AP News: లంచాలు ఇవ్వకండి మహాప్రభో… కార్యాలయం ముందు బోర్డు పెట్టిన అధికారి
పనిచేయడం మా విధి... పనిచేయించుకోవడం మీ హక్కు... డబ్బుతో ప్రలోభ పెట్టకండి... ఇట్లు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయ పరిపాలనా అధికారి, ఒంగోలు. ఇదండీ ప్రకాశంజిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం గోడకు అంటించిన పోస్టర్... ఎందుకిలా పెట్టారో తెలుసుకుందాం పదండి...
ఇటీవల సచివాలయ కార్యదర్శుల బదిలీ వ్యవహారంలో ప్రకాశం జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో ఓ ఉద్యోగి అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. గ్రామ సచివాలయ గ్రేడ్ 5, గ్రేడ్ 6 కార్యదర్శుల బదిలీల్లో అవినీతి చోటు చేసుకుందని, అందుకు డిపివో కార్యాలయంలోని ఏవో బాధ్యుడిగా పేర్కొంటూ ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు ఫిర్యాదులు వెళ్ళాయి. దీంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణలో ఆరోపణలు వాస్తవమని తేలడంతో గతంలో పనిచేసిన ఏవో శివప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఇవే అరోపణలపై ఇప్పటికే జిల్లా పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ కిషోర్, డిజిటల్ అసిస్టెంట్ సాయి కోటేశ్వరరావులను సస్పెండ్ చేశారు. అలాగే తమ శాఖలో ఉద్యోగుల అవినీతి వ్యవహారంపై క్రిమినల్ చర్యలకు ఉపక్రమించారు. ఈ నేపధ్యంలో ఒంగోలులోని జిల్లా పంచాయతీ కార్యాలయం ఆవరణలో గోడపై ఓ పోస్టర్ వెలిసింది. ఇది ప్రభుత్వ కార్యాలయం, పనిచేయడం మా విధి, పనిచేయించుకోవడం మీ హక్కు… మమ్మల్ని డబ్బులతో ప్రలోభపెట్టకండి. అంటూ ఓ పోస్టర్‌ను అతికించడం ఉద్యోగ వర్గాల్లో చర్చకు దారితీసింది… అసలు లంచాలు డిమాండ్ చేయబట్టే కదా ఇదంతా జరుగుతోంది… లంచాలు ఇచ్చి పని చేయించుకోవాలని ఎవరికి ఉంటుంది, చెప్పండంటూ పలువురు మాట్లాడుకోవడం కనిపించింది…
ప్రకాశం జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో గతంలో పనిచేసిన ఏవో శివప్రసాద్ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావును విచారణ అధికారిగా నియమించారు. విచారణ అనంతరం ఆయన ఇచ్చిన నివేదికను పరిశీలించిన కలెక్టర్ ఆ నివేదికను పంచాయతీరాజ్‌శాఖ రాష్ట్ర డైరెక్టర్‌కు పంపించారు. వెంటనే స్పందించిన డైరెక్టర్ గతంలో ఏవోగా పనిచేసిన శివప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు… ఇప్పటికే మరో ఇద్దరు ఉద్యోగులు ఇదే అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు… దీంతో ఖంగుతిన్న జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం ఉద్యోగులు తమ కార్యాలయం బయట లంచాలు ఇవ్వవద్దంటూ బోర్డు పెట్టి మరీ విజ్ఞప్తి చేయడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.