AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: రామకృష్ణ హీరోగా ఎదగకపోవడానికి కారణం ఏంటి…? వివరాలు ఈ కథనంలో..

తెలుగు నటుడు రామకృష్ణ, నాటకరంగం నుండి వెండితెరకు అడుగుపెట్టి బహుముఖ పాత్రలతో మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజాలతో కలిసి నటించి, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. వ్యక్తిగతంగా నిష్కళంకమైన ఆయన జీవితం, వృత్తిపరమైన ఒడిదుడుకులు, తిరిగి పుంజుకున్న తీరు ఆకట్టుకుంటుంది.

Tollywood: రామకృష్ణ హీరోగా ఎదగకపోవడానికి కారణం ఏంటి...? వివరాలు ఈ కథనంలో..
Ramakrishna Actor
Ram Naramaneni
|

Updated on: Jul 30, 2026 | 12:55 PM

Share

తెలుగు సినిమా చరిత్రలో తమ నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన నటులలో రామకృష్ణ ఒకరు. చూడగానే ఆకట్టుకునే రూపం, ఆరడుగుల ఎత్తు, చక్కని పర్సనాలిటీ, మంచి స్వరం వంటి లక్షణాలతో హీరోగా రాణించడానికి అవసరమైన అన్ని అర్హతలు ఆయనకు చిన్ననాటి నుండే ఉన్నాయి. 1939 అక్టోబర్ 15న భీమవరంలో జన్మించిన రామకృష్ణ, పెద్దగా చదువుకోలేదు. అయితే చిన్నప్పటి నుంచే నాటకాలపై అపారమైన ఆసక్తి పెంచుకున్నారు. టైలరింగ్ వృత్తిని కొనసాగిస్తూనే నాటకాల్లో చురుకుగా పాల్గొనేవారు. నాటక రచయిత పినిశెట్టి శ్రీరామమూర్తి ప్రదర్శించే నాటకాలతో పాటు ఎన్జీవో, కప్పలు, దంత వేదాంతం వంటి పలు నాటకాల్లో నటించి అనుభవం సంపాదించారు. నటనకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌లను తన ఆదర్శంగా భావించేవారు. వారిని చూడటానికి ఎన్నో పాట్లు పడిన సందర్భాలు ఉన్నాయి. రామకృష్ణలోని నటనాభిరుచిని గుర్తించిన ఆయన కజిన్ ఘనిరాజు, రామకృష్ణ నాట్య సేవా సమితిని స్థాపించి ఆయనకు నాటకాలు ప్రదర్శించడానికి మార్గం సుగమం చేశారు. రామకృష్ణ ప్రతిభను గుర్తించిన పినిశెట్టి శ్రీరామమూర్తి, ఆయనకు సినీ రంగ ప్రవేశానికి బాటలు వేశారు.

1954లో రచయితగా రాజు పేద చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన పినిశెట్టి, 1959లో మద్రాసులో రామకృష్ణ నాటకం పల్లె పడుచు ప్రదర్శనకు అవకాశం కల్పించారు. చిత్ర పరిశ్రమలో పట్టు సాధించిన పినిశెట్టి, 1960లో నిత్య కళ్యాణం పచ్చతోరణం చిత్రంతో దర్శకుడిగా మారి రామకృష్ణకు ప్రధాన పాత్రను ఇచ్చారు. ఇదే ఆయన తొలి చిత్రం. రెండవ చిత్రం రమాసుందరిలో రాజకుమారుడి పాత్ర పోషించారు. ఎన్టీఆర్‌తో కలిసి రామకృష్ణ నటించిన తొలిచిత్రం దక్షయజ్ఞం, అక్కినేనితో రుణానుబంధం. ఈ చిత్రంలో అతిథి పాత్ర పోషించిన రామకృష్ణను చూసి, మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటావని అక్కినేని ఆశీస్సులు అందించారు. 1960లో విడుదలైన భక్త శబరి చిత్రంలో లక్ష్మణుడి పాత్రతో పౌరాణిక పాత్రల ప్రస్థానం ప్రారంభమైంది. ఇంద్రుడు, రావణుడు, చంద్రుడు వంటి పౌరాణిక పాత్రలను విజయవంతంగా పోషించారు. పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో చిన్న పాత్రలు పోషిస్తున్న రామకృష్ణకు, 1966లో పింజల సుబ్బారావు నిర్మించిన హంతకులు వస్తున్నారు జాగ్రత్త చిత్రంలోని పోలీస్ ఆఫీసర్ పాత్ర మంచి గుర్తింపు తెచ్చింది. అయితే, ఆ తర్వాత కొన్నాళ్లు పోటీ పెరగడం, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలు అగ్రస్థానానికి ఎదగడం వల్ల రామకృష్ణకు అవకాశాలు తగ్గాయి. నిరుత్సాహపడకుండా వేచి చూసిన ఆయనకు, ఏవిఎం వారి నోము చిత్రం సరికొత్త మలుపును ఇచ్చింది. ఈ చిత్రం విజయం తర్వాత ఏవిఎం నిర్మించిన పూజలో కూడా నటించారు. కృష్ణ, శోభన్ బాబు డేట్స్ దొరకని నిర్మాతలు రామకృష్ణను హీరోగా పెట్టి రౌడీలకు రౌడీలు, పిల్లా పిడుగా, నా పేరే భగవాన్ వంటి అనేక చిత్రాలను తీశారు. హీరోగా నటిస్తూనే, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర నటుల చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. శ్రీకృష్ణుడు, విఠలుడు, శ్రీ రాఘవేంద్రస్వామి వంటి దైవ పాత్రలను అలవోకగా నటించారు. జానపద చిత్రాలైన పెద్దరాసి పెద్దమ్మ, విక్రమార్క విజయం వంటి వాటిలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎన్టీఆర్‌తో శ్రీకృష్ణుడికి అర్జునుడిగా, రాముడికి లక్ష్మణుడిగా నటించి, మాయా మశ్చీంద్ర చిత్రంలో ఎన్టీఆర్‌కు దీటుగా నటించి ప్రశంసలు అందుకున్నారు.

వ్యక్తిగత జీవితానికి వస్తే, చిత్ర పరిశ్రమలో ఉన్న చెడు అలవాట్లకు దూరంగా ఉండి అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. అయితే, వక్కపొడి ఎక్కువగా తినే అలవాటు గొంతు క్యాన్సర్‌కు దారితీసి ఆయన ఆయుష్షును తగ్గించింది. శోభన్ బాబుతో వృత్తిపరమైన పోటీ ఉన్నప్పటికీ, మంచి స్నేహితులుగా ఉండేవారు. తన మొదటి భార్యకు ఒక కూతురు ఉండగా, ఆ బంధం నిలవలేదు. ఆ తర్వాత 1973 ఆగస్టు 15న సహనటి గీతాంజలిని వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక గీతాంజలి సినిమాలకు దూరమయ్యారు. వీరికి శ్రీనివాస్ అనే కుమారుడు ఉన్నాడు. 80ల దశకం వచ్చేసరికి రామకృష్ణ కెరీర్ మళ్లీ మందగించింది. ఈ దశలో ఆయన తన కుమారుడు శ్రీనివాస్ పేరు మీద మద్రాసులో ఒక ప్రివ్యూ కమ్ డబ్బింగ్ థియేటర్‌ను ప్రారంభించారు, దీనిని ఎన్టీఆర్ ప్రారంభించారు. అయితే ఇది ఎక్కువ కాలం నడవలేదు. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి రామాపురంలో సీత చిత్రాన్ని నిర్మించినా, ఆశించిన విజయం సాధించలేదు. ఆయన చివరి చిత్రం దాసరి నటించి దర్శకత్వం వహించిన వెంకన్న బాబులో వెంకటేశ్వర స్వామిగా నటించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించిన రామకృష్ణ, ఆయన సతీమణి గీతాంజలి ప్రస్తుతం మన మధ్య లేరు. కానీ వారు నటించిన చిత్రాలు, పోషించిన పాత్రలు మాత్రం తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.

Follow Us