AP News: మతిస్థిమితం లేదు.. నడుచుకుంటూ నేపాల్‌కు.. కట్ చేస్తే 30 ఏళ్ల తర్వాత
తప్పిపోయిన వ్యక్తి... ముప్పై ఏళ్ల తర్వాత కనిపిస్తే ఎలా ఉంటుంది...? అదీ మతిస్థిమితం లేని వ్యక్తి ఇంటికొస్తే ఇంకెలా ఉంటుంది...? నమ్మాలనిపించట్లేదా..? ఛలో కర్నూల్.
పైన ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు… ఇమ్మానుయేల్. మతిస్థిమితం లేక 30 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులకు దూరమయ్యాడు. ఎక్కడెక్కడో తిరుగుతూ నేపాల్‌కు చేరుకున్నాడు. అక్కడ మానవీయ సేవా కేంద్ర నిర్వాహకులు చేరదీశారు. ఆశ్రమంలోనే ఉంచుకొని వైద్యం చేయించారు. అతను ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో అతి కష్టం మీద తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వాడిగా గుర్తించి పట్టణంలో ఉన్న వేదాస్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతో మాట్లాడి ఎమ్మిగనూరుకు తీసుకొచ్చారు.
ఎమ్మిగనూరులోని ఓ చర్చికి పాస్టర్‌గా పనిచేసిన ఆదాంకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరిలో చిన్నవాడే ఈ ఇమ్మాన్యుయేల్. ఈయనకు మతిస్థిమితం లేకపోవటంతో 30 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. కాలగమనంలో పాస్టర్ ఆదాం, ముగ్గురు కుమారులు, కుమార్తె మృతి చెందారు. అక్క విక్టోరియా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వటంతో వారు వీడియో కాల్ ద్వారా గుర్తించారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇటు ఇమ్మానుయేల్‌ను నేపాల్ నుంచి తీసుకొచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు బంధువులు. వారి దారి ఖర్చులకు రూ.25 వేల ఆర్థిక సాయమందించారు.