AP News: మరికాసేపట్లో పెళ్లి అనగా.. వధువు ఆభరణాలు మిస్.. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్
అందరూ పెళ్లి హడావుడిలో ఉన్నారు... మరికాసేపట్లో ముహూర్తం అనగా పెళ్లి మండపంలో వధువు కుటుంబ సభ్యుల్లో కంగారు మొదలైంది. పెళ్లి మండపం మీదకు వెళ్లేందుకు రెడీ అవుతున్న వధువు బంగార ఆభరణాలు మిస్ అయ్యాయి.... అప్పటికప్పుడు ఎలాగోలా బంధువులు, కుటుంబ సభ్యుల ఆభరణాలు వధువుకు అలంకరించి పెళ్లి జరిపించారు. ఆ తర్వాత....
అనంతపురం జిల్లా పామిడిలో ఓ ఫంక్షన్ హాల్‌లో మరికాసేపట్లో పెళ్లి అనగా పెళ్లికూతురు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. కంగారుపడిన వధువు కుటుంబ సభ్యులు… అప్పటికి ఎలాగోలా కుటుంబ సభ్యుల ఆభరణాలు పెళ్ళికూతురుకు అలంకరించి పెళ్లి తంతు ముగించారు. వెంటనే వధువు కుటుంబ సభ్యులు.. ఆభరణాలు మిస్ అవ్వడంపై పామిడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి అయిన కాసేపటికి విచారణ ప్రారంభించిన పోలీసులకు ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలిసాయి. పెళ్లి కూతురుకి మేకప్ వేయడానికి వచ్చిన బ్యూటీషియనే… ఆభరణాలు సర్దేసిందని పోలీసులు గుర్తించారు. కేవలం మూడు గంటల వ్యవధిలోని కేసును ఎంతో చాకచక్యంగా చేదించారు. ఫంక్షన్ హాల్‌లో పెళ్లికూతురుని రెడీ చేసే గదిలోకి ఎవరెవరు వెళ్లారు అని సిసి ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు… వధువు, వధువు తల్లి, అక్కతో పాటు బ్యూటీషియన్ అనూష ఆ గదిలోకి వెళ్లారని పోలీసులు గుర్తించారు. వధువు గదిలోని సీలింగ్‌లో బంగారు ఆభరణాలు ఉంచే ఖాళీ పెట్టెలు పోలీసులు గుర్తించారు. దీంతో వధువు కుటుంబ సభ్యులు, బ్యూటిషియన్ అనూష తప్ప… బయట వారెవరు గదిలోకి రాలేదని తెలుసుకున్న పోలీసులు… ఉరవకొండలో ఉంటున్న అనూష ఇంటికి వెళ్లి తమదైన శైలిలో విచారించారు.
అసలు విషయం తెలుసుకున్న పోలీసులు బ్యూటీషియన్ అనూష తెలివితేటలకు కంగుతిన్నారు. రెండు బంగారపు వడ్డాణాలను దొంగిలించిన బ్యూటిషియన్ అనూష… వాటిని ఎవరు గుర్తించలేరని బాత్రూంలోని ఫ్లష్‌లో దాచి పెట్టింది. పెళ్లయిపోయిన వెంటనే బంగారు ఆభరణాలు తీసుకొని పెళ్లి మండపం నుంచి ఉడాయించింది. దాదాపు 38 తులాల బంగారపు వడ్డాణాలను బ్యూటిషియన్ అనూష నుంచి పోలీసులు స్వాధీనం చేసుకుని… వధువు కుటుంబ సభ్యులకు అప్పగించారు. తమ పక్కనే ఉంటూ… పెళ్లి కూతురుకి మేకప్ వేస్తూ… సోప్ వేసిన బ్యూటిషియన్ అనూష చేసిన పనికి వధువు కుటుంబ సభ్యులు నోరెళ్లబెట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి