AP Politics: హిందూపురం వైసీపీలో రోజుకో ట్విస్ట్‌.. MLC ఇక్బాల్‌-ఆగ్రోస్‌ చైర్మన్‌ నవీన్‌ భేటీ.. నాలుగేళ్ల శత్రుత్వానికి బ్రేక్

Hindupur YCP: నిన్న, మొన్నటివరకూ వాళ్లిద్దరూ ఉప్పు-నిప్పుగా ఉన్నారు. ఇప్పుడు సడన్‌గా దోస్త్‌ మేరా దోస్త్‌ అంటున్నారు. కారణం ఏదైనా..ప్రత్యర్థిని పడగొడతామని, పార్టీని గెలిపిస్తామని శపథం చేశారు. అంతేకాదు..కార్యకర్తల సమక్షంలో ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఒకే పార్టీలో ఉన్నా..నాలుగేళ్లుగా అంటీముట్టనట్లు వ్యవహరించిన ఆ నేతల తీరు చర్చనీయాంశంగా మారిందట. ఇంతకీ ఆ నేతలు ఎవరు..?

AP Politics: హిందూపురం వైసీపీలో రోజుకో ట్విస్ట్‌.. MLC ఇక్బాల్‌-ఆగ్రోస్‌ చైర్మన్‌ నవీన్‌ భేటీ.. నాలుగేళ్ల శత్రుత్వానికి బ్రేక్
Hindupur Politics
Follow us
Nalluri Naresh

| Edited By: Sanjay Kasula

Updated on: Jul 16, 2023 | 8:56 AM

హిందూపురం, జూలై16: శ్రీ సత్యసాయిజిల్లా హిందూపురం వైసీపీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. పార్టీ సీనియర్‌ నేతలు ఎమ్మెల్సీ ఇక్బాల్‌, ఏపీ ఆగ్రోస్‌ చైర్మన్‌ నవీన్‌ నిశ్చల్‌ ఇద్దరూ తమ విభేదాలు పక్కనపెట్టి ఒక్కటయ్యారు. ఓ కౌన్సిలర్‌ ఇంట్లో ఇద్దరు భేటీ అయ్యి, రాజకీయాలపై చర్చించారు. 2019 ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా నవీన్‌నిశ్చల్‌ కాకుండా, మాజీ ఐపీఎస్‌ అధికారి మహమ్మద్‌ ఇక్బాల్‌కు టికెట్ కేటాయించింది అధిష్ఠానం. ఐతే ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బాలకృష్ణపై మహమ్మద్‌ ఇక్బాల్‌ ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుండి ఎమ్మెల్సీ ఇక్బాల్, నవీన్‌ నిశ్చల్‌ల మధ్య పచ్చగడ్డి వేయకముందే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పార్టీ కేడర్‌లో వర్గవిభేదాలు ఏర్పడ్డాయి. ఇద్దరి మధ్య సయోధ్యకోసం అధిష్ఠానం ప్రయత్నించింది. కలిసి పనిచేయాలని అనేకసార్లు సూచించినా ఏ ఒక్కరూ వినలేదు. అలా..దాదాపు నాలుగేళ్లుగా ఇక్బాల్‌, నవీన్‌ ఉప్పు-నిప్పుగానే ఉండిపోయారు.

ఇక ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ అధిష్ఠానం హిందూపురంపై ఫోకస్‌ పెట్టింది. టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. ముందుగా పార్టీలో వర్గ విభేదాలకు చెక్‌ పెట్టాలని ప్లాన్‌ చేసింది. హిందూపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా దీపికారెడ్డిని నియమించింది అధిష్ఠానం. దాంతో ఖంగుతిన్న ఎమ్మెల్సీ ఇక్బాల్‌, నవీన్‌ నిశ్చల్‌ అధిష్ఠానం నిర్ణయానికి తలొగ్గక తప్పలేదు. ఆమె నియామకం జరిగిన 10 రోజుల తర్వాత ఇద్దరు నేతలు ఒక్కటయ్యారు. హిందూపురంలో వైసీపీ జెండా ఎగురవేయడమే తమ లక్ష్యమంటున్నారు వీళ్లు.

ఎమ్మెల్సీ ఇక్బాల్‌, ఆగ్రోస్‌ చైర్మన్‌ నవీన్‌ నిశ్చల్‌ కలయికతో హిందూపురంలో సమీకరణలు మారుతాయా? తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడించడానికి దోహద పడుతుందా? లేక వర్గ విభేదాలతో కొట్టుమిట్టాడుతున్న వైసీపీ అభ్యర్థిని ఓడిస్తారా..? అన్న చర్చ జరుగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం