Dharmana Prasad Rao: “రాజకీయ పరిస్థితులను బట్టి పరిపాలన వికేంద్రీకరణ.. పాదయాత్ర ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం”..
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన క్యాపిటల్ అంశంపై అధికార నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా రాజధాని విషయంపై మంత్రి ధర్మాన ప్రసాద రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని..

ఏపీలో హాట్ టాపిక్ గా మారిన క్యాపిటల్ అంశంపై అధికార నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా రాజధాని విషయంపై మంత్రి ధర్మాన ప్రసాద రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని పెట్టడం మంచిది కాదని కేంద్ర కమిటీ చెప్పిందన్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను బట్టి పరిపాలన వికేంద్రీకరణ చేయాలని గతంలోనే డిమాండ్ వచ్చిందని తెలిపారు. ఒడిశాలో హైకోర్ట్ కటక్ లో, భువనేశ్వర్‌లో పరిపాలన రాజధాని ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా వికేంద్రీకరణ జరుగుతోందన్నారు. పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్న మంత్రి.. పాదయాత్ర ముసుగులో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. బాబు హయాంలో అమరావతి రాజధాని కోసం 3,500 రహస్య జీఓలు ఇచ్చారని ఆక్షేపించారు. రాష్ట్ర విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తే చంద్రబాబు దానిని విస్మరించారని, రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు మంచి రాజధాని అవసరం ఏర్పడిందని తెలిపారు. పదేళ్లు హైదరాబాద్‌లో ఉండొచ్చని విభజన చట్టంలో ఉన్నా చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి రెండేళ్లకే ఖాళీ చేశారని మంత్రి విమర్శించారు.
కాగా.. గతంలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలనేదే తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని చెప్పారు. మూడు రాజధానుల నిర్మాణం తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే పాలన వికేంద్రీకరణ తప్పనిసరి అని అన్నారు. అయితే మూడు రాజధానులు, సీఆర్డీఏ పిటిషన్లపై ఏపీ హైకోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. సీఆర్డీఏ చట్ట ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్లాలని స్పష్టం చేసింది.
రైతులతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని పేర్కొంది. అలాగే అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకి నివేదిక ఇవ్వాలని సూచించింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్‌ను పూర్తిచేయాలని ఆదేశించింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదికను హైకోర్టు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే హైకోర్టు నిర్దేశించిన గడువు ఎప్పుడో పూర్తికావడం గమనార్హం.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..