AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఆ గన్‌ మ్యాగజైన్ తెచ్చిస్తే పారితోషకం.. ప్రకటించిన పోలీసులు

మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ గన్‌మెన్‌ని సస్పెండ్ చేశారు ఎస్పీ వకుల్‌ జిందాల్. గన్‌ మ్యాగజైన్ పోగొట్టుకున్నాడు గన్‌మెన్ వెంకటరమణ. సాలూరు నుంచి విజయనగరం వెళ్తుండగా గన్‌మెన్ వెంకటరమణ బ్యాగ్ మిస్ అయింది. పోలీసులు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి గాలించినా 30 బుల్లెట్ల మ్యాగజైన్‌ దొరకలేదు. గన్ మ్యాగజైన్‌ గాయబ్‌ కావడంపై జిల్లా SP ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటరమణను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలిచ్చారు.

Andhra News: ఆ గన్‌ మ్యాగజైన్ తెచ్చిస్తే పారితోషకం.. ప్రకటించిన పోలీసులు
Gun Bullet Magazine
Gamidi Koteswara Rao
| Edited By: Ram Naramaneni|

Updated on: Feb 15, 2025 | 4:56 PM

Share

ఏపి రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎస్కార్ట్ గన్ మెన్ వెంకటరమణ నిర్లక్యం జిల్లా పోలీస్ శాఖను కుదిపేస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ జివి రమణ సాలూరులో మంత్రి సంధ్యారాణి వద్ద ఎస్కార్ట్ వాహనంలో గన్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన భార్యకు ఆరోగ్యం బాగోలేదని గన్‌ను సాలూరులో తన తోటి సిబ్బందికి ఇచ్చి 30 బుల్లెట్లతో నిండి ఉన్న గన్ మ్యాగజైన్‌ను మాత్రం ఒక బ్యాగ్ లో పెట్టుకొని తన సొంత గ్రామమైన విజయనగరం జిల్లా గంట్యాడకి బయలుదేరాడు. అలా బయలుదేరిన హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ జంక్షన్‌లో బస్సు దిగాడు. అనంతరం గంట్యాడ రోడ్డులో ఉన్న ఒక జిరాక్స్ షాప్ వద్ద ఆగి తన వద్ద ఉన్న బ్యాగ్ అక్కడ పెట్టి తెలిసిన వారితో కొంతసేపు మాట్లాడుతూ ఉండిపోయాడు. అనంతరం బ్యాగ్ విషయం మరిచిపోయి వెళ్లిపోయాడు. సుమారు 30 నిమిషాల తరువాత బ్యాగ్ గుర్తుకు వచ్చి పరుగుపరుగున జిరాక్స్ షాప్ వద్దకు వెళ్లి చూడగా బ్యాగ్ కనిపించలేదు. వెంటనే తన బ్యాగ్ మిస్సయిందని, అందులో 30 రౌండ్లతో నిండి ఉన్న గన్ మ్యాగజైన్ ఉందని, వెతికి పెట్టాలని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

గన్ మ్యాగజైన్ పోగొట్టిన హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణను సస్పెండ్ చేశారు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి. ఇప్పుడు విజయనగరం, మన్యం జిల్లాలో గన్ మ్యాగజైన్ తో ఉన్న బ్యాగ్ మిస్సింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. మిస్సయిన బ్యాగ్‌లో 30 బుల్లెట్లతో నిండి ఉన్న గన్ మ్యాగజైన్ ఉండటంతో బ్యాగ్ ఎవరికి దొరికిందో? బుల్లెట్స్ పరిస్థితి ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు పోలీసులు. గన్ మ్యాగజైన్ ను వెతికెందుకు పెద్ద ఎత్తున బృందాలుగా ఏర్పడి ముమ్మర గాలింపు చేపట్టారు పోలీసులు. గత రెండు రోజులుగా పోలీసులు బ్యాగ్ కోసం వెతుకుతున్నప్పటికీ ఇప్పటివరకు గన్ మ్యాగజైన్ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. 30 బుల్లెట్స్ మ్యాగజైన్ కావడంతో ఉన్నతాధికారులు సైతం సీరియస్ గా తీసుకున్నారు. గన్ మ్యాగజైన్ వదిలేసిన హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణను వెంటనే సస్పెండ్ చేశారు.

ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో మావోయిస్టులు సంచరించే ప్రాంతానికి విజయనగరం సమీపంలో ఉండటంతో బుల్లెట్ వ్యవహారం ఉత్కంఠగా మారింది. గన్ మ్యాగజైన్ ఉన్న బ్యాగ్ కోసం సిసి కెమెరాలు పాటు అనేక రకాలుగా గాలిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే బ్యాగ్ కోసం పోలీస్ ప్రకటన కూడా విడుదల చేశారు. బ్యాగ్ ఎవరికైనా దొరికితే ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు. బ్యాగ్ ఇచ్చిన వారికి పారితోషికం కూడా ఇస్తామని ప్రకటించారు. మిస్సయిన బ్యాగ్, గన్ మ్యాగజైన్ ఫోటోలు విడుదల చేశారు. బ్యాగ్ ఇచ్చిన వారిపై కేసు నమోదు చేయమని తెలిపారు పోలీసులు. గన్ మ్యాగజైన్ కోసం ప్రత్యేక టీమ్స్ తో ముమ్మర గాలింపు కొనసాగుతున్నట్లు ప్రకటించారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..