Andhra: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ.. కట్ చేస్తే.. సాయంత్రం భర్త వచ్చి తలుపులు తీయగా
ఆ తల్లికి చెప్పుకోలేని కష్టం వచ్చింది. తాను లేకపోతే తన గారాల పట్టిని చూసుకునేవారు ఎవరూ ఉండరని భావించింది. తనను తాను చంపుకుని.. అంతకంటే ముందే బిడ్డను కూడా కడతేర్చింది ఆ తల్లి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా..

బిడ్డ కడుపులో పడ్డాడంటే ఆ తల్లికి చెప్పలేనంత ఆనందం. బిడ్డ కడుపులో పెరుగుతూ ఉంటే మురిసిపోతూ ఎప్పుడు తన గారాల పట్టి ఒడిలోకి చేరుతాడన్న ఆలోచనతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక బిడ్డ పుట్టగానే చూసి పురిటి నొప్పులన్నీ మరిచిపోతుంది ఆ తల్లి. ఆ తరువాత.. అనుక్షణం తనను కంటికి రెప్పలా కాపాడుకుని పెంచుతుంది ఆ తల్లి. అందుకే తల్లిని మాతృమూర్తి అంటారు. ఎంత కష్టమైనా తన పిల్లల కోసం భరించి.. ఆలనా పాలన చూస్తుంది. అంతటి మాతృప్రేమ కలిగిన ఆ తల్లికి కష్టమొస్తే.. పంటి బిగువున దాచుకుంటుంది. ఇక భరించలేనంతగా కష్టం వచ్చి పడితే.. ఇక జీవితం చాలు అనుకున్నప్పుడు.. ఆ పిల్లల కోసం ఒక్క క్షణం ఆలోచిస్తుంది. అనకాపల్లి జిల్లాలో ఓ తల్లి.. విషాదకర నిర్ణయం తీసుకుంది.
తాను లేకపోతే ఇక.. తన గారాల పట్టి ఈ లోకంలో కష్టాలు అనుభవిస్తాడని అనుకుందో ఏమో కానీ.. లాలించిన చేతులతోనే ఊపిరి తీసింది. తను కూడా బలవన్మరణంతో తనువు చాలించింది. ఎంతటి విషాదకర ఘటన అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగింది. వరకట్నం వేధింపులకు తీవ్ర మనోవేదనకు గురైన ఆ తల్లి ఆరు నెలల కొడుకును ఊపిరి తీసి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుమ్మడ గ్రామానికి చెందిన వీణ.. అదే జిల్లా కౌడుతండ గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు ప్రేమించుకున్నారు. ఇష్టపడిన వారిద్దరూ పెద్దలను ఒప్పించి గతేడాది జనవరిలో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరు నెలల బాబు వియాన్స్ ఉన్నాడు.
ఉమామహేశ్వరరావు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. ఉద్యోగరీత్యా చోడవరం కనకమహాలక్ష్మినగర్లో ఓ ఇంటిని అద్దెకు నివాసముంటున్నారు. అయితే.. రోజూ మాదిరిగానే ఉమామహేశ్వరరావు పాఠశాలకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో భార్య వీణకు ఫోన్ చేశాడు. ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. స్కూల్ సమయం ముగిశాక ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు వేసి ఉండడం తలుపు తీయకపోవడంతో భయపడ్డాడు. చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు పగలగొట్టి చూశాడు. గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని వీణ మృతి చెంది ఉండగా.. మంచం పక్కనే బాబు విగతజీవిగా పడి ఉన్నాడు.
ఆరు నెలల బాబును తలగడతో అదిమి హత్య చేసి.. ఆ తర్వాత ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఘటన స్థలంలో ఆధారాలను బట్టి వివరాలను బట్టి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ‘చెల్లి, బావ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.. పెళ్లి సమయంలో 20 లక్షల రూపాయల కట్నం కూడా సమర్పించారు. బావ తరచూ మానసికంగా, శరీరకంగా వేధిస్తూ కొట్టేవాడని చెల్లి చెప్పేది. సర్దుకుపోవాలని సూచించాను. ఇంతలో ఈ ఘోరం జరిగిపోయింది. అదనపు కట్నం కోసమే బావ వేధించాడు’ అని అన్నాడు మృతురాలి సోదరుడు రత్నాకర్. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించారు డీఎస్పీ శ్రావణి. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో వరకట్న వేధింపుల కేసు నమోదు చేశామన్నారు డీఎస్పీ.
ఇదీ.. భరించలేని కష్టంతో.. ఇక ఈ లోకంలో ఉండకూడదని అనుకున్న వీణ.. తను ఈ లోకం వీడితే తన గారాల పట్టి పరిస్థితి ఏంటని అనుకొని తనతో పాటే తీసుకెళ్లిపోయిన ఘటన అందరిని కలచివేసింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదంలోకి నింపింది. ఆ తల్లి కొడుకుల మృతదేహాలు చూసినవారు కంటతడి పెట్టక తప్పలేదు.
