Tirumala: తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి ఎంత సమయమంటే..?
తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు, వీకెండ్ నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తడంతో శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు కొనసాగుతున్న భక్తుల క్యూలైన్ ఉంది. తిరమలకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ఈ కథనంలో తెలుసుకుందాం ..

వారాంతపు సెలవులు, వరుస హాలీడేస్‌తో కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దాంతో.. తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో కంపార్ట్‌మెంట్‌లన్నీ కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా భక్తులతో నిండాయి. భక్తుల క్యూ లైన్లు శిలాతోరణం వరకు కొనసాగుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సు, నారాయణగిరి షెడ్లు నిండిపోవడంతో భక్తులను ఆక్టోపస్ భవనం నుంచి క్యూ లైన్‌లోకి అనుమతిస్తున్నారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలోని భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, నీరు, పాలు అందిస్తున్నారు.
ఇక.. కొద్దిరోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది. మంగళ, బుధవారాల నుంచి తిరుమలకు భక్తులు తరలిస్తున్నారు. దీనికి తోడు.. వీకెండ్, వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల తాకిడి మరింత పెరిగింది. ఈ క్రమంలోనే.. గురువారం 66వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 4కోట్ల 66లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. అలాగే.. బుధవారం 75వేల మంది వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకోగా.. 4కోట్ల 31లక్షల రూపాయలు కానుకలు చేకూరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇవాళ, రేపట్లో తిరుమలలో భక్తుల విపరీతంగా పెరిగే అవకాశం ఉండడంతో టీటీడీ యంత్రాంగం అప్రమత్తమైంది.
