Andhra Pradesh: ‘ఏ నాటిదో ఈ బంధం..’ ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని అన్నీ తానైనా గుర్తుతెలియని NRI
ఆయనది ఆ ఊరు కాదు. ఆ మండలం కూడా కాదు. అసలు ఆ జిల్లానే కాదు. కానీ ఆ గ్రామానికి మాత్రం శ్రీమంతుడిలా మారాడు. ఓ వైపు గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ, మరోవైపు గ్రామస్తులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. గ్రామంలో లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ నిర్మాణ పనులు చేపట్టి గ్రామస్తుల అవసరాలు తీరుస్తున్నాడు. గ్రామానికి ఏది కావాలంటే అది చేస్తున్నాడు కానీ అతను మాత్రం ఆ గ్రామం నుండి ఏమీ ఆశించంచడం లేదు. నేను కష్టపడ్డాను, బాగా సంపాదించుకున్నాను.. అభివృద్ధి చెందాను.. నాలాగే మరి కొంతమందిని..
పార్వతీపురం, జనవరి 17: ఆయనది ఆ ఊరు కాదు. ఆ మండలం కూడా కాదు. అసలు ఆ జిల్లానే కాదు. కానీ ఆ గ్రామానికి మాత్రం శ్రీమంతుడిలా మారాడు. ఓ వైపు గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ, మరోవైపు గ్రామస్తులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. గ్రామంలో లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ నిర్మాణ పనులు చేపట్టి గ్రామస్తుల అవసరాలు తీరుస్తున్నాడు. గ్రామానికి ఏది కావాలంటే అది చేస్తున్నాడు కానీ అతను మాత్రం ఆ గ్రామం నుండి ఏమీ ఆశించంచడం లేదు. నేను కష్టపడ్డాను, బాగా సంపాదించుకున్నాను.. అభివృద్ధి చెందాను.. నాలాగే మరి కొంతమందిని అభివృద్ధి చేయాలి అని అనుకున్నాడు. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని పేదరికం లేని గ్రామంలా తీర్చిదిద్దాలి, ఆ గ్రామంలో ప్రతి ఒక్కరి చేతిలో డబ్బుతో ఆనందంగా గడపాలి, మారిన ఆ గ్రామస్తుల జీవన విధానం చూడాలని అనుకున్నాడు. ఎట్టకేలకు తాను కోరుకున్న లక్ష్యం నెరవేర్చుకొని ఒక గ్రామానికి దేవుడిగా మారాడు. అతనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సుధీర్ మోహన్ పట్టా అనే ప్రవాస భారతీయుడు. ఈయన అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో స్థిరపడ్డాడు. తాను పుట్టిన దేశానికి ఏదైనా చేయాలి అనే కోరిక, అందులోనూ వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నది అతని తపన.
ఇప్పటికే తమిళనాడుతో పాటు రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల్లో అనేక సౌకర్యాలు కల్పించారు. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాలో కూడా ఆర్థికంగా వెనుకబడిన గ్రామాలు ఉన్నాయని తెలుసుకొని గూగుల్ ద్వారా అలాంటి గ్రామాల కోసం సెర్చ్ చేశాడు. అలా వెదకగా పార్వతీపురం మన్యం జిల్లాలోని ఉన్న అడ్డాపుశీల అనే గ్రామం కనిపించింది. ముందుగా ఆ గ్రామం కోసం జిల్లా అధికారులను అడిగి కొన్ని విషయాలను తెలుసుకున్నాడు. వెంటనే వారి అనుమతులు తీసుకొని ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. తరువాత ఆ గ్రామానికి కావలసిన సౌకర్యాలు అన్ని సమకూర్చటం ప్రారంభించాడు. ముందుగా గ్రామంలోనే తాగునీటి సమస్యను తీర్చడానికి సన్నద్ధం అయ్యాడు. 200 కుటుంబాలు ఉన్న ఈ గ్రామానికి వెంటనే ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి గ్రామస్థుల దాహం తీర్చాడు. అడ్డాపుశీల గ్రామం కొండ ప్రాంతం కావడంతో కొండ చుట్టూ తాగునీటి పైప్ లైన్ వేసి రైతులకు, స్థానికులకు మంచినీటి సౌకర్యం కల్పించాడు. అంతేకాకుండా గ్రామంలోనే మహిళలకు స్వయం ఉపాధి కల్పించి వారి కాళ్ల పై వాళ్లు నిలబడేలా తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు.
గ్రామంలోని మహిళలు స్వయం ఉపాధి పొందటానికి లక్షల రూపాయలు పెట్టి ఓ బిల్డింగ్ నిర్మించాడు. అందులో ఇరవైకి పైగా కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి అక్కడ వారితో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు సైతం శిక్షణ పొందేలా ఏర్పాట్లు చేశాడు. అలా శిక్షణ తీసుకునే వారి కోసం నెలవారీ జీతం ఇచ్చి ట్రైనర్‌ని నియమించాడు. ఆ ట్రైనర్ సహాయంతో ఇప్పటివరకు వందల మంది ట్రైనింగ్ పొంది స్వయం ఉపాధి పొందుతున్నారు. శిక్షణ పొందిన పలువురికి ఉచితంగా కుట్టుమిషన్లు కూడా అందజేశాడు. ఆ భవనంలోనే కొంత భాగంలో గ్రంధాలయాన్ని ఏర్పాటుచేసి పలు పుస్తకాలను అందుబాటులో ఉంచాడు. గ్రామంలో ఉన్న చిన్న స్థాయి ప్రభుత్వ ఆసుపత్రికి అధునాతన యంత్రాలు సమకూర్చి రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందేలా కృషి చేశాడు. బెడ్స్ తో పాటు పలు పరికరాలు సమకూర్చాడు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాన్ని ఆధునికరించడంతో పాటు సామాజిక మరుగుదొడ్ల ఏర్పాటు చేశాడు. చిన్నారులకు ఆట పరికరాలు అందజేశాడు. తాను ఎలాంటి ప్రయోజనం ఆశించలేదని సేవా దృక్పథంతో మాత్రమే ముందుకు వెళ్తున్నానని, గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు మోహన్ సుధీర్ పట్టా. తమ గ్రామానికి మోహన్ సుధీర్ వచ్చిన తర్వాతే అసలైన సంక్రాంతి పండుగ జరిగిందని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.