విశాఖపట్నం,ఆగస్టు21: అల్లూరు జిల్లా పాడేరు ఘాట్ రోడ్ లో ఆర్టీసీ బస్సు లోయలో బోల్తా పడిన ఘటన చూసిన వారందరి గుండెలు తరుకుపోయాయి. అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. పరిసర ప్రాంతాల్లోని ఆసుపత్రులని అలర్ట్ చేశారు. పోలీసులు రెవెన్యూ అధికారులు ఆర్ అండ్ బి అధికారులు ఐటిడిఏ సిబ్బంది ఆగమేఘాల మీద స్పాట్‌కు చేరుకున్నారు. ఎందుకంటే ఆ ప్రమాద తీవ్రత ఆ విధంగా ఉంది. ఒక ఆర్టీసీ బస్సు దాదాపుగా 60 నుంచి 80 అడుగుల లోతులో బోల్తా పడింది అంటే… ఆ బస్సు ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. అందులో ఉన్న 30 మంది వరకు ప్రయాణికులు కూడా ఏ స్థాయిలో ఉన్నారు అని అంత పరుగులు పెట్టారు. అప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మంది గాయాలతో హాహాకారాలు చేస్తున్నారు. వారందరినీ హుటాహుటిన మరో బస్సులో వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు.
ఆ చెట్లే లేకుంటే..
– పాడేరు ఘాట్రోడ్లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురి కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. మరో అరగంటలో గమ్యానికి చేరుకోవాల్సిన ఆ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. వ్యూ పాయింట్ మలుపు వద్ద ఇటీవల చెట్టు కొమ్మలు రోడ్డుపై పడ్డాయి. వాటిని తొలగించకుండా అడ్డుగా రాళ్లు కూడా పెట్టారు. దాన్ని తప్పించుకుని వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి బస్సు లోయలోకి వెళ్ళిపోయింది. అయితే అదృష్టవశాత్తు.. లోయ ఏటవాలుగా ఉండడం, ఆపై చెట్లు దట్టంగా ఉండడంతో.. ప్రమాద తీవ్రత తగ్గింది. బస్సు లోయలో నేరుగా కిందకు పడకుండా.. లోయలోని చెట్ల కొమ్మలు తాకుకుంటూ కిందకు జారింది. నిజంగా అటుగా వెళుతున్న వాళ్లు ఆ లోయలో పడిన బస్సును చూసి.. అందులో ప్రయాణిస్తున్న వారెవరు ఇక ప్రాణాలతో ఉంటారా అన్న సందేహంతోనే ఉన్నారు. అదృష్టవశాత్తు లోయలో చెట్ల కొమ్మలు అడ్డు తగలడంతో అంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ.. ప్రాణ నష్టం ఇద్దరి వరకే పరిమితమైంది. లేకుంటే పెను విషాదం, భారీ ప్రాణ నస్టం జరిగేదని అంటున్నారు. లోయలో పడిన తర్వాత కూడా కొమ్మలకు చెట్లకు ఆనుకొని బస్సు ఆగింది. లేకుంటే మరో 50 అడుగుల కిందకు బోల్తాపడేది ఆ బస్సు. అదే గాని జరిగి ఉంటే ప్రమాద తీవ్రత ఊహించుకోలేం..!
మనవరాలి కోసమని సరదాగా వెళుతూ..
అయితే ఈ ప్రమాదంలో.. మనవరాలిని చూసేందుకు వెళుతూ నారాయణమ్మ అనే సబ్బవరం కు చెందిన 55 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కొడుకు వెంకటరమణ కుటుంబం పాడేరులో నివాసం ఉంటున్నారు. వెంకటరమణ పిల్లలను చూసేందుకు ఆమె సబ్బవరం నుంచి బయలుదేరారు. మరో అరగంటలో వెళ్లి మనవరాలు తో ఆడుకుందామని అనుకున్న నారాయణమ్మ ఆనందం విషాదమైంది. ప్రమాదంలో నారాయణమ్మ ప్రాణాలు కోల్పోగా భర్త ఈశ్వరరావు గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు.
ఆ చిన్నారి..
– ప్రమాదం జరిగిన తర్వాత.. బస్సులో ఉన్న వారంతా దాదాపుగా గాయపడ్డారు. రక్తాలు కారుతున్నాయి.. గాయాలతో హాహకారాలు చేస్తున్నారు. మరి కొంతమంది తమ వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ లోగా స్థానికులు అటుగా వెళ్తున్న ప్రయాణికులు కూడా తోడయ్యారు. కొండన్న నారాయణమ్మ అనే ఇద్దరు అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. అయితే సహాయక చర్యలు చేస్తున్న సమయంలో ఓ చిన్నారి వైపే అందరి దృష్టి మళ్లింది. ఎందుకంటే నెల రోజుల వయసున్న శిశువు ప్రమాదానికి గురైన బస్సులోనే తల్లితోపాటు ప్రయాణిస్తుంది. బస్సు లోయలో బోల్తా పడినప్పటికీ ఆ శిశువు సేఫ్ గా ఉంది. తల్లి జ్యోతి తలకు గాయమైంది. దీంతో తల్లి పిల్లలు ఇద్దరినీ హుటాహుటిన లోయలోంచి పైకి తీసి రక్షించే ప్రయత్నం చేశారు. తన చిట్టి తల్లికి ఏమైందోనని ఆ తల్లి తల్లడిల్లిపోయింది. అదృష్టవశాత్తు ఏమీ కాకపోవడంతో తల్లి ఊపిరి పీల్చుకుంది. ఘటనా స్థలంలో లోయ నుంచి పైకి తీసుకొచ్చాక తల్లికి సపర్యలు చేశారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తల్లి ఒడిలో ఉన్న శిశువును అందరూ ఆసక్తిగా చూశారు. తల్లికి ప్రత్యేక వైద్య సేవలు అందించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో అంతా హమ్మయ్య అనుకున్నారు.
రోడ్డుపై పొదలు..
– పాడేరు ఘాట్రోడ్లో.. చాలా చోట్ల రోడ్డు వైపు చెట్ల కొమ్మలు పొదలు వచ్చేసి ఉన్నాయి. దీంతో ఘాట్ రోడ్డులో ప్రయాణించాలంటే చెట్టుకొమ్మలు చాలా దగ్గర అడ్డుగా కనిపిస్తున్నాయి. ఎదురుగా వస్తున్న వాహనం దగ్గరకు వచ్చేవరకు కనిపించలేని పరిస్థితి. బస్సు బోల్తా పడిన సమయంలో కూడా.. ఎదురుగా వస్తున్న బైక్ దగ్గరకు వచ్చేవరకు కనిపించలేదు. దీంతో ఆ బైకు ప్రమాదానికి గురవుతుందేమోనన్న భయంతో తప్పించబోయి.. 30 మందితో ప్రయాణిస్తున్న బస్సు లోయలోకి పడిపోయింది. ఘాట్‌రోడ్డులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా.. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానిక ప్రజలు, ప్రయాణికులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..