AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ప్రేమ పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. కట్‌చేస్తే.. ఆ ఇంట్లో ఆ రాత్రి ఏం జరిగింది..?

ప్రేమించి పెళ్లాడిన ఇల్లాలికి తోడుగా నిలవాల్సింది పోయి, డబ్బు దాహంతో ప్రాణాలే తీసేశాడు. విజయనగరం జిల్లా కనిమెరకలో జరిగిన వివాహిత అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు చేపట్టిన విచారణలో దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. భర్త క్రూరత్వాన్ని పోలీసులు ఎలా బయటపెట్టారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Andhra Pradesh: ప్రేమ పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. కట్‌చేస్తే.. ఆ ఇంట్లో ఆ రాత్రి ఏం జరిగింది..?
Man Suffocates Wife To Death In Bondapalli
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Sep 04, 2026 | 1:16 PM

Share

కష్టసుఖాల్లో తోడుంటానని ఏడడుగులు నడిచిన భర్తే కాలయముడిగా మారాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇల్లాలిని అతి కిరాతకంగా పొట్టనబెట్టుకున్నాడు. విజయనగరం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఓ వివాహిత అనుమానాస్పద మృతి కేసును బొండపల్లి పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ప్రమాదవశాత్తూ జరిగిన మరణం కాదని, స్వయంగా భర్తే పథకం ప్రకారం ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కనిమెరక గ్రామానికి చెందిన బుంగ సంధ్య, అదే గ్రామానికి చెందిన రామ ముత్యాలరావు పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహమైన తొలినాళ్లలో సంసారం ఎంతో అన్యోన్యంగా సాగింది. అయితే కాలక్రమంలో దంపతుల మధ్య ఆర్థిక లావాదేవీలు, డబ్బుల విషయంలో తరచూ తీవ్ర వివాదాలు మొదలయ్యాయి.

డబ్బు కావాలంటూ ముత్యాలరావు నిత్యం సంధ్యపై భౌతిక దాడికి దిగేవాడు. కూతురి కాపురం నిలబడాలన్న తాపత్రయంతో సంధ్య తల్లి పలుమార్లు అల్లుడికి ఆర్థికంగా సాయం చేస్తూ వచ్చింది. అయినప్పటికీ ముత్యాలరావు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు సరికదా.. వేధింపులు రోజురోజుకూ మరింత ముదిరాయి. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున సంధ్య తన ఇంట్లో విగతజీవిగా పడి ఉంది. విషయం తెలుసుకున్న సంధ్య తల్లి, కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని చూడగా ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయి ఉంది. ఆమె మృతిపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు వెంటనే బొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు.

అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక రావడంతో అసలు గుట్టు రట్టయింది. సంధ్యకు గాలి ఆడకపోవడం వల్ల బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టి మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. దీంతో పోలీసులు భర్త ముత్యాలరావును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. భార్య ముక్కు, నోరు బలంగా మూసి ఊపిరాడకుండా చేసి తానే హతమార్చినట్లు నిందితుడు నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు పక్కా ఆధారాలతో నిందితుడు ముత్యాలరావుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పదేళ్ల కాపురం, ఇద్దరు పిల్లలు ఉన్నా కనికరం లేకుండా భార్యను చంపిన నిందితుడి తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us