Palnadu: పగ, ప్రతీకారాలే కాదు.. పల్నాడు గడ్డపై శాంతి, అహింస పరిఢవిల్లాయ్.. చారిత్రక ఆధారాలు ఇవిగో

పల్నాడు గడ్డ అంటేనే పగ, ప్రతికారాలే అందరికీ గుర్తకు వస్తాయి. అయితే ఈ గడ్డపై శాంతి, అహింసా సిద్ధాంతాలు పరిఢవిల్లాయని తెలుస్తోంది. ఇటీవల ఈ ప్రాంతంలో బయటపడుతున్న ఆనవాళ్లే ఇందుకు ప్రత్యేక్ష నిదర్శనాలంటున్నారు చరిత్ర కారులు..

Palnadu: పగ, ప్రతీకారాలే కాదు.. పల్నాడు గడ్డపై శాంతి, అహింస పరిఢవిల్లాయ్.. చారిత్రక ఆధారాలు ఇవిగో
Palnadu
Follow us
T Nagaraju

| Edited By: Basha Shek

Updated on: Nov 11, 2024 | 11:21 PM

పల్నాడు అనగానే పగ, ప్రతీకారాలు గుర్తుకొస్తాయి.. బ్రహ్మ నాయుడుపై యుద్దం వీరనారి నాయకురాలు నాగమ్మ గుర్తుకొస్తుంది. కోడి పందేల్లో ఓడిపోయి రాజ్యం కోసం యుద్దం చేసుకున్న అన్నదమ్ముల కథ మదిలో మెదులుతుంది. ఆ తర్వాత ఫ్యాక్షన్ గుర్తొకొస్తుంది. అధికార దాహంతో రెండు వర్గాలు విడిపోయి కొట్టుకున్న చరిత్ర కథలు కళ్లముందు కథలాడుతాయి. అయితే ఇవి మాత్రమే పల్నాడు కాదని చారిత్రక ఆనవాళ్లు చెబుతున్నాయి. శాంతి, అహంసలు పరిఢవిల్లిన నేలగా ఆనవాల్లు సరికొత్త చరిత్రను మన ముందుకు తీసుకొస్తుంది. ఇందుకు మాచర్లలో బయటపడుతున్న ఆనవాళ్లే నిదర్శనమంటున్నారు చరిత్రకారులు. మాచర్ల పట్టణంలో అనేక ఆనవాళ్లు జైన మతం పరిఢవిల్లిన విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నాయి. స్థానికులు వాటిని పోతురాలు, నాగులమ్మ వంటి పేర్లతో పూజలు చేస్తున్న వాటి అసలు కథ మాత్రం జైన మతంలో ఉందంటున్నారు చరిత్ర కారుడు పావులూరి సతీష్. ఎక్కడెక్కడ ఏయే ఆనవాళ్లు ఉన్నాయంటే…

పార్శ్వనాధుడు కొలువై ఉన్న సమాధుల దొడ్డి…

సమాధుల మధ్యలో నాలుగడుగుల ఎత్తైన విగ్రహం అద్భుత శిల్పకళతో కట్టిపడేస్తుంది. అది 23వ తీర్ధంకురుడైన పార్శ్వనాథుడు విగ్రహం..నాగుపాము ఏడు పడగల నీడలో నిల్చున్న విగ్రహం చూపరలును ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆ విగ్రహంలో ఆయన చుట్టూ ధ్యాన ముద్రలో ఉన్న 23 తీర్ధంకరులున్నారు. విగ్రహం కింద భాగంలో పార్శ్వనాధుడి పాదాల వద్ద యక్ష, యక్షిణిలున్నారు. ఈ విగ్రహం వీర శైవమతానికి చెందిన కంభాలమఠానికి చెందిన సమాధుల దొడ్డిలో ఉందని దీంతో దీన్ని శైవమతానికి చెందిన విగ్రహంగా భావిస్తుంటారు కాని ఇది పార్శ్వనాధుడి విగ్రహమని సతీష్ చెప్పారు.

Palnadu Temples

Palnadu Temples

పోతురాజు విగ్రహం…

పాత మాచర్ల నాగిరెడ్డి బజార్ లోని పురాతన దేవాలమైన పోలేరమ్మ ఆలయంలో గర్భగుడికి ఎదురుగా ఒక రాతిపై నాలుగు వైపులా నలుగురి దిగంబర విగ్రహాలున్నాయి. ఇవి తీర్ధంకరుల విగ్రహాలని సతీష్ తెలిపారు. అయితే స్థానికులు వాటిని పొరపాటున పోతురాజుగా భావించి ఆరాధిస్తున్నారన్నారు. ఈ ఆలయంలోనే క్రీ శ 1313 కాకతీయ కాలం నాటి దాన శాసనం ఉంది. ఇక్కడ పలు విగ్రహాలు తీర్ధంకరుల ఆనవాళ్లను పోలి ఉన్నాయి. అయితే పోలేరమ్మ ఆలయం కావడంతోనే స్థానికులు వాటిని పోతురాజులుగా కొలుస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ రహదారిలో ఉన్న ప్రభుత్వ కాలేజి వెళ్లే దారిలోని నాగబుద్దుని శివాలయంలో పూజలందుకుంటున్న నాగబుద్దుడు కూడా తీర్ధంకురుడే అని ఆయన పేరు సుపార్శ్వనాధుడని చరిత్రకారులు అంటున్నారు. నాగుపాము ఐదు పడగల నీడలో ధ్యాన ముద్రలో ఉన్నవిగ్రహం కచ్చితంగా జైతమత కాలంనాటిదేనంటున్నారు. వీటితో పాటు జైన బసదులు కూడా మాచర్లలో బయటపడ్డాయి. ఎస్సీ హాస్టల్ ఆవరణలోని శిథిలావస్థకు చేరుకున్న జైన బసదిని బాగుచేయించి శివాలయంగా మార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. జైన బసదుల్లో తీర్ధంకురులు ధ్యానం చేసుకునేవారని చరిత్ర చెబుతోంది.

ఇవి కూడా చదవండి

జైనాలయమే చెన్నకేశవాలయం అయిందా….

ప్రస్తుతం పల్నాడు వాసులు భక్తిప్రవత్తులతో కొలుచుకునే చెన్నకేశవాలయం కూడా ఒకప్పుడు జైనాలయమే అయి ఉంటుందన్న వాదన కొంతమంది చరిత్రకారులు వాదిస్తున్నారు. అయితే దీన్ని రుజువు చేసేందుకు చరిత్ర కారులు పరిశోధనలు సాగించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మాచర్ల పట్టణంలో బయట పడుతున్న అనేక విగ్రహాలు జైన మతం వెలుగొందిన అంశాలను తెరపైకి తెస్తున్నాయి. దీంతో మాచర్ల పట్టణంలోని అనేక ఆనవాళ్లను వెలికి తీసి వాటిపై సమగ్ర పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఎంతో పురాతాన చరిత్ర, వాటికి సంబంధించిన ఆనవాళ్లు ఈ మధ్య కాలంలో తరుచూ పల్నాడులో బయటపడుతున్నాయి. ఆనవాళ్లను వెలికి తీయడంతో పాటు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా స్థానికులపై ఉందని సతీష్ అంటున్నారు. విలువైన చారిత్రక సంపదను పరిరక్షించుకోవడం ద్వారా పల్నాడు ప్రాంత చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించిన వారమవుతామని ఆయన చెప్పారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Palnadu Temples 1

Palnadu Temples 1

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి