SP Ravindranath Babu: “ఇది ప్లానింగ్ ప్రకారం జరిగిన మర్డర్ కాదు.. ఇద్దరి మధ్య జరిగిన గొడవలో…”
ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేశామని కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. ప్రాథమిక విచారణ ఆధారంగా ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశామన్నారు.
సుబ్రహ్మణ్యం హత్య కేసులో మిస్టరీ వీడింది. ఎమ్మెల్సీనే నిందితుడిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. MLCపై సెక్షన్ 302, SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. కొద్ది సేపటి క్రితమే వైద్యపరీక్షలు నిర్వహించి మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. అయితే ఇది ప్లానింగ్ ప్రకారం జరిగిన మర్డర్ కాదనీ.. ఇద్దరి మధ్య జరిగిన గొడవలో సుబ్రహ్మణ్యం ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు పోలీసులు. “ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు.. యాక్సిడెంట్ డ్రామా ఆడారనీ, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారన్నారు కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు. ఈనెల 19న రాత్రి ఫ్రెండ్స్‌తో కలిసి.. సుబ్రహ్మణ్యం మద్యం తాగాడు. అటుగా వచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు.. సుబ్రహ్మణ్యాన్ని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. సుబ్రహ్మణ్యం ఇవ్వాల్సిన రూ.20వేల కోసం MLCఅడిగాడు. అంతే కాదు ప్రవర్తన మార్చుకోమని వార్నింగ్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో.. ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంను కొట్టాడు. MLC అనంతబాబుపై సుబ్రహ్మణ్యం తిరగబడటంతో.. సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు వెనక్కి నెట్టాడు. తోపులాటలో ఇనుపచువ్వలపై సుబ్రహ్మణ్యం పడిపోయి.. సుబ్రహ్మణ్యం తలకు గాయమైంది. ఆపై ఆస్పత్రికి తీసుకెళ్లే మధ్యలో సుబ్రహ్మణ్యం చనిపోవడంతో.. అనంతబాబు షాక్‌కు గురయ్యాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు.. ఎమ్మెల్సీ ప్రయత్నించాడు” అని తెలిపారు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు. ప్రమాదంలా ఉండాలని సుబ్రహ్మణ్యం డెడ్‌బాడీని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి శరీరంపై.. కర్రతో అనేక చోట్ల గాయపరిచినట్టు చెప్తున్నారు. ప్రధాన నిందితుడి కోసం ఆరు బృందాలతో గాలించామని.., ఇవాళ నిందితుడు అనంతబాబును కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు.