త్వరలోనే అవినీతి, అరాచక ప్రభుత్వం అంతమై ఆంధ్రప్రదేశ్‌లో ఏన్డీయే ప్రభుత్వం కొలువు తీరుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. టీడీపీ, జనసేనతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుందో ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు షా. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో నిర్వహించిన ప్రజాగళం సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ పాల్గొన్నారు. ఆ క్రమంలో జగన్ సర్కార్‌పై అమిత్ షా ఘాటుగా విమర్శలు గుప్పించారు.
ఏపీలో రాజ్యమేలుతున్న అవినీతి, అరాచక పాలనకు ముగింపు పలకడానికే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయని అమిత్ షా స్పష్టం చేశారు. అవినీతిపై జరుగుతున్న పోరాటానికి మద్ధతు తెలిపేందుకే తాను రాష్ట్రానికి వచ్చానన్నారు. ఈ పోరాటానికి బలం చేకూర్చడానికే తాను ధర్మవరం వచ్చానని అమిత్ షా తెలిపారు. ఏడు దశలలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికలలో రెండు దశలు ఇప్పటికే పూర్తయ్యాయని గుర్తుచేశారు. ఈ రెండు దశలలో మోదీ సెంచరీ పూర్తి చేశారని చెప్పారు. మూడో దశ పోలింగ్ లో 400 సీట్లు సాధించే దిశగా దూసుకెళుతున్నారని అమిత్ షా వెల్లడించారు.
రాష్ట్రంలో గూండాగిరిని, నేరస్థుల ఆటకట్టించేందుకే పొత్తు పెట్టుకున్నామన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టలను పూర్తి చేయడంతోపాటు అమరావతిని మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయడానికి పొత్తుపెట్టుకున్నామని అమిత్ షా తెలిపారు. తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను పునస్థాపితమన్న అమిత్ షా, తెలుగు భాషను పరిరక్షించేందుకు పొత్తుపెట్టుకున్నామన్నారు. ఇక రాబోయే రెండు సంవత్సరాల్లోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తెలుగు భాషను నిర్వీర్యం చేయాలని చూస్తే సహించబోమన్న అమిత్ షా.. బీజేపీ ఉన్నంత వరకూ తెలుగు భాషను కాపాడుకుంటామని స్పష్టం చేశారు.
ఇక అదే రేంజ్‌లో కాంగ్రెస్ ఇండియా కూటమిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. ప్రతిపక్ష కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదన్నారు. ఇప్పటికే అనేక పార్టీలు ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చాయన్న అమిత్ షా, మోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీయే సర్కార్ కేంద్ర కొలువు దీరబోతున్నట్లు స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…