AP News: ఆ గ్రామంలో మగబిడ్డ పుడితే దేశానికే అంకితం.. అగ్నిపథ్ వచ్చిన తగ్గేదెలే.!
ఆ గ్రామంలో మగబిడ్డ పుడితే దేశానికి అంకితం.. ఆ గ్రామంలో ఇంటికో సైనికుడు తప్పనిసరిగా ఉంటాడు.. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ తెచ్చిన ఆందోళన చెందకుండా దేశసేవ చేయడమే ముఖ్యమని ఆ గ్రామ యువకులు కసరత్తు చేస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది?
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలోని మాధవరంలో గ్రామంలో ఆర్మీ ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. అగ్నిపథ్ పథకం వచ్చిన భయాందోళనకు గురికాకుండా సైన్యం రిక్రూట్‌మెంట్ కోసం గ్రామ యువకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్మీలో ఎలాగైనా చేరాడని దాదాపు మూడు సంవత్సరాలుగా కసరత్తు చేస్తున్నారు. మాధవరం గ్రామంలోకి ముందు ఎంటర్ అవ్వగానే మొదట భారీ హనుమంతుని విగ్రహం దర్శనమిస్తుంది. మిలటరీ మాధవరంగా ఆ గ్రామం పాపులర్ అయింది. ప్రస్తుతం ఆర్మీలో పని చేస్తున్న లేదా రిటైర్డ్ అయిన గ్రామంలోని ప్రతి కుటుంబంలో కనీసం ఒక ఆర్మీ సిబ్బంది అయినా ఉంటారు.
మాధవరంలో బిగువైన శరీరాలు, విశాలమైన ఛాతీ, దట్టమైన మీసాలతో ఉన్న పురుషులు కనబడుతూ ఉంటారు. సుమారు 6,500 జనాభా ఉన్న గ్రామంలో ప్రస్తుతం దాదాపు 320 మంది సైన్యంలో పనిచేస్తున్నారు. దాదాపు 1800 మంది పురుషులు సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసి మాధవరంలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సహా అనేక రాష్ట్రాల్లో నిరసనలు చెలరేగగా, మాధవరం నుండి ఒక్క వ్యక్తి కూడా హింసలో పాల్గొనలేదు. సైన్యంలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నప్పటికీ, చాలా మంది యువకులు సైన్యంలో చేరాలని ఆకాంక్షిస్తున్నప్పటికీ, ఎవరూ ఎలా నిరసన వ్యక్తం చేయకపోవడం గమనార్హం. కొత్త పథకంపై సందిగ్ధత, భయాందోళనలు ఉన్నప్పటికీ సైన్యంలో సేవ చేయాలనే స్ఫూర్తిని ఈ గ్రామ యువకుల్లో తగ్గించలేదని చెప్పవచ్చు.