MEIL Oxygen: సింగపూర్ నుంచి మూడు ఆక్సిజన్ క్రయోజెనిక్ టాంకర్లు.. ఉచితంగా ఏపీకి అందచేస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ!
MEIL Oxygen: కరోనా మహమ్మారి రెండో వేవ్ కొనసాగుతోంది. ఈసారి కరోనా నేరుగా మనుషుల ప్రాణవాయువును తీసి పక్కన పాడేస్తోంది. ఒకేసారి వేలాది మందికి ఆక్సిజన్ అవసరమైన స్థితిలో ఆక్సిజన్ సరఫరా లేక.. ప్రభుత్వాలు ఇబ్బంది పడ్డాయి.

MEIL Oxygen: కరోనా మహమ్మారి రెండో వేవ్ కొనసాగుతోంది. ఈసారి కరోనా నేరుగా మనుషుల ప్రాణవాయువును తీసి పక్కన పాడేస్తోంది. ఒకేసారి వేలాది మందికి ఆక్సిజన్ అవసరమైన స్థితిలో ఆక్సిజన్ సరఫరా లేక.. ప్రభుత్వాలు ఇబ్బంది పడ్డాయి. చాలా మంది సమయానికి ఆక్సిజన్ అందక మరణాల పాలయ్యారు. ఈ పరిస్థితిలో ఆసుపత్రులకు ఆక్సిజన్ అందించి ప్రజల ప్రాణాలు కాపాడటానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయి. మేఘా ఇంజనీరింగ్ సంస్థ(ఎంఈఐఎల్) రెండు తెలుగు రాష్ట్రాలకు ఆఘమేఘాల మీద ఆక్సిజన్ సరఫరా ఏర్పాట్లు చేసింది. ప్రాణవాయువు ప్రజలకు చేర్చి ఎందరినో పునరుజ్జీవులను చేసింది. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ కు సింగపూర్ నుంచి 3 ఆక్సిజన్ క్రయోజెనిక్ టాంకర్లు వచ్చాయి. ఆ ఆక్సిజన్ ను దిగుమతి చేసి ఏపీ ప్రభుత్వానికి ఉచితంగా అందచేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. రక్షణ శాఖ ప్రత్యెక విమానంలో పశ్చిమ బెంగాల్ లోని పానాగఢ్ వైమానిక స్థావరానికి ఈ మూడు మేఘా ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకర్లు చేరుకున్నాయి. వీటి ద్వారా ఒక్కో ట్యాంక్ నుంచి కోటీ 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ లభిస్తుంది. ఈ ఆక్సిజన్ ను పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ లో నింపుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆక్సిజన్ ట్యాంకులు రానున్నాయి.
మేఘా సంస్థ తెలుగు రాష్ట్రాలకు థాయ్‌లాండ్, సింగపూర్ లనుండి క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు దిగుమతి చేస్తోంది. అంతే కాకుండా కోవిడ్ విపత్తుతో పాటు, భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యంగా హైదరాబాద్ లోని బొల్లారంలో ఇప్పటికే ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. ఇప్పటికే తెలంగాణా, ఏపీ, ఒడిశా లలోని కోవిడ్ ఆసుపత్రులకు ఎంఈఐఎల్ ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. మూడువారాల క్రితం ప్రారంభించిన ఈ ఆక్సిజన్ ఉచిత సరఫరాలో ఇప్పటివరకూ 56014 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను సరఫరా చేసింది మేఘా సంస్థ.