Kurnool bus accident: కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ వీడింది.. ఘటన మొత్తాన్ని వివరించిన పోలీసులు
బైకే బాంబ్‌లా పేలింది...! బస్సునూ కాల్చేసింది...! బైకర్ శివశంకర్ చనిపోయే ముందు అతనితో కనిపించిన ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. బస్సు పాలిట బైక్ ఎలా బాంబ్‌గా మారిందో వివరించారు. మరోవైపు వి.కావేరీ ట్రావెల్స్‌పై కేసులు నమోదవుతున్నాయి.

కర్నూలు బస్సు ప్రమాదం బైక్‌ను లాక్కెళ్లడంతోనే జరిగిందని తేల్చేశారు పోలీసులు. బస్సు స్పాట్‌కి రాకముందే బైక్ యాక్సిడెంట్ జరిగిందని… ఆ బైక్‌ను బస్సు 200 మీటర్ల వరకు లాక్కెళ్లడంతో పెట్రోల్ ట్యాంక్ లీకై… రోడ్డు రాపిడికి మంటలు చెలరేగాయని క్లారిటీ ఇచ్చారు. బైక్‌పై నుంచి కిందపడ్డ వెంటనే శివశంకర్ స్పాట్ డెడ్ అయ్యాడని వెల్లడించారు. అతని వెంట బైక్‌పై వెళ్లిన ఎర్రిస్వామి స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకోగా… రోడ్డు మధ్యలో పడివున్న బైక్‌ను పక్కకు లాగుదామనుకునేలోపే బస్సు వచ్చి లాక్కెళ్లిందని పోలీసుల విచారణలో తేలింది. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కోసం ఎర్రిస్వామిని కర్నూలు జిల్లా డోన్‌లో దింపేందుకు శివశంకర్ వెళ్లగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అసలే మంటలు… లాట్స్‌లో వందలాది మొబైల్స్ ఫోన్స్ ఉండటం కూడా ప్రమాద తీవ్రతను పెంచింది. పెద్దఎత్తున మంటలు వ్యాపించి కొన్ని నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది. మంటల నుంచి తప్పించుకోలేక 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే బైకర్ శివశంకర్ మద్యం మత్తులో ఉన్నాడా అంటే అప్పుడే చెప్పలేం అంటున్నారు పోలీసులు. ప్రమాదానికి ముందు ఓ పెట్రోల్ బంక్‌లోకి వెళ్లిన శివశంకర్ బైక్‌ను కాస్త నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం చూస్తే మద్యం సేవించినట్లే అనిపిస్తోందని ప్రశ్నించగా… పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు.
బస్సులో అంతగా మంటలు చెలరేగడం, అంతమంది ప్రాణాలు కోల్పోడానికి కారణాలు చూస్తే..
బైక్ ఆయిల్ ట్యాంక్ క్యాప్ ఓపెన్‌గా ఉండటం: రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను బస్ 200మీటర్లు ఈడ్చుకెల్లింది. ఆసమయంలో బైక్ పెట్రోల్ ట్యాంక్ క్యాప్ ఓపెన్ అయింది. పెట్రోల్ ఎగచిమ్మడంతో మంటలు చెలరేగాయి.
బస్సు ఇంధన ట్యాంక్ రప్చర్: బైక్ మూలంగా బస్సు డీజిల్ ట్యాంక్ కూడా ఒక్కసారిగా పగిలిపోయి ఆయిల్ బయటకు వచ్చింది. దీంతో బస్సు ముందు భాగం బ్లాస్ట్‌లా పేలింది.
ఓవర్‌స్పీడ్ వల్ల తీవ్ర ఇంపాక్ట్: బస్సు వేగం కూడా ప్రమాద తీవ్రతను పెంచింది. వేగంతో దూసుకుపోవడంతో ఫ్యూయల్ సిస్టమ్‌లోని సేఫ్టీ పరికరాలు దెబ్బతిన్నాయి. ఇది మంటలు చెలరేగడానికి కారణమైంది
ఫైర్ సేఫ్టీ సిస్టమ్ లోపం: బస్సును సీటర్ నుంచి స్లీపర్‌గా మార్చినప్పుడు ఫైర్ సప్రెషన్ సిస్టమ్‌లు సరిగా ఇన్‌స్టాల్ చేయలేదు, ఇది మంటలు వ్యాప్తికి మరో కారణం
ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ లాక్ అవడం: వెనుక వైపు ఉన్న ఎమర్జెన్సీ డోర్ లాక్ అవడంతో ప్రయాణికులు త్వరగా బయటపడలేక పోయారు, ఈలోపు మంటలు బస్సును కమ్మేశాయి
ప్రయాణికులు నిద్రలో ఉండటం: ప్రయాణికులంతా నిద్రలో ఉండటం కూడా మృతుల సంఖ్యను పెంచింది. ఎస్కేప్ అయ్యే అవకాశం లేకుండా పోయింది.
సెల్‌ఫోన్స్ క్యారీ చేయడం: మంటలు ఇంతలా వ్యాప్తి కావడానికి మరో ప్రధానమైన రీజన్. బస్సు లగేజ్ గ్యారేజ్‌లో సెల్‌ఫోన్స్ ఉండడం. 400 సెల్‌ఫోన్స్ మంటలకు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోవడంతో మంటల తీవ్రత ఇంకా పెరిగింది.
పూర్ వెంటిలేషన్: వెంటిలేషన్ సిస్టమ్ సరిగా లేకపోవటంతో విషవాయువులతో కూడిన పొగ బస్సును కమ్మేసింది. పొగ పీల్చడంతోనే చాలామంది చనిపోయారు. తర్వాత మంటలకు దహనం అయ్యారు
మెటీరియల్స్ నాణ్యతా లోపం: స్లీపర్ బస్సులో ఉపయోగించిన మెటీరియల్ అంతా నాసిరకమైంది. అగ్ని నిరోధకత లేని మెటీరియల్‌ను ఉపయోగించడంతో మంటలు వేగంగా వ్యాపించాయి
ఇటు బస్సు ప్రమాదంపై ఉలిందకొండ పీఎస్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. 125(a), 106(1)BNS సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసి విచారిస్తున్నారు. అదుపులో ఉన్న బస్సు డ్రైవర్లనూ విచారిస్తున్నారు. ఇటు వి.కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం, డ్రైవర్లపైనా బాధిత కుటుంబాలు కంప్లైంట్ చేశాయి. నెల్లూరు జిల్లాకు చెందిన నెలకుర్తి రమేష్ అనే వ్యక్తి… తన అన్న ఫ్యామిలీ చనిపోవడానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమేనంటూ పోలీసులను ఆశ్రయించాడు. ప్రమాదానికి కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మొత్తంగా… చనిపోయిన శివశంకర్ మిత్రుడు ఎర్రిస్వామి విచారణ ఓవైపు… అదుపులో ఉన్న డ్రైవర్ల ఎంక్వైరీ మరోవైపు. దీంతో బస్సు ప్రమాదం కేసులో ఇంకెలాంటి విషయాలు బయటకొస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
