AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: బ్రహ్మం గారి మహిమేనా.. నరికినా లేచి నిలబడ్డ రావిచెట్టు.. ఎక్కడో తెలుసా..?

ప్రకృతి వింతా? లేక దైవ మహిమా? నరికేసి, వేళ్లతో సహా పెకిలించిన రావిచెట్టు రాత్రికి రాత్రే తిరిగి నిలబడటం ఇప్పుడు ప్రకాశం జిల్లాలో సంచలనంగా మారింది. బ్రహ్మంగారి ఆలయ ప్రతిష్ఠా వేళ మారెళ్ల గ్రామంలో జరిగిన ఈ అద్భుత దృశ్యం భక్తులను పరవశింపజేస్తోంది. 101 బిందెల జలాభిషేకం.. మహిళల జలహారతులతో ఆ ప్రాంతమంతా భక్తిమయంగా మారింది.

Andhra Pradesh: బ్రహ్మం గారి మహిమేనా.. నరికినా లేచి నిలబడ్డ రావిచెట్టు.. ఎక్కడో తెలుసా..?
Fallen Peepal Tree Stands Upright On Its Own
Fairoz Baig
| Edited By: |

Updated on: May 08, 2026 | 12:17 PM

Share

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామంలో ఒక అద్భుతమైన, విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. నరికివేసి, వేళ్లతో సహా పెకిలించి పక్కన పడేసిన ఒక రావిచెట్టు.. తెల్లారేసరికి తిరిగి తనంతట తానుగా లేచి నిలబడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నెల 1న గ్రామంలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోమాలు నిర్వహించేందుకు రావి కలప అవసరం కావడంతో గ్రామస్థులు స్థానిక రైతు పొలంలో ఉన్న ఒక పాత రావిచెట్టు కొమ్మలను నరికారు. చెట్టు కేవలం మోడులా మిగిలిపోవడంతో దాన్ని కూడా వేళ్లతో సహా పెకిలించి పక్కన పడేశారు.

తెల్లారేసరికి ఆశ్చర్యం

వేళ్లతో సహా నేలకూలిన ఆ రావిచెట్టు, మరుసటి రోజు ఉదయానికి యథావిధిగా నిలబడి ఉండటం చూసి గ్రామస్థులు అవాక్కయ్యారు. సాధారణంగా భారీ వృక్షాలు నేలకొరిగితే తిరిగి నిలబడటం అసాధ్యం, కానీ ఇక్కడ ఏ మనుషుల సాయం లేకుండానే ఆ చెట్టు తిరిగి ప్రాణం పోసుకున్నట్లు నిటారుగా నిలబడటం అందరినీ విస్తుపోయేలా చేసింది. బ్రహ్మంగారి ఆలయ ప్రతిష్ఠా సమయంలోనే ఈ ఘటన జరగడంతో ఇది ముమ్మాటికీ ఆ స్వామివారి మహిమేనని గ్రామస్థులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈ వార్త దావాగ్నంలా వ్యాపించడంతో మారెళ్ల గ్రామం భక్తులతో కిక్కిరిసిపోయింది. గ్రామ మహిళలు ఈ అద్భుతాన్ని చూసి పులకించిపోయారు. సుమారు 101 బిందెలతో నీళ్లు తీసుకుని మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా తరలివచ్చారు. తిరిగి నిలబడ్డ ఆ రావిచెట్టుకు మహిళలు జలహారతి పట్టి, అభిషేకించి, పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ రావిచెట్టు వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సైన్స్ పరంగా దీనికి కారణాలు ఏవైనా ఉండవచ్చు కానీ భక్తులు మాత్రం ఆ కాలజ్ఞాని మహిమకు ఇది నిదర్శనమని నీరాజనాలు పడుతున్నారు.

Follow Us