తెలుగు రాష్ట్రాలను భారీవర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఏపీలోని సత్యసాయి జిల్లా, కర్నూలు, అనంతపురం జిల్లాలు వరదనీటితో అల్లాడుతున్నాయి. సత్యసాయి జిల్లా గోరంట్ల దగ్గర పెద్దచెరువువంకలో ఓ ప్రైవేట్ బస్సు ఆగిపోయింది. బస్సులోని 30 మంది విద్యార్థులను పోలీసులు, స్థానికులు కలిసి కాపాడారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సుమద్రం చెరువు ఉధృతికి ఓ లారీ అదుపుతప్పింది. వాగు ఉధృతికి బెంగళూరు – కదిరి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చిత్రావతి నది మహోగ్రరూపం దాల్చడంతో బుక్కపట్నం-కొత్తచెరువు మధ్య ప్రయాణాలు ఆగిపోయాయి. అల్లూరి జిల్లాలో వరద బాధితుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. ప్రాణాలకు తెగించి వాగులోంచి తాళ్లసాయంతో ప్రయాణం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో భారీవర్షాలకు నదులు ఉప్పొంగుతున్నాయి. అచ్చంపేట, అమరావతి, పెదకూరపాడు, క్రోసూరు మండలాలను భారీవర్షం అతలాకుతలం చేసింది. పులిచింతల వరద ఉధృతిలో ఇసుకలోడుకు వచ్చిన లారీలు చిక్కుకుపోయాయి. లారీ డ్రైవర్లను స్థానికులు అతికష్టమ్మీద కాపాడారు. భారీవరదలతో గోదావరి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిని మూసేయడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. కర్నూలు జిల్లా వేదావతి ఉధృతికి బ్రిడ్జి దిమ్మ కొట్టుకుపోయింది. భారీ వర్షాలకు రెండురాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. వరదప్రవాహంతో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
తెలంగాణలోనూ భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షబీభత్సానికి జోగులాంబ జిల్లా అయిజ పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద ఉధృతితో బ్రిడ్జిపై నుంచి రాకపోకలు నిలిపివేశారు అధికారులు. ఇద్దరు యువకులు బైకుతో వాగుదాటేందుకు ప్రయత్నించి వాగులో పడిపోయారు. గమనించిన స్థానికులు బైక్‌తోసహా వారిని క్షేమంగా కాపాడారు. వరదకష్టాలతో ఆదిలాబాద్ గిరిజనులు అల్లాడుతున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో రైతులు నిరసనకు దిగారు. బిజ్జూర్ చెక్‌డ్యాం నిర్మాణంతో బ్యాక్‌వాటర్‌తో అవస్థలు పడుతున్నామన్నారు. వాగుదాటే వీళ్లేక పంటలు సాగుచేసుకోలేకపోతున్నామని ఆవేదన చెందారు. వందల ఎకరాలు బీడుభూములుగా మారాయని.. వెంటనే వాగుపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు.
కాగా ఏపీలో రానున్న మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలో రానున్న మూడు రోజులపాటు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ముఖ్యంగా శనివారం విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లో వానలు కురుస్తాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..