AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Borewell: చేతిలో కొబ్బరికాయతో భూమి లోపల నీటి జాడను నిజంగా కనిపెట్టవచ్చా..?

భూగర్భ జలాల కోసం బోరుబావులు వేయడానికి ముందు కొబ్బరికాయ, వేపపుల్ల లేదా నీళ్ల చెంబు వంటి సంప్రదాయ పద్ధతులను చాలామంది అనుసరిస్తుంటారు. ఇలాంటివి పల్లెటూర్లలో ఉండే అందరూ చూసే ఉంటారు. ఈ అశాస్త్రీయ పద్ధతుల్లో భూగర్భ జలాలను అసలు ఎలా గుర్తిస్తారు? ...

Borewell: చేతిలో కొబ్బరికాయతో భూమి లోపల నీటి జాడను నిజంగా కనిపెట్టవచ్చా..?
Water Detection
Ram Naramaneni
|

Updated on: Feb 11, 2026 | 11:42 AM

Share

బోరుబావులు వేయించే ముందు భూమి లోపల నీటి జాడను తెలుసుకోవడానికి ఇప్పటికీ చాలామంది విభిన్న పద్ధతులను అనుసరిస్తున్నారు. కొబ్బరికాయ పట్టుకోవడం, Y-ఆకారపు వేపపుల్ల లేదా కానుగు పుల్లలను ఉపయోగించడం, చెంబులో నీళ్లు పోసి నీటి జాడను అన్వేషించడం వంటి సంప్రదాయ పద్ధతులు ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కనిపిస్తాయి. నీటి జాడ ఉన్న చోట కొబ్బరికాయ పైకి లేస్తుందని, పుల్ల గిరగిరా తిరుగుతుందని, లేదా చెంబులోని నీళ్లు పక్కకు ఒలుకుతాయని వీటిని పాటించేవారు నమ్ముతారు. అయితే ఇలా నీళ్లు గుర్తించడంలో కొబ్బరికాయకి, చెంబు నీళ్లకి, లేదా కర్రకి ప్రత్యేక శక్తి ఉందని శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. అయినా కొన్నిసార్లు వీరు చెప్పిన చోటే నీరు పడుతుండటంతో ఇది నిజంగా పనిచేస్తుందా? అనే అనుమానం చాలామందికి వస్తుంది.

ఇందుకు ప్రధానంగా మూడు కారణాలు ఉండొచ్చు. కొందరు నీళ్లు చూసే వారు భూమి తీరును, చెట్ల స్వభావాన్ని, నేల రంగును, పాత బావుల స్థానాలను గమనించి ముందే అంచనా వేస్తారు. అందుకే వారి పాయింట్ కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది. రెండో కారణం.. మన దేశంలో చాలా ప్రాంతాల్లో భూగర్భజలాలు సహజంగానే ఉంటాయి. అందుకే ఇక్కడే నీరు పడుతుంది అని చెప్పిన పాయింట్లలో కొన్నింటికి నీరు పడే అవకాశం ఉంటుంది.

మూడో కారణం మన చేతుల కదలికలు. మనకు తెలియకుండానే చేతులు చిన్న చిన్న కదలికలు చేస్తాయి. అదే సమయంలో కొబ్బరికాయ ఊగినట్లు, పుల్ల తిరిగినట్లు, చెంబులోని నీళ్లు ఒలికినట్లు అనిపించవచ్చు. మొత్తానికి చెప్పాలంటే.. కొబ్బరికాయ, చెంబు నీళ్లతో నీటి జాడ పట్టడం అనేది నమ్మకం ఆధారంగా ఉన్న పద్ధతి.. సైన్స్ ఆధారంగా కాదు.

భూగర్భజలాలను కచ్చితంగా గుర్తించడానికి శాస్త్రీయ పద్ధతుల్లో ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ సర్వే వంటి పరీక్షలు ఉపయోగపడతాయి. కొన్ని చోట్ల పెండులం, ఎల్-రాడ్స్ లాంటి పద్ధతులను కూడా ప్రజలు ఉపయోగిస్తారు. అయితే వీటితో నీటి లోతు, నీటి పరిమాణం వంటి విషయాలను కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి సంప్రదాయ పద్ధతులపై పూర్తిగా ఆధారపడకుండా.. శాస్త్రీయ సర్వేలు, భూగర్భ నిపుణుల సూచనలతో బోరు పాయింట్ నిర్ణయిస్తే సక్సెస్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది.

అయినా భూగర్భ నిర్మాణం, రాళ్ల పొరలు, నీటి ప్రవాహం వంటి సహజ పరిస్థితుల వల్ల.. జియాలజిస్టులు సూచించిన చోట కూడా నీరు పడని సందర్భాలు ఉంటాయి. అందుకే బోరు విజయమో వైఫల్యమో చివరికి భూమి లోపలి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

Also Read: ఈగలు పశువుల వద్దకు రాకుండా చేసే సహజ చిట్కా.. 

Follow Us