక్షల నగదు బదిలీలతో పాటు సాక్ష్యాలను మాయం చేసేందుకు చేసిన ప్రయత్నాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

భర్తను లేపేసి లవర్‌తో కలిసి హైదరాబాద్‌కు జంప్.. సినిమాను మించిన ట్విస్టులు
Bhimadole Murder Case
B Ravi Kumar
| Edited By: |

Updated on: Oct 16, 2026 | 9:36 AM

Share

ఏలూరు: భీమడోలు మండలంలో సంచలనం సృష్టించిన తూముల లక్ష్మణ్ హత్య ఉదంతంలో నిందితులు అనుసరించిన వ్యూహాలు పోలీసులను సైతం విస్మయానికి గురిచేశాయి. అత్యంత పకడ్బందీ నేరానికి ప్లాన్ చేసినా పోలీసులు కుట్రను చేదించి నిందితులను జైలుకు పంపారు. కేవలం వివాహేతర సంబంధం నేపథ్యంలో మొదలైన మనస్పర్థలు, చివరకు ప్రాణాలను తీసే వరకు వెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. పోలీస్ బృందం ఈ మిస్టరీని ఛేదించిన తీరు సినిమాను తలపించేలా ఉంది. విజయనగరం జిల్లా రామభద్రపురానికి చెందిన తూముల లక్ష్మణ్ (37) అదే ప్రాంతానికి చెందిన మామిడి లక్ష్మిదుర్గతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో లక్ష్మిదుర్గ ప్రవర్తనపై ఆమె భర్త మామిడి గౌరీశంకర్‌కు అనుమానం కలగడంతో పాటు వారి మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగాయి. కుటుంబ కలహాలు పెరగడంతో లక్ష్మిదుర్గను భర్త పోలసానిపల్లిలోని ఆమె పుట్టింటికి పంపించివేశాడు. అయినప్పటికీ తన కాపురానికి, కుటుంబ పరువుకు అడ్డుగా మారుతున్నాడనే కక్షతో లక్ష్మణ్‌ను అడ్డు తొలగించుకోవాలని గౌరీశంకర్ కుట్ర పన్నాడు.

సుపారీ డీల్ – ఆర్థిక లావాదేవీలు:

ఈ హత్య పథకంలో భాగంగా గౌరీశంకర్ తన భార్య లక్ష్మిదుర్గ తమ్ముడు (బావమరిది) వర్రి నరసింహను కలుపుకొని సుపారీ మాట్లాడుకున్నాడు. ప్లాన్‌లో భాగంగా వర్రి నరసింహ సూచన మేరకు గౌరీశంకర్ వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా దశలవారీగా మొత్తం రూ.1,79,000 నగదు బదిలీ చేసినట్లు పోలీసుల సాంకేతిక దర్యాప్తులో స్పష్టమైంది. ముందస్తు ప్రణాళిక ప్రకారం గతేడాది సెప్టెంబర్ 19 రాత్రి లక్ష్మణ్‌ను మాయమాటలతో భీమడోలు మండలం పోలసానిపల్లికి రప్పించారు. గ్రామ శివారులోని దాలమ్మ-దాలప్ప చెరువు వద్దకు తీసుకెళ్లి తొలుత అతనికి విపరీతంగా మద్యం తాగించారు. ఆ తర్వాత మత్తులో ఉన్న లక్ష్మణ్‌పై ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణంగా హతమార్చారు.

సాక్ష్యాధారాల మాయం – పోలీసుల దర్యాప్తును తప్పుదారి పట్టించే యత్నం:

హత్య అనంతరం నేరస్థులు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడ్డారు. మృతదేహాన్ని మోటార్ సైకిల్‌పై తరలించి పంగిడిగూడెం బ్రిడ్జి సమీపంలోని పోలవరం కాలువలో పడేశారు. నిందితుల రక్తపు మరకలు ఉన్న బట్టలను కూడా అక్కడే వదిలేశారు. అంతటితో ఆగకుండా, దర్యాప్తును పూర్తిగా తప్పుదారి పట్టించేందుకు మృతుడు లక్ష్మణ్ సెల్‌ఫోన్‌ను రాయగడ ఎక్స్‌ప్రెస్ రైలు బాత్‌రూమ్‌లో పడేశారు. సెప్టెంబర్ 21వ తేదీన పెదవేగి పరిధిలోని పోలవరం కాలువలో లభ్యమైన మృతదేహాన్ని పరిశీలించిన పెదవేగి పోలీసులు తొలుత ఇది సాధారణ మరణం కాదని, హత్యగా అనుమానించి కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మృతుడిని తూముల లక్ష్మణ్‌గా గుర్తించి కేసును భీమడోలు పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న భీమడోలు పోలీసులు ఇప్పటికే వర్రి నరసింహతో పాటు సహకరించిన ద్వారపురెడ్డి గణేష్, బొద్దాని సురేష్ కుమార్‌లను అరెస్ట్ చేయడంతో పాటు ఒక జువైనల్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ప్రధాన సూత్రధారులైన మామిడి గౌరీశంకర్, మామిడి లక్ష్మిదుర్గలు హైదరాబాద్‌కు పారిపోతుండగా పక్కా సమాచారంతో భీమడోలు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గౌరీశంకర్ వద్ద నుండి ఒక స్మార్ట్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Follow Us