YS Sharmila: చతికిలబడ్డ చేతికి షర్మిల చేయూత అవుతారా..? రాజన్నబిడ్డ రూటు మార్చడానికి కారణమేంటి?

ఏపీ to ఏపీ.. వయా తెలంగాణ. సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే ఒకప్పుడు అన్నవదిలిన బాణంగా రాజకీయాల్లోకి దూసుకొచ్చిన వైఎస్‌ షర్మిల రాజకీయ ప్రయాణం ఇది. ఇన్నాళ్లూ తెలంగాణే తన ప్రాణమన్న షర్మిల.. ఇప్పుడు సడెన్‌గా ఏపీ మంత్రం జపించడం చర్చనీయాంశంగా మారింది. ఏపీసీసీ చీఫ్‌గానూ బాధ్యతలు చేపట్టబోతున్న షర్మిల... ఎలా ముందుకెళ్లబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది. అంతేకాదు, అక్కడ సాధించనిదేంటి? ఇక్కడ సాధించబోయేదేమిటి? అనేమాట కూడా చర్చకు వస్తోంది.

Follow us

|

Updated on: Jan 17, 2024 | 6:52 PM

ఏపీ to ఏపీ.. వయా తెలంగాణ. సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే ఒకప్పుడు అన్నవదిలిన బాణంగా రాజకీయాల్లోకి దూసుకొచ్చిన వైఎస్‌ షర్మిల రాజకీయ ప్రయాణం ఇది. ఇన్నాళ్లూ తెలంగాణే తన ప్రాణమన్న షర్మిల.. ఇప్పుడు సడెన్‌గా ఏపీ మంత్రం జపించడం చర్చనీయాంశంగా మారింది. ఏపీసీసీ చీఫ్‌గానూ బాధ్యతలు చేపట్టబోతున్న షర్మిల… ఎలా ముందుకెళ్లబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది. అంతేకాదు, అక్కడ సాధించనిదేంటి? ఇక్కడ సాధించబోయేదేమిటి? అనేమాట కూడా చర్చకు వస్తోంది.

నిన్న మొన్నటి దాకా.. తెలంగాణే నా ఆశ, శ్వాస అంటూ రాజకీయం చేసిన వైఎస్ షర్మిల… ఇప్పుడూ పూర్తిగా రూటు మార్చేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా.. వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే.. తన పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేశారు. ఆమెకు సాదరస్వాగతం పలికిన కాంగ్రెస్‌ పెద్దలు.. ఆంధ్రలో పార్టీ బాధ్యతలను అప్పజెప్పేశారు.

నాన్న, అన్నలకోసం నాడు కాంగ్రెస్‌పై యుద్ధం చేసిన షర్మిల.. ఇప్పుడు అదే కాంగ్రెస్‌ వేదికగా ఏపీలో రాజకీయాలు చేయబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆమె కాదనుకున్న కాంగ్రెస్సే ఇప్పుడామెకు భవిష్యత్‌ రాజకీయవేదికగా మారింది. అయితే, పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న షర్మిళ ముందు చాలా సవాళ్లే ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ వీడిన వారిని సొంతగూటికి రప్పించడం, కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపడం అంత సులువైన పనేం కాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. రాజశేఖర్‌ రెడ్డి బిడ్డగా కాంగ్రెస్‌వారు షర్మిలను స్వాగతిస్తుంటే.. ప్రత్యర్థులు మాత్రం తమకెలాంటి నష్టమూ లేదంటున్నారు.

ఏపీలోకి షర్మిల రీ ఎంట్రీపై.. రాజకీయంగా ఎలాంటి అభిప్రాయమున్నా.. ఇన్నాళ్లూ తెలంగాణ పల్లవి పాడిన ఆమె.. సడెన్‌గా ఏపీ చరణాన్ని ఎత్తుకోవడం వల్ల సాధించేదేమిటన్నదే చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ పెట్టిమరీ తెలంగాణలో సాధించలేనిది.. ఇప్పుడు ఏపీలో చితికిపోయి ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ద్వారా సాధిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. రాజన్న బిడ్డ.. ఏపీలో ఏరాజ్యం కోసం పోరాడుతుందన్నదీ సస్పెన్స్‌గానే ఉంది.

తెలంగాణ రాజకీయాల్లో YSRTPతో ఎలాంటి ప్రభావం చూపని షర్మిల.. ఏపీలో కకావికలమైన కాంగ్రెస్‌ను ఎలా కాపాడుతారని ప్రశ్నించేవారూ లేకపోలేదు. అసలింతకూ ఆమె సడెన్‌గా రూట్‌ మార్చి ఏపీవైపు దూసుకురావడం వెనక మతలబు ఏమిటన్నది కూడా ఇక్కడ డిస్కషన్‌ పాయింట్‌ అవుతోంది. రాబోయే రోజుల్లో వీటన్నింటికి ఆమె ఏవిధంగా సమాధాన చెబుతారో? ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో? చూడాలి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..