Andhra Pradesh: ఓరి మీ తెలివి తెల్లార.. మరీ ఇలా ఉన్నారేంట్రా.. పోలీసులే అవాక్కైన ఘటన..!
Andhra Pradesh: ఏపీలో మద్యం ధరలను ఆసరాగా చేసుకుని.. పొరుగు రాష్ట్రాల మద్యంపై కన్నేశాయి మత్తు ముఠాలు. ఒరిస్సాలో చీప్ లిక్కర్ ను కొనుగోలు చేసి..
Andhra Pradesh: ఏపీలో మద్యం ధరలను ఆసరాగా చేసుకుని.. పొరుగు రాష్ట్రాల మద్యంపై కన్నేశాయి మత్తు ముఠాలు. ఒరిస్సాలో చీప్ లిక్కర్ ను కొనుగోలు చేసి.. బోర్డర్ దాటించి విశాఖకు తీసుకొస్తున్నారు. ఒక్కో మద్యం బాటిల్ పై యాభై నుంచి అరవై రూపాయలు అదనంగా వేసి అమ్మేస్తున్నారు. ఇటీవల కాలంలో విశాఖలో నిఘా పెరగడంతో.. వేర్వేరు మార్గాల్లో అన్వేషిస్తున్నారు అక్రమార్కులు. ఒడిస్సా మద్యాన్ని విశాఖకు డంప్ చేసేందుకు సరికొత్త ఐడియాలతో ముందుకెళ్తున్నారు. ఇటీవల ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లోనూ, ఇతర వాహనాల్లోనూ యథేచ్ఛగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తరలించే ముఠాలు.. అధికారులు నిఘా పెట్టడంతో కాస్త రూటు మార్చారు. వేరుశనగ పొట్టు మాటున మద్యాన్ని పెట్టి దిగుమతి చేస్తుండగా, అడవివరం లో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు.
వాహన తనిఖీల్లో భాగంగా కారును ఆపి సోదాలు చేయగా, పది కేసుల ఒరిస్సా మద్యం పట్టుబడింది. స్వామి నాయుడు అలియాస్ బుజ్జి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఓ గోడౌన్‌లో దాచివుంచిన మరిన్ని మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు 200కు పైగా కేసుల్లో పదివేల వరకు ఒడిస్సా మద్యం బాటిళ్లను గుర్తించారు అధికారులు. ఇంత భారీ ఎత్తున దిగుమతి ఎలా జరిగిందనే దానిపై ఆరా తీయగా, కేటుగాళ్ల స్కేచ్‌తో అధికారులే అవాక్కయ్యారు.
విజయనగరం జిల్లా కొత్తవలస కు చెందిన స్వామి నాయుడు.. విశాఖకు చెందిన మరికొందరితో కలిసి పక్కాగా స్కెచ్ వేశాడు. వేరుశెనగ పొట్టును గోనె సంచుల్లో సగం వరకు నింపి ఒడిషా రాష్ట్రంలోని రాయగడ పంపిస్తున్నాడు. అక్కడ ఈ పొట్టు ను అన్లోడ్ చేయకుండానే.. అవే బస్తాల్లో మూడో కంటికి తెలియకుండా మద్యం సీసాలను నింపుతున్నారు. వాటిని విశాఖ తీసుకువచ్చి అడవివరంలోని ఓ గోడౌన్ లో డంప్ చేస్తున్నారు. తెచ్చిన మద్యాన్ని అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా గత కొంత కాలంగా వీరి వ్యవహారం సాగిపోతుంది. అధికారుల తనిఖీల్లో కారు పట్టుబడటంతో ఈ ఒరిస్సా మద్యం గుట్టు బయట పడింది. 209 కేసుల్లో పదివేలకు పైగా మద్యం సీసాలు సీజ్ చేశారు అధికారులు.
మద్యం సీసాల పై కనీసం కంపెనీ పేరు గానీ, బ్రాండ్ పేరు గానీ లేదు. దీంతో ఈ మద్యాన్ని కల్తీ మద్యంగా అనుమానిస్తున్నారు అధికారులు. పరీక్షల కోసం శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించారు. మద్యంతో పాటు గోడౌన్‌లో భారీగా గుట్కా, కైని ప్యాకెట్లు కూడా లభించాయి. వీటి విలువ దాదాపుగా రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. నిందితుల నుంచి ఒరిస్సా మద్యం ఖైనీ, గుట్కా రవాణాకు ఉపయోగించే కారు లారీ తో పాటు ఏడు లక్షల రూపాయల నగదు సీజ్ చేశారు. నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. అయితే గుట్టుచప్పుడు కాకుండా భారీ గా అమ్ముడవుతున్న ఒడిస్సా మద్యాన్ని అరికట్టాలి అని అంటున్నారు విశాఖ వాసులు.
Also read:
Andhra Pradesh: దేశంలోనే ఫస్ట్ టైమ్.. 2 లక్షల కేజీల మత్తుకు నిప్పు పెట్టిన ఏపీ పోలీస్ బాస్
VK Naresh: సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై స్పందిన నటుడు నరేష్.. అభినందనీయం అంటూనే..