Coconut Water: ఓర్నాయనో.. ఇదేంది.. ఒక్కసారే బోండాం ధర 70 చేశారు.. ఇక తాగేదెట్లా..!
ఎండలు దంచికొడుతున్నాయి.. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఒక పక్క ఎండ వేడి.. మరో పక్క ఉక్కపోతతో బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.. ఎండల తాపం నుంచి బయటపడేందుకు జనం.. కొబ్బరిబొండాలు, లస్సీ, ఫ్రూట్ జ్యూస్ లాంటి పానీయాలను తాగుతుండటంతో.. వీటికి డిమాండ్ మరింత పెరిగింది..

ఈ క్రమంలో.. కొబ్బరి బొండాల వ్యాపారస్థులు ఒకేసారి ధరలు పెంచడం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో వినియోగదారులు వ్యాపారుల తీరుపై మండిపడుతున్నారు. దేశంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్న పరిస్థితి. నంద్యాల చాగలమర్రి ఆత్మకూరు తదితర ప్రాంతాలలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే అవకాశంగా తీసుకున్న కొందరు… వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు ఎక్కువగా ఇష్టపడే కొబ్బరి బొండాముల ధరలు విపరీతంగా పెంచేశారు. వ్యాపారులంతా కర్నూల్ జిల్లాలో సిండికేట్ గా మారారు. వ్యాపారాన్ని ఒక్కరే శాశిస్తున్నట్టంతో ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ పోతున్నారు.
ఇది వరకు కొబ్బరి బొండం ధర 50 రూపాయలు ఉండగా.. ఇప్పుడు ఏకంగా 70 రూపాయలు పెరిగింది. లీటర్ కొబ్బరి నీళ్లు 180 రూపాయలు తీసుకుంటున్నారు. రెండు నెలల్లోనే 40 శాతం ధరలు పెరగడం పట్ల కర్నూలు నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై కొందరు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ.. ధరలను నియంత్రించడం లేదు.
వీడియో చూడండి…
వాస్తవానికి కర్నూలు నగరం ఏపీలో మెడికల్ హబ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా హాస్పిటల్ కనిపిస్తాయి. హాస్పిటల్స్ లో ఉన్న రోగుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొబ్బరి బోండా వ్యాపారులు ఇబ్బడిముబ్బడిగా ధరలు పేంచేశారు. ఆంధ్రప్రదేశ్ లో బహుశా ఎక్కడా కూడా ఇంత రేట్లు లేవని కర్నూలు నగర వాసులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఒక కొబ్బరి బొండం 20 నుంచి 30 రూపాయలు మాత్రమే.. అయినప్పటికీ.. 70, 80 రూపాయలు తీసుకోవడం ఏంటని.. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి కొబ్బరి బోండాల ధరలు నియంత్రించాల్సిన అవసరం ఉందని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..